Pattabhi Ram: బెదిరిస్తే బెదిరేది లేదు
ABN , First Publish Date - 2023-03-05T02:27:55+05:30 IST
‘రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చెబుతున్నా. మీరు బెదిరిస్తే బెదిరిపోయేదిలేదు. లొంగిపోయేదిలేదు’ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి స్పష్టం చేశారు.
నా గొంతు ఎంతగా నొక్కినా లొంగను
బెయిల్‌పై విడుదలయ్యాక పట్టాభి
రాజమహేంద్రవరం సిటీ, విజయవాడ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు చెబుతున్నా. మీరు బెదిరిస్తే బెదిరిపోయేదిలేదు. లొంగిపోయేదిలేదు’ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శనివారం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. గన్నవరం ఘర్షణల ఘటనలో ఇటీవల అరెస్టు అయిన ఆయనతోపాటు మరొక 10 మంది కూడా విడుదలయ్యారు. వారికి టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బు చ్చయ్య చౌదరి నేతృత్వంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు.
లైట్లు తీసేసి.. ముఖానికి ముసుగేసి.. చిత్రహింసలు పెట్టారు
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలైన పట్టాభి విజయవాడలోని తన స్వగృహంలో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. అరెస్టు చేసి తీసుకెళ్లాక పోలీస్‌స్టేషన్‌లో తనకు చిత్రహింసలకు గురిచేశారని ఆయన తెలిపారు. ‘ఊరంతా లైట్లు వెలుగుతున్నా.. పోలీ్‌సస్టేషన్‌లో కరెంటు లేదు. స్టేషన్‌లో సిబ్బంది ఎవరూ కనిపించలేదు. నన్ను స్టేషన్‌లో కూర్చోబెట్టి ఎస్‌ఐలు ఇద్దరూ బయటకు వెళ్లిపోయారు. తర్వాత ముగ్గురు వ్యక్తులు సివిల్ డ్రెస్‌లో ముసుగులు వేసుకుని వచ్చారు. నా ముఖానికి టవల్ చుట్టి ఈడ్చుకుంటూ గదిలోకి తీసుకెళ్లారు. అరగంటపాటు చిత్రహింసలు పెట్టారు. కాళ్లు, చేతులపై బాగా కొట్టారు. అతికష్టం మీద వచ్చిపైకి లేచి, కుర్చీలో కూర్చున్న తర్వాత ఎస్‌ఐలు ఇద్దరూ లోపలకు వచ్చారు’ అని పట్టాభి వివరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సీఎంకు పోలీసు అధికారులు సరెండర్ అయ్యారన్నారు. ‘గన్నవరంలో నాపై హత్యాయత్నం చేసి, ఆ కేసును నాపైనే పెట్టారు. ఇన్‌స్పెక్టర్‌పై దాడి జరిగినప్పుడు నేను అక్కడ లేను. ఈ విషయంలో పోలీసులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇన్‌స్పెక్టర్ పై దాడిచేసింది వైసీపీ నాయకులే. వారిపై చర్యలు తీసుకోవాలి. బాధితులను నిందితులుగా మార్చడం సరికాదు’ అని అన్నారు.