Chandrababu : ఎవరూ శాశ్వతం కాదు.. సమాజమే శాశ్వతం!
ABN , Publish Date - Dec 22 , 2023 | 03:15 AM
‘దేశంలో ఎవ్వరూ శాశ్వతం కాదు.. కానీ సమాజం శాశ్వతం. సమాజ హితం కోసం పని చేయాలని యేసుక్రీస్తు కూడా చెప్పారు. బైబిల్‌లో ఏ వాక్యం చూసినా సమాజ హితమే
ఏసు ప్రభువు అదే చెప్పారు..: చంద్రబాబు..
టీడీపీ ఆఫీస్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు
ఎవరూ శాశ్వతం కాదు..
సమాజమే శాశ్వతం!
ఏసు ప్రభువు అదే చెప్పారు: బాబు
టీడీపీ ఆఫీ్‌సలో సెమీ క్రిస్మస్ వేడుకలు
అమరావతి, విజయవాడ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘దేశంలో ఎవ్వరూ శాశ్వతం కాదు.. కానీ సమాజం శాశ్వతం. సమాజ హితం కోసం పని చేయాలని యేసుక్రీస్తు కూడా చెప్పారు. బైబిల్‌లో ఏ వాక్యం చూసినా సమాజ హితమే బోధిస్తుంది. శత్రువును కూడా ప్రేమించాలని బైబిల్ చెబుతోంది’ అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన చంద్రబాబు క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నేనెప్పుడూ కులం, మతం చూడలేదు. హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చేస్తే ఒక్క కులమే అభివృద్ధి చెందిందా? కానీ మన ఏపీలో మాత్రం అమరావతిని నాశనం చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారు. అన్నీ చేసి.. పైన దేవుడున్నాడు, కింద నేనున్నాను. మీ బిడ్డను అంటున్నాడు. ఎవ్వరూ శాశ్వతం కాదు. సమాజమే శాశ్వతం. సమాజం కోసం పనిచేయాలి. మానవ ప్రయత్నానికి దేవుని ఆశీస్సులు కావా లి. శత్రువును కూడా ప్రేమించాలని బైబిల్ చెప్తుంటే, నేడు మిత్రుడిని కూడా శత్రువుగా చూస్తున్న పరిస్థితి ఉంది’ అన్నారు. క్రిస్టియాని టీ అంటేనే సేవ అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వాలు చేయలేని పనులు ఎయిడెడ్ సంస్థలు చేశాయని గుర్తుచేశారు. కానీ, నేడు ఆ సంస్థలను ప్రోత్సహించకుండా లక్షల కోట్ల ఎయిడెడ్ ఆస్తులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యాని, టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆనంద్‌బాబు, పీతల సుజాత, జవహర్, బీ రామాంజనేయు లు, ఎమ్మెస్ రాజు, కరుణకుమార్ పాల్గొన్నారు.
నేటి నుంచి చంద్రబాబు నివాసంలో హోమాలు, యాగాలు
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక యాగాలు, హోమాలు, పూజలు నిర్వహించనున్నారు. శతచండీ పారాయణ, ఏకోత్తర వృద్ధి, మహాచండీ యాగంతో పాటు సుదర్శన, నారసింహ హోమాన్ని నిర్వహించనున్నారు. వీటిలో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొంటారని పార్టీవర్గాలు తెలిపాయి.
ప్రభువే నా కాపరి: బాబు
గుణదల చర్చిలో భువనేశ్వరితో కలిసి ప్రార్థనలు
టీడీపీ అధినేత చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి గురువారం విజయవాడలోని గుణదల మేరీమాత చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మొక్కుబడులు సమర్పించుకున్నారు. ప్రభువే తన కాపరి అంటూ.. తనను ఆపదల నుంచి బయట పడవేయాలని, ఏ కష్టమొచ్చినా ప్రభువు తోడుగా ఉండాలని కోరుకున్నారు. యేసుక్రీస్తు, మేరీమాతలను ప్రార్థించారు. అనంతరం మేరీమాత సోషల్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు, ఫాదర్ తోట సునీల్‌తో పాటు ఫాదర్లు ఎం.ప్రకాశ్, కె.సునీల్, బి.రవి తదితరులు చంద్రబాబు దంపతులను ఆశీర్వదించారు. తర్వాత మేరీమాత విగ్రహానికి చంద్రబాబు దంపతులు పూలమాల వేశారు. కొవ్వొత్తులు వెలిగించారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు. చంద్రబాబు దంపతుల రాక నేపథ్యంలో టీడీపీ నాయకులు కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, దేవినేని ఉమా, భారీ సంఖ్యలో కార్యకర్తలు గుణదల వచ్చారు. కాగా, వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని ఇచ్చిన హామీపై పునరాలోచన చేయాలని కోరేందుకు విజయవాడకు చెందిన ఆటో డ్రైవర్లు చంద్రబాబును కలిసేందుకు గుణదల చర్చికి వచ్చారు. కానీ, భద్రతా కారణాల రీత్యావారు ఆయనను కల వలేకపోయారు. త్వరలోనే కలుస్తామని ఆటో డ్రైవర్ల సంఘం నేత జి.గోవింద్ తెలిపారు.