మేనమామ కాదు.. కంసమామ!
ABN , First Publish Date - 2023-12-03T03:28:51+05:30 IST
దళిత బిడ్డలను మేనమామగా చూసుకుంటానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక కంసమామగా మారాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు.
జగన్ దళితుల ఓట్లతో గద్దెనెక్కి
వారినే ఊచకోత కోస్తున్నాడు: లోకేశ్
దళిత డ్రైవర్‌ను చంపిన ఎమ్మెల్సీని వెంటేసుకు తిరుగుతున్నాడు
దళిత యువకుడు వరప్రసాద్‌కు స్టేషన్‌లోనే శిరోముండనం
సుధాకర్ నుంచి అచ్చెన్న వరకు ఎందరినో పొట్టనపెట్టుకున్నారు
దళితుల నుంచి లాక్కున్న భూములను తిరిగి వెనక్కి ఇస్తాం
లోకేశ్ హామీ.. తీవ్ర గొంతునొప్పితో బహిరంగ సభ రద్దు
భీమిలిలో 17న యువగళం ముగింపు?
కాకినాడ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దళిత బిడ్డలను మేనమామగా చూసుకుంటానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక కంసమామగా మారాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. ఆయన గద్దెనెక్కాక అనేకమంది దళితులను పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి తిరిగి వారినే ఊచకోత కోస్తున్నాడని నిప్పులు చెరిగారు. యువగళం 215వ రోజు పాదయాత్రలో భాగంగా లోకేశ్ శనివారం కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పిఠాపురం నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఈక్రమంలో వివిధ సామాజికవర్గాలతో సమావేశమయ్యారు. తనను కలిసిన దళిత సామాజికవర్గాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘దళిత డ్రైవర్‌ను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును సీఎం జగన్ వెంటేసుకు తిరుగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వైసీపీ నేతల ఇసుక అక్రమాలను ప్రశ్నించిన దళిత యువకుడు వరప్రసాద్‌కు పోలీ్‌సస్టేషన్‌లోనే శిరోముండనం చేసినా ఇంతవరకు చర్యల్లేవు. డాక్టర్ సుధాకర్ నుంచి అచ్చెన్న వరకు ఎందరో దళితులను వైసీపీ పొట్టనపెట్టుకుంది. దళితులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను లాక్కున్నారు. టీడీపీ వచ్చిన తర్వాత ఆ భూములన్నీ తిరిగి దళితులకే అప్పగిస్తాం. టీడీపీ హయాంలో దళితులకు అందించిన 27 పథకాలను తిరిగి అమలు చేస్తాం’ అని ప్రకటించారు. అనంతరం ముస్లిం ప్రతినిధులతో మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమంపై జగన్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ముస్లిం మైనారిటీలకు చెందిన రూ.5,400 కోట్ల సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వారికి ఇస్లామిక్ బ్యాంకు ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి పన్నులు పిండడంపై పెడుతున్న శ్రద్ధను జగన్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టడం లేదని, దీంతో ప్రజలు నరకం చూస్తున్నారని అన్నారు.
గొంతు నొప్పి తీవ్రం..
లోకేశ్‌కు గొంతునొప్పి మరింత తీవ్రమైంది. దీంతో శనివారం పిఠాపురం ఉప్పాడ సెంటర్‌లో జరగాల్సిన బహిరంగ సభను రద్దు చేసుకున్నారు. శుక్రవారం కాకినాడ సర్పవరం సెంటర్‌లో బహిరంగ సభలో ప్రసగించే సమయానికే ఆయనకు గొంతు నొప్పి ఉండడంతో పెద్దగా మాట్లాడలేకపోయారు. దీంతో వైద్యులు రెండురోజుల విశ్రాంతిని సూ చించారు. కానీ శనివారం పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలు లోకేశ్‌ను కలిసి వినతులు అందించారు. తమను ఆదుకోవాలని కోరారు. వారికి ఆయన పలు హామీలిచ్చారు. పాదయాత్రలో అడుగడుగునా తనను చూసేందుకు వస్తు న్న యువత, మహిళలు, వృద్ధులు అందరినీ లోకేశ్ పలకరించారు. దీంతో గొంతు నొప్పి మరింత పెరిగింది. మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో సభ రద్దు చేసుకున్నారు. పెద్దాపురం నియోజకవర్గం పరిధిలో అభిమానులు వరికంకులతో కూడిన గజమాలను లోకేశ్‌కు అలంకరించారు. కాగా.. ఆయన 215వ రోజు.. 19.8 కిలోమీటర్లు నడిచారు.
విజయవంతంగా జలగన్న గుంతల పథకం
పిఠాపురం: రాష్ట్రవ్యాప్తంగా జలగన్న గుంతల పథకం విజయవంతంగా అమలవుతోందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ రైల్వేగేటు సమీపంలో ఆర్‌అండ్‌బీ రహదారిపై బ్రిడ్జివద్ద పడిన గొయ్యిని చూపిస్తూ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని లోకేశ్ ఎండగట్టారు. రాష్ట్రంలోని అధ్వాన రోడ్లపై పొరుగు రాష్ట్ర సీఎం సెటైర్లు వేస్తున్నా నవ్విపోదురు గాక నాకేమిటి సిగ్గన్నట్లు దివాలాకోరు సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని లోకేశ్ దుయ్యబట్టారు.