OHRK Adinarayana Reddy: కాగితం పులి!

ABN , First Publish Date - 2023-03-06T02:27:55+05:30 IST

వివేకా కేసులో నా పాత్ర ఉందని నాపై ఫోకస్‌ చేసి.. ఎక్కడకు పోయినా ఇదే అడిగేవాళ్లు. ఆ తర్వాత విచారిస్తే వివేకా విషయంలో నేను వంద శాతం చేశానని కూడా నమ్మామని చెప్పారు. నా ఓటమికి అదే ప్రధాన కారణం.

OHRK Adinarayana Reddy: కాగితం పులి!

జగన్‌ దొంగ మాటలు చెబుతాడు.. ఎవరైనా ‘సార్‌’ అనాల్సిందే

పట్టిసీమ, అసెంబ్లీ బాయ్‌కాట్‌పైనే ఆయనతో నాకు విభేదాలు

‘జీఎస్టీ’ కంటే ‘జేఎస్టీ’ పవర్‌ఫుల్‌

జగన్స్‌ సెల్ఫ్‌ టాక్స్‌ను ఎవరూ తట్టుకోలేకపోతున్నారు

చిన్నాన్నను చంపి మాపై నెట్టారని జనం తెలుసుకున్నారు

బీజేపీలోనే ఉంటా.. టీడీపీ, జనసేనతో పొత్తుకు యత్నిస్తా

‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’లో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి

రాష్ట్రంలో ‘జీఎస్టీకంటే జగన్‌ సెల్ఫ్‌ ట్యాక్స్‌(జేఎ్‌సటీ) బాగా పవర్‌ఫుల్‌ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి అన్నారు. దానిని ఎవరూ తట్టుకోలేకపోతున్నారని.. కప్పం కట్టకుంటే పరిశ్రమలు వచ్చే పరిస్థితే లేదని చెప్పారు. జగన్‌ కాగితం పులి అన్నారు. సొంత చిన్నాన్న హత్య కేసును ఇతరులపై నెట్టేశారని ప్రజలు పూర్తిగా గ్రహించారని తెలిపారు. బీజేపీని వీడనని.. టీడీపీ, జనసేనతో కలిసి పొత్తులో పోటీచేసేందుకు ప్రయత్నిస్తామని.. కుదరకపోయినా పార్టీ మారనని స్పష్టంచేశారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యాంశాలివీ..

ఆర్కే: సీమ వ్యక్తులు మొరటుగా కనిపిస్తుంటారు. కానీ చదువులు చాలా బాగా ఉంటాయి కదా?

ఆదినారాయణరెడ్డి: ఒకసారి చంద్రబాబు మీ ఎడ్యుకేషన్‌ ఏమిటని అడిగితే.. పొలిటికల్‌ కెమిస్ట్రీ అన్నాను. అదేమిటంటే.. అవునండీ పాలిటిక్స్‌ విత్‌ కెమిస్ట్రీ కదా అన్నాను. నేను కాన్పూర్‌లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేశాను. తర్వాత ప్రొద్దుటూరులో లెక్చరర్‌గా చేశాను.

ఆర్కే: రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?

ఆదినారాయణరెడ్డి: 1990లో మా పెదనాన్నను హత్య చేశాక మేమంతా కుటుంబ పరంగా ఆలోచించి రాజకీయాల్లోకి రావడం మొదలైంది. శివారెడ్డితో ఉన్నప్పుడు మా నాన్నను 1978లో, శివారెడ్డిని వ్యతిరేకించిన తర్వాత మా పెదనాన్నను చంపేశారు.

ఆర్కే: శివారెడ్డిని మీరు చంపేశారు కదా!

ఆదినారాయణరెడ్డి: అది వర్గ పోరాటం. ఫ్యాక్షన్‌ మీన్స్‌ వర్గ పోరాటం.

ఆర్కే: ఫ్యాక్షన్‌ కేసుల్లో జగన్‌ కంటే మీ నాలెడ్జ్‌ ఎక్కువంటారు?

ఆదినారాయణరెడ్డి: జగన్‌ కాగితం పులి. ఆయన దొంగమాటలు చెబుతారు. మేం ఆ మాదిరి మాటలు చెప్పం. అధికారం కోసం మాటలు చెప్పే నీచ కల్చర్‌ మా దగ్గర లేదు. సోనియాపై తిరుగుబాటు చేసిన జగన్‌ ఎంపీగా పోటీ చేసిన సమయంలో నేను అధికార పార్టీలో ఉన్నాను. ఆరోజున నాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదు. ఈ రోజు బీజేపీలో ఉన్నా. నాపై జగన్‌ రెడ్డి సీఐడీ కేసు, ఎస్సీ, ఎస్టీ కేసు, ఫ్యాక్షన్‌ కేసు అన్నీ మోపాడు. నన్ను అరెస్టు చేయడానికి విశ్వప్రయత్నం చేశారు. నేను తెలివైన వాడిని కాబట్టి మంచి లాయర్‌ను పెట్టుకుని సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడాను.

ఆర్కే: మీ ఏరియాలో ప్రాజెక్టు కడితే కప్పం కట్టాలట కదా!

ఆదినారాయణరెడ్డి: నా హయాంలో దాల్మియా సిమెంట్స్‌ వచ్చింది. మైసూరారెడ్డికి చెందిన తేజా సిమెంట్స్‌ పరిశ్రమకు అనుమతి వచ్చింది. తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో మైసూరారెడ్డి కప్పం కట్టలేక ఆ పరిశ్రమ రాలేదు. దాల్మియా రెండో దశ రాలేదు. జీఎస్‌టీ కంటే జేఎ్‌సటీ పవర్‌ఫుల్‌గా ఉంది. ‘జగన్‌ సెల్ఫ్‌ ట్యాక్స్‌’ను తట్టుకోలేకపోతున్నారు. జగన్‌కు ఆస్తులు ఎన్నిచోట్ల ఉన్నాయో ఆయనకే తెలియదు. పద్మనాభస్వామికి నేలమాళిగలు ఉన్నట్లే ఎన్ని నేలమాళిగలు ఉన్నాయో లెక్కేలేదు. ఆయన అనంత పద్మనాభస్వామి అయితే.. ఈయన అనంత జగన్నాథస్వామి. అప్పులు చేయడంలో ఎక్స్‌పర్ట్‌. తప్పులు చేయడంలో, దౌర్జన్యం.. అన్యాయం చేయడంలోనూ ఎక్స్‌పర్ట్‌.

ఆర్కే: జగన్‌తో ఎందుకు తేడా వచ్చింది?

ఆదినారాయణరెడ్డి: జగన్‌తో చాలా సన్నిహితంగా ఉండేవాడిని. నేను పట్టిసీమ మంచిదంటాను. మంచిదే అయినా పార్టీపరంగా చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది కదా అని జగన్‌ అంటారు. పట్టిసీమ నీళ్లు ఆంధ్రాకు వస్తే.. కృష్ణాజలాలు సీమకు వాడుకోవచ్చు కదా అంటాను నేను. దానికి చంద్రబాబు ఓడితే కదా మనం గెలిచేది అంటారు జగన్‌. ఇదే మొదటి విభేదం. మా వియ్యంకుడు చంద్రశేఖర్‌ ద్వారా ఒక రాయబారం పంపారు. మేఘా కృష్ణారెడ్డి దగ్గర కొన్ని పనులు తీసుకోవచ్చు కదా అన్నారు. నాకు అక్కర్లేదని చెప్పాను. అసెంబ్లీ బాయ్‌కాట్‌ చేయమంటే కాదన్నాను. దాంతో విభేదాలు ఎక్కువయ్యాయి. తర్వాత ఇప్పటి శ్రీశైలం ఎమ్మెల్యే ద్వారా చంద్రబాబు నుంచి రాయబారం వచ్చింది. మొదట లోకేశ్‌తో మాట్లాడాను. జగన్‌లాగా సార్‌ అని పిలవమంటే కుదరదు.. నీస్థాయి గొప్పంటే ఒప్పుకోనని చెప్పాను. లోకేశ్‌ కూడా.. అన్నా నేను మీ కొడుక్కంటే చిన్నోడిని. పేరు పెట్టి పిలిచినా అభ్యంతరం లేదన్నారు.

ఆర్కే: మీరు జగన్‌ను సార్‌ అని పిలిచేవారా?

ఆదినారాయణరెడ్డి: ఒక్కసారి కూడా పిలవలేదు. సార్‌ అనడం నాకు ఇష్టం ఉండదు. అనాల్సిందేనని మిగిలినవాళ్లకు ఆ కండిషన్‌ పెట్టేవాడు. అది ఆయన అహం. ఆయనముందు కుర్చీలో కూర్చునే పరిస్థితి కూడా ఎవరికీ లేదు. ఆయన సిట్‌ అంటే సిట్‌. స్టాండ్‌ అంటే స్టాండ్‌. జగన్‌ వానపామును చూపించి ఇది నాగు పాము అంటే.. అమ్మో ఎంత పడగ అనే వాళ్లే. అంతా వందిమాగధులే. నేను వందేమాతరం అనేవాడిని. మళ్లీ పార్టీలోకి వస్తారా అంటే.. నేను రాను.. మరో వివేకానందరెడ్డి కాదలచుకోలేదని చెప్పాను.

ఆర్కే: జగన్‌ రాగానే మీతోపాటు కొందరు బీజేపీలో చేరారు!

ఆదినారాయణరెడ్డి: చంద్రబాబుకు చెప్పేపోయాం. బీజేపీతో వైరం తెచ్చుకోవద్దని, జగన్‌ సామాన్యుడు కాదని కూడా చెప్పాను. సీట్లతో పాటు, ఇంకా ఏదైనా ఇవ్వాలంటే బీజేపీకి ఇవ్వండని చెప్పాను. చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన కంటే రాష్ట్రం బాగా నష్టపోయింది. చెప్పినా వినని పరిస్థితుల్లో ఆయన ఆధ్వరంలో పరుగెత్తినా పని జరగదు కాబట్టి బీజేపీలోకి పోయాం. కొంత కవరేజ్‌ ఉంటుంది. అలాగే కొన్ని పనులు అవుతాయని పోయాం. నేను బీజేపీలో చేరాక కూడా సిట్‌తో నన్ను 2గంటలు విచారించారు. నన్ను ఇరికిస్తారని తెలిసినప్పుడే సీబీఐ విచారణ కావాలని కోర్టుకు పోయాను. సునీత, బీటెక్‌ రవి కూడా కోర్టుకు వెళ్లారు. దాంతో సీబీఐ విచారణ వచ్చింది. వివేకా కేసు నుంచి బయటపడ్డాం. సీబీఐ నన్ను పిలవలేదు. అలా పిలిచేలాచేయండి. నాకు తెలిసింది చెబుతా. మొదటి రోజే ఈ కేసులో నా ప్రమేయం ఉంటే ఎన్‌కౌంటర్‌ చేయాలని కోరాను. వాళ్లు ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి ఆదినారాయణరెడ్డిని సీబీఐ విచారించాలని లెటర్‌ పంపమనండి. విచారణ ఎదుర్కొంటాను. నాకు తెలిసిన వరకూ మోదీకి ఆయనపై ప్రత్యేక ప్రేమ లేదు. లేటెస్ట్‌ కేసు వివేకా, లేటెస్ట్‌ కేసు అప్పుల కేసు, సీబీఐ కేసుల విషయంలో ఢిల్లీ పెద్దలు నిక్కచ్చిగా ఉన్నారు. మద్యం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడినే అరెస్టు చేశారు కదా! విజయసాయిరెడ్డి అల్లుడి అన్నను అరెస్టు చేశారు. కాబట్టి ఢిల్లీతో నో రిలేషన్‌.. నో రియాక్షన్‌.

ఏపీలో బీజేపీకి 8 శాతం ఓటింగ్‌ వరకూ వెళ్లింది.. మొన్న 0.5కు పడిపోయింది. ఇప్పుడదీ ఉందో లేదో!

మా రాష్ట్ర అధ్యక్షుడికి అన్నీ చెప్పాం. ఆయన పార్టీలో చాలా సీనియర్‌. ఆయన మా మాట వినే పరిస్థితి లేదు.

ఆర్కే: రామసుబ్బారెడ్డి, మీరు టీడీపీలోనే ఉండి కూడా మొన్న ఓడిపోయారు కదా!

ఆదినారాయణరెడ్డి: వివేకా కేసులో నా పాత్ర ఉందని నాపై ఫోకస్‌ చేసి.. ఎక్కడకు పోయినా ఇదే అడిగేవాళ్లు. ఆ తర్వాత విచారిస్తే వివేకా విషయంలో నేను వంద శాతం చేశానని కూడా నమ్మామని చెప్పారు. నా ఓటమికి అదే ప్రధాన కారణం. ఆ రోజున టీడీపీకి కూడా ఇదే అంశం షాక్‌ కొట్టింది. దగ్గరదగ్గర 50 సీట్లలో ఓడిపోవడానికి కారణం వివేకా హత్య. వందశాతం వాళ్లు చెప్పిం ది నమ్మేశారు. ఇప్పుడు చాలా బాగా రియలైజై రియాక్ట్‌ అవుతున్నారు. సొంత చిన్నాన్నను చంపి అవతలి వ్యక్తులపై తోసి మమ్మల్ని కూడా నమ్మేలా చేశారు కదా అని జనం తెలుసుకున్నారు. తప్పు తమవల్ల కూడా జరిగిందని తెలుసుకున్నారు.

ఆర్కే: మరి మీ దారి మీరు వెతుక్కోవాలి కదా!

ఆదినారాయణరెడ్డి: లేదు... వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఫైట్‌ చేస్తే సులభమవుతుందని మా ఆలోచన. నాయకత్వం ఒప్పుకోకుంటే ఇదే పార్టీలో ఉండి ఫైట్‌ చేస్తాను. కలపడం లేదా కంటిన్యూ కావడం అని డిసైడయ్యాను. పవన్‌ను నాయకుడిగా ఉంచి మిగిలినవాళ్లను కలుపుకొని ముందుకు పోవాలన్నది ప్రధాని ఆలోచన. పొత్తులు కుదురుతాయన్న ఆశతో ఉన్నాం. కుదరకున్నా బీజేపీని వీడేది లేదు.

ఆర్కే: జగన్‌ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు కదా!

ఆదినారాయణరెడ్డి: 175లో 60 వస్తే గొప్ప. ఈ పరిస్థితి ఉందని నివేదికలూ వస్తున్నాయి.

Updated Date - 2023-03-06T03:17:34+05:30 IST