NTR Anna garu : అన్నగారంటే.. ఎన్టీఆర్‌ ఒక్కరే

ABN , First Publish Date - 2023-05-27T03:59:46+05:30 IST

తెలుగునాట అన్న అంటే.. ఎన్టీఆర్‌ అన్నట్టుగా ఆ పదం ఆయనతో ముడిపడిపోయింది. ఎన్టీఆర్‌కు ముందు రాజకీయ నేతలను అన్న అని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకున్న..

NTR Anna garu : అన్నగారంటే.. ఎన్టీఆర్‌ ఒక్కరే

తెలుగునాట అన్న అంటే.. ఎన్టీఆర్‌ అన్నట్టుగా ఆ పదం ఆయనతో ముడిపడిపోయింది. ఎన్టీఆర్‌కు ముందు రాజకీయ నేతలను అన్న అని ప్రజలు ఆప్యాయంగా పిలుచుకున్న దాఖలాలు లేవు. వారిని అయ్యా అనో, దొరవారనో, దొరా అనో సంబోధించేవారు. ఎన్టీఆర్‌ తనకు తాను బహిరంగ సభల్లో ప్రజలకు అన్నగా పరిచయం చేసుకున్నారు. ‘నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు’ అంటూ ఆయన ప్రసంగం ప్రారంభించేవారు. ప్రజలు, నేతలు కూడా ఆయనను అన్నా అని పిలవడానికి అలవాటు పడిపోయారు. గౌరవంగా పిలవాల్సి వస్తే అన్నగారు అని అనేవారు. చివరకు ఎన్టీఆర్‌ అల్లుడు చంద్రబాబు కూడా వేదికలపై ఆయనను అన్నగారు అనే మాట్లాడేవారు. తర్వాతి కాలంలో ఎంతమంది అన్నలు వచ్చినా ఒక తరం తెలుగువారిలో అన్న అంటే ఎన్టీఆర్‌ అనే ముద్ర పడిపోయింది.

విపక్షానికీ జై : మహిళలకు మేలు చేసేదైతే...

ప్రైవేటు సభ్యులు పెట్టే బిల్లులు పాస్‌ కావని తెలిసినా 1985లో అసెంబ్లీలో బీజేపీ పక్ష నాయకుడిగా ఉన్న సి.హెచ్‌ విద్యాసాగర్‌రావు బహు భార్యత్వానికి సంబంధించి భారత శిక్ష్మా స్మృతిలోని ఐపీసీ సెక్షన్లు 494, 495, 496లను నాన్‌బెయిల్‌బుల్‌, కాగ్నిజబుల్‌ నేరాలుగా సవరించాలనే బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ సవరణతో బాధిత మహిళలకు న్యాయం జరుగుతుందన్నది ఆయన ఉద్దేశం. ఆ వెంటనే ఈ బిల్లు అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఆ సందర్భంగా ఎన్టీఆర్‌కు అప్పటి టీడీపీ విప్‌ ఫోన్‌ చేశారు. ‘‘బిల్లును మేం వ్యతిరేకించాలి కదా’’ అని అడిగారు. స్పందించిన ఎన్టీఆర్‌ ఈ బిల్లు ఎవరి కోసం అని అడగ్గా మహిళలకు మేలు చేసేదని విప్‌ చెప్పడంతో సదరు బిల్లును సమర్థించాలన్నారు. దీంతో సదరు ప్రైవేటు బిల్లు పాసయింది.

పేదల కోసం : మోత్కుపల్లి గానం.. పక్కా ఇళ్ల పథకం!

నివసించడానికి గూడు లేక సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు ఎన్టీఆర్‌ తీసుకున్న ‘పేదవాడికి పక్కా గృహ నిర్మాణం’ నిర్ణయం ఓ వరంలా మారింది. అసలు ఈ నిర్ణయం ఎలా తీసుకోవడం వెనుక ఏం జరిగిందంటే..... తల దాచుకోవడానికి ఇల్లు లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతున్న నిరుపేదల దుర్భర జీవనాన్ని పాట రూపంలోకి మార్చిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు... దాన్ని ఎన్టీఆర్‌ ముందు పాడి వినిపించారు. ఆ పాటలోని ఆవేదనకు కదిలిపోయిన ఎన్టీఆర్‌... అప్పటికప్పుడే ‘పేదవాడికి పక్కా గృహ నిర్మాణం’ పథకాన్ని ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అదోరాజకీయ సంచలనంగా మారింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగించింది. మోత్కుపల్లికి ఎన్నికల్లో సీటు కూడా ఇదే నేపథ్యంలో వచ్చింది.

ధరల దరువుపై.. : ఆటో కావాలన్న సీఎం.. రవాణా మంత్రి బెంబేలు

అది 1985 మార్చి 19... అప్పటి కేంద్ర సర్కారు పెట్రోల్‌ ధరలను పెంచింది. దీనికి నిరసనగా, పెట్రోలు పొదుపు చేసేందుకు సీఎం హోదాలో తనకు కేటాయించిన ‘హిందూస్థాన్‌ కాంటెస్సా’ కారును ఎన్టీఆర్‌ ప్రభుత్వానికి అప్పగించారు. ఆటోలో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారు. రవాణా మంత్రిగా ఉన్న జానారెడ్డికి ఫోన్‌చేసి తన కోసం ఆటో ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో అమ్మో...! అన్న జానారెడ్డి... భద్రతా పరమైన చర్యలకు ఆటంకం కలుగుతుందని ఇతర అధికారులతో కలసి నచ్చజెప్పడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అప్పటినుంచి తన సొంత మారుతి (ఎ.టి.ఐ.999) కారును వినియోగించడం ప్రారంభించారు. సామాన్యుని బతుకు భారమైన సమయంలో ‘మారుతి కారు ఇరుకైనా ఫర్వాలేదు. సర్దుకుంటాను’ అంటూ ఎన్టీఆర్‌ స్పష్టం చేశారు. పెట్రోల్‌ విచ్చలవిడిగా వాడి, ప్రభుత్వానికి భారం కలిగించే బదులు పొదుపు పాటించాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.

రైతన్న కోసం.. : దేవుడిచ్చిన భూమికి పన్ను ఏంటని..?

భూమిశిస్తు పేదరైతులకు అత్యంత భారంగా మారిన నేపథ్యంలో.. ఆ వ్యవస్థనే రద్దు చేసి రైతాంగానికి తాను ముఖ్యమంత్రి కాగానే ఎన్టీఆర్‌ ఉపశమనం కలిగించారు. ‘దేవుడిచ్చిన భూమికి పన్ను ఏంటి రైతన్నా’ అంటూ అన్నదాతలకు ఆయన ఊరటనిచ్చారు. దీంతోపాటు హార్స్‌పవర్‌ విద్యుత్తు రూ.50కే అనే మరో పథకం కూడా రైతాంగాన్ని ఆదుకుంది. అంతకుముందు, ఎంత విద్యుత్తు వినియోగిస్తే అంతమేర బిల్లులు చెల్లించాల్సి వచ్చేది. 50 రూపాయలకు హార్స్‌పవర్‌ విద్యుత్తు పథకం తెచ్చాక రైతులకు నామమాత్రపు బిల్లులు మాత్రమే వచ్చేవి. రైతులకు అత్యంత ఊరటనిచ్చిన మరో పథకం ఎల్‌.ఎం.బీ.( భూమి తనఖా బ్యాంక్‌) రద్దు చేసి దాని స్థానంలో సింగిల్‌ విండో వ్యవస్థను అమల్లోకి తీసుకురావడం. రుణాల వసూలు కోసం ఎల్‌.ఎం.బీ అధికారులు రైతుల ఇళ్ల దర్వాజాలను, వారి పశువులను సైతం దౌర్జన్యంగా తీసుకుపోయేవారు. ఈ ఘటనలు బాధిత రైతాంగానికి అవమానంగా మిగిలేవి. ఈ నేపథ్యంలో మొత్తంగా ఆ వ్యవస్థనే ఎన్టీఆర్‌ రద్దు చేసేశారు.

Updated Date - 2023-05-27T03:59:46+05:30 IST