సంచార వైద్యంతో సరి!

ABN , First Publish Date - 2023-04-03T02:07:23+05:30 IST

రాష్ట్రంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ తర్వాత స్థానంలో ఉన్న గొర్రెలు, మేకల పెంపంకంపై ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంచార వైద్యంతో సరి!

గొర్రెలు, మేకల అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు శూన్యం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ తర్వాత స్థానంలో ఉన్న గొర్రెలు, మేకల పెంపంకంపై ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రోత్సహించడం, వాటి వ్యాధుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించి నివారించడం రాష్ట్ర పశుసంవర్థక శాఖ ప్రధాన విధి. దీనికిగాను వార్షిక బడ్జెట్‌లో కొంత మేరకు నిధులు కేటాయిస్తారు. ఈ నిధులను గొర్రెలు, మేకల పెంపకందారులకు పంపిణీ చేసి.. జీవాల కొనుగోలు, వ్యాధుల నివారణకు వినియోగించేలా చర్యలు తీసుకుంటారు. అయితే.. 2023-24 వార్షిక బడ్జెట్‌లో రూపాయి కూడా తమకు కేటాయించలేదని పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వైఎస్సార్‌ పశుసంచార వైద్యశాలలను ప్రవేశ పెట్టామని, జీవాలకు సంక్రమించే వ్యాధులకు వైద్యం అందిస్తున్నామని ఆర్థిక మంత్రి బుగ్గన తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు తప్ప.. ఎలాంటి నిధులూ కేటాయించకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. 10లక్షల మందిపైగా ఉన్న గొర్రెలు, మేకల పెంపకందార్ల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందంటున్నారు. గొర్రెలు, మేకలకు ఏటా నాలుగుసార్లు నిర్వహించే డీవార్మింగ్‌, అలాగే వ్యాక్సిన్లు రెండుసార్లు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో జీవాలు వ్యాధుల బారినపడి మృత్యువాతపడుతున్నాయని పెంపకందారులు ఆవేదన చెందుతున్నారు. 2.32 కోట్ల గొర్రెలు, మేకలతో, ఏటా 11లక్షల మెట్రిక్‌ టన్నుల మాంస ఉత్పత్తితో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉన్నా పెంపకందారులకు మాత్రం ప్రోత్సాహం కరువైంది.

పరిహారం కరువు!

ప్రకృతి విపత్తులు, ఇతర కారణాలతో గొర్రెలు, మేకలు ఆకస్మికంగా మృతి చెందితే.. పశునష్ట పరిహారం కింద ఒక్కో గొర్రె, మేకకు రూ.6 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, గత మూడేళ్లలో దీనికి సంబంధించి రూ.50 కోట్ల వరకు పరిహారం చెల్లించకుండా బకాయిలు పెట్టినట్లు పెంపకందారులు చెబుతున్నారు.. వైఎస్సార్‌ చేయూత, జీవక్రాంతి పథకం కింద మహిళలకు లక్షా 13వేల గొర్రెలు, మేకలను ప్రభుత్వం పంపిణీ చేసింది. కానీ, యూనిట్ల కొనుగోలు నిబంధనల్లో లొసుగుల కారణంగా అధిక శాతం లబ్ధిదారులు గొర్రెలు, మేకలను కొద్ది రోజులకే అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. కొందరు మేతకు తోలకుండా కోతకు తరలించారు. దీంతో జీవ క్రాంతి పథకం అటకెక్కింది. సంప్రదాయంగా జీవాలను పెంచుతున్న వారికి మాత్రం ప్రోత్సాహం లేకుండా పోతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,420 గొర్రెలు, మేకల ప్రాథమిక సహకార సంఘాలున్నాయి. జీవాల కొనుగోలుకు, పెంపకం ఖర్చులకు రుణాలు, సబ్సిడీలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పెంపకందారులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి.. తమకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

Updated Date - 2023-04-03T02:07:23+05:30 IST