Share News

YCP Leaders : వైసీపీలో ముసలం!

ABN , First Publish Date - 2023-12-12T03:40:01+05:30 IST

పాలకపక్షం వైసీపీలో ముసలం పుట్టింది. ఇన్‌చార్జుల వ్యవహారం రాజీనామాల వరకు వెళ్లింది. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ..

YCP Leaders : వైసీపీలో ముసలం!

అటు రాజీనామాలు ఇటు సిటింగ్‌లకు ఎసరు!

అయోమయంలో జగన్‌

11 స్థానాల్లో వైసీపీ ఇన్‌చార్జుల మార్పు

ఆ జాబితాలో ముగ్గురు మంత్రులూ..

మద్దాలి గిరి, ఆళ్ల, తిప్పలకు మొండిచేయి

టీజేఆర్‌ సుధాకరబాబుకు కూడా..

అధికార పక్షంలో భారీ కుదుపు

100 చోట్ల సిటింగ్‌లు గెలవలేరని

వైసీపీ అంతర్గత సర్వేల్లో వెల్లడి

మున్ముందు చాలా మంది మార్పు!

సిటింగ్‌లలో టికెట్ల భయం

నాయకత్వంతో పెరుగుతున్న అంతరం

ఈసారి పోటీకి కొందరి విముఖత!

మరికొందరి పక్కచూపులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పాలకపక్షం వైసీపీలో ముసలం పుట్టింది. ఇన్‌చార్జుల వ్యవహారం రాజీనామాల వరకు వెళ్లింది. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శాసనసభ్యత్వానికే గాక పార్టీకి కూడా రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. అలాగే జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను గాజువాకలో ఓడించిన తిప్పల నాగిరెడ్డి కుమారుడు, ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి దేవన్‌రెడ్డి కూడా రాజీనామాబాట పట్టారు. దీంతో జగన్‌ అయోమయానికి గురయ్యారు. సోమవారం రాత్రి 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జులను ప్రకటించారు. ఇంతకాలం రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలూ వైసీపీవేనంటూ ప్రచారం చేసుకున్న ఆయన.. ఇప్పుడు ముగ్గురు మంత్రుల నియోజకవర్గాలను మార్చేశారు. మాజీ మంత్రి మేకతోటి సుచరితను కూడా కొత్త స్థానానికి పంపారు. నమ్మిన బంటుగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకరబాబు, టీడీపీ నుంచి వచ్చిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌కు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో పాటు ఆయన కుమారుడు, ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి తిప్పల దేవన్‌రెడ్డికి కూడా మొండిచేయి చూపారు. 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జులను ప్రకటించగా.. వీరిలో వైద్య ఆరోగ్య మంత్రి రజనిని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు.. సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగ నాగార్జునను వేమూరు (ఎస్సీ) నుంచి సంతనూతలపాడు (ఎస్సీ)కి.. మున్సిపల్‌ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను యర్రగొండపాలెం నుంచి కొండపికి మార్చారు. ప్రత్తిపాడు (ఎస్సీ) ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి మేకతోటి సుచరితను.. తాడికొండ (ఎస్సీ)కి ఇన్‌చార్జిగా నియమించారు. చిలకలూరిపేటకు మల్లెల రాజేశ్‌నాయుడు, అద్దంకికి పాణెం హనిమిరెడ్డి.. మంగళగిరికి గంజి చిరంజీవి, రేపల్లెకు డాక్టర్‌ ఈవూరు గణేశ్‌, గాజువాకకు వరికూటి రామచంద్రరావు, వేమూరుకు అశోక్‌బాబు, ప్రత్తిపాడుకు బాలసాని కిరణ్‌కుమార్‌ కొత్త ఇన్‌చార్జులుగా నియమితులయ్యారు. ఈ పరిణామం వైసీపీని కుదిపివేస్తోంది. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందిస్తున్నామని.. 87 శాతం మంది లబ్ధిదారులు జగన్‌తోనే ఉన్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయని వర్క్‌షాపుల్లో, కేబినెట్‌ భేటీల్లో చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి.. ఆకస్మికంగా 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జులను ప్రకటించడం గమనార్హం.

వారికి ఎదురుగాలి!

ఈసారి ప్రత్తిపాడు నుంచి పోటీ చేస్తే సుచరిత ఓటమి తప్పదని ఐప్యాక్‌ టీమ్‌ నివేదిక ఇచ్చింది. దీంతో ఆమెను.. వైసీపీ నుంచి సస్పెండ్‌ చేసిన ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడికొండకు పంపారు. వాస్తవానికి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను మొదట నియమించారు. అప్పట్లో శ్రీదేవి ఆందోళన వ్యక్తంచేయడంతో ఆయన్ను తప్పించి కత్తి సురేశ్‌ను ఇన్‌చార్జిగా వేశారు. ఇప్పడు ఆయనకూ మొండిచేయి చూపి సుచరితను తెచ్చారు.

యర్రగొండపాలెం ఎమ్మెల్యే అయిన మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు ఈసారి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని సర్వేలో తేలింది. దీంతో ఆయన్ను కొండపికి పంపారు. వేమూరులో మంత్రి మేరుగ నాగార్జున, సంతనూతలపాడులో టీజేఆర్‌ సుధాకరబాబు ఓడిపోతారని పలు సర్వేలు చెప్పడంతో.. సుధాకర్‌బాబును పోటీ నుంచి తప్పించి నాగార్జునను సంతనూతలపాడుకు పంపారు. వేమూ రు కొత్త ఇన్‌చార్జిగా వి.అశోక్‌బాబును నియమించారు. రాష్ట్రంలో దాదాపు వంద నియోజకవర్గాల్లో సిటింగ్‌లకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. వారిని అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఉందని సర్వే నివేదికలు వెల్లడించినట్లు వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం 11 మందిని మార్చారని.. మున్ముందు మరిన్ని నియోజకవర్గాల్లో మార్పులూ చేర్పులూ ఉంటాయని ఆ వర్గాలు చెబుతున్నాయి.

‘ఫ్యాన్‌’ ఉక్కిరిబిక్కిరి!

సార్వత్రిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు తప్పవని అంతర్గత సర్వేలు చెబుతుండడంతో వైసీపీ పెద్దలకు ఊపిరాడడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందనుకున్న చోట.. టీడీపీ సీనియర్‌ నేతలను గట్టిగా ఎదుర్కొనే సత్తా లేదనుకున్న ఎమ్మెల్యేలను పక్కనపెట్టాలని నిర్ణయించారు. వారిని సంప్రదించకుండా.. కనీసం మాటమాత్రమైనా చెప్పకుండా ఏకపక్షంగా ఇన్‌చార్జులను నియమిస్తోంది. దీనిని భరించలేక కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. పార్టీ విధేయులను కాదని గెలుపు గుర్రాల పేరిట వేరేవారికి. టికెట్లు ఇవ్వాలనుకోవడం సహించలేకపోతున్నారు. సోమవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిప్పల దేవన్‌రెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పేయడంతో సీఎం జగన్‌, ప్రభుత్వ పెద్దలు బిత్తరపోయారు. మళ్లీ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆఽశలు లేకపోవడంతో.. వైసీపీలో ఉన్నా ఒక్కటే.. వైదొలగినా ఒక్కటేనన్న అభిప్రాయం చాలా మంది ఎమ్మెల్యేలు, నేతల్లో ఏర్పడింది. అలాంటివారిని పిలిచి నచ్చజెప్పే అలవాటు జగన్‌కు లేదు. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించి నష్ట నివారణ చేద్దామనుకున్న కొందరు మంత్రులు, ముఖ్య నేతలకు ఆయన్ను కలిసే అవకాశం దొరకడం లేదు.

వాడుకుని వదిలేయడం..

ఇప్పటికే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు.. ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్‌), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)లను సస్పెండ్‌ చేయడంతో వారు పార్టీకి దూరమయ్యారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఐదో ఎమ్మెల్యే. చంద్రబాబుపై కేసులు పెట్టించేందుకు ఆయన్ను సీఎం జగన్‌ వాడుకున్నారని రాజకీయ వర్గాలు విమర్శిస్తుంటాయి.

కంచుకోటలు బద్దలు..!

ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉండేది. 2019 ఎన్నికల్లో పదికి పది స్థానా లనూ గెలుచుకుంది. కానీ, ఓదార్పు యాత్ర సమయంలో జగన్‌ వెన్నంటి నడచిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని దెబ్బతీయాలని ప్రభుత్వ పెద్దలు చూశారు. దీంతో ఆయన తిరుగుబాటు చేశారు. అటు వెంకటగిరి ఎమ్మెల్యే, సీనియర్‌ నేత ఆనం రామనారాయణరెడ్డికి కూడా పొగబెట్టారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ అనూహ్య విజయంతో.. ప్రభుత్వ పెద్దలు బిత్తరపోయారు. కోటంరెడ్డి, ఆనంతో పాటు ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి అధికార పక్ష అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేశారన్న ముద్రవేసి వారిని సస్పెండ్‌ చేశారు. వారు కూడా టీడీపీ వైపు వెళ్లిపోయారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి అభ్యర్థుల కొరతే లేదని ఒకానొక దశలో అనుకున్నారు. ఇప్పుడు సరైన అభ్యర్థుల కోసం గాలిస్తున్నారు.

గోదావరిలోనూ ఎదురుగాలి..

గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు గాను 13 చోట్ల వైసీపీ గెలిచింది. రెండు ఎంపీ స్థానాలు కూడా దక్కాయి. కానీ వైసీపీకి తొలి దెబ్బ ఇక్కడే తగిలింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్‌పై తిరుగుబాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. ఇక్కడ 19 స్థానాలకు గాను ఆ పార్టీ 14 చోట్ల గెలిచింది. ఇప్పుడీ జిల్లాలో వైసీపీలో కుమ్ములాటలు పెరిగిపోయాయి. ఒకరిపై మరొకరు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. మంత్రి చెల్లుబోయిన వేణగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మధ్య వైరం తీవ్రస్థాయికి చేరింది. అమలాపురంలో మంత్రి పినిపె విశ్వరూప్‌, ఎంపీ చింతా అనూరాథ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది.

ఉత్తరాంధ్రలోనూ అసమ్మతి..

గత ఎన్నికల్లో సంపూర్ణంగా వైసీపీకి అండగా నిలిచిన ఉత్తరాంధ్రలో ఆ పార్టీకి ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీనికితోడు నేతల్లో విభేదాలు పెరిగాయి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది. విశాఖపట్నం జిల్లాలో గడప గడపకూ వెళ్తున్న ఎమ్మెల్యేలపై జనం విరుచుకుపడుతున్నారు. అభివృద్ధి, రోడ్ల దుస్థితిపై నిలదీస్తున్నారు. నిధులు అడిగితే ప్రభుత్వం ఇవ్వడం లేదు. వలంటీర్లకు ప్రాధాన్యమిస్తూ తమను పక్కన పెట్టేసిందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఈ దఫా పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నారని.. ఇంకొందరు పక్కచూపులు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

కొత్త ఇన్‌చార్జులు వీరే..

గుంటూరు పశ్చిమ విడదల రజని

సంతనూతలపాడు(ఎస్సీ) మేరుగ నాగార్జున

కొండపి(ఎస్సీ) ఆదిమూలపు సురేశ్‌

తాడికొండ(ఎస్సీ) మేకతోటి సుచరిత

ప్రత్తిపాడు (ఎస్సీ) బాలసాని కిరణ్‌కుమార్‌

వేమూరు(ఎస్సీ) వి.అశోక్‌బాబు

మంగళగిరి గంజి చిరంజీవి

చిలకలూరిపేట మల్లెల రాజేశ్‌నాయుడు

అద్దంకి పాణెం హనిమిరెడ్డి

రేపల్లె డాక్టర్‌ ఈవూరు గణేశ్‌

గాజువాక వరికూటి రామచంద్రరావు

Updated Date - 2023-12-12T03:40:02+05:30 IST