Share News

ముగిసిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2023-10-25T05:04:12+05:30 IST

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం సోమవారం ఉదయం కన్నులపండువగా జరిగింది.

ముగిసిన నవరాత్రి బ్రహ్మోత్సవాలు

శాస్త్రోక్తంగా చక్రస్నానం, పార్వేట ఉత్సవం

తిరుమల, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం సోమవారం ఉదయం కన్నులపండువగా జరిగింది. వేకువజామున 4 నుంచి 6 గంటల వరకు దేవేరులతో కలిసి తిరుచ్చిలో మలయప్పస్వామిని, పల్లకీలో చక్రత్తాళ్వార్‌ను తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వరాహస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. ఉదయం 6-9గంటల మధ్య ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, తదితర కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత చక్రత్తాళ్వార్‌ను అర్చకస్వాములు పుష్కరిణిలో మూడు మునకలు వేయించారు. పుష్కరిణిలో అప్పటికే వేచి ఉన్న వేలాదిమంది భక్తులు గోవింద నామస్మరణలతో స్నానమాచరించారు. కాసేపటికి ఉత్సవర్లను తిరుచ్చిలో, చక్రత్తాళ్వార్‌ను పల్లకీలో ఆలయానికి తీసుకెళ్లారు. కాగా.. సోమవారం రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి శ్రీరామపట్టాభిషేకం అలంకారంలో మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం తిరుమలలో పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది.

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన వికాస్‌ కుమార్‌ కిషోర్‌ బాయ్‌ రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు.

Updated Date - 2023-10-25T05:04:12+05:30 IST