Share News

Nara Lokesh : 3 నెలలు ఓపిక పట్టండి

ABN , First Publish Date - 2023-11-29T03:54:43+05:30 IST

వైసీపీ అరాచక పాలనతో ప్రతి ఒక్కరూ విసిగిపోయారని.. మరో మూడు నెలలు అందరూ ఓపిక పడితే టీడీపీ ప్రభుత్వం వస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు.

Nara Lokesh : 3 నెలలు ఓపిక పట్టండి

మేం రాగానే 20 లక్షల ఉద్యోగాలు: లోకేశ్‌

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కల్పిస్తాం

ఖాళీ పోస్టులన్నీ ఐదేళ్లలో భర్తీ

ఏటా జాబ్‌ కేలెండర్‌ అమలుచేస్తాం

ఏపీపీఎస్సీని బలోపేతం చేస్తాం

నాడు ఏపీ ఉద్యోగాల రాజధాని.. ఇప్పుడు గంజాయికి రాజధాని

డ్రగ్స్‌పై యుద్ధం చేస్తాం

ఏపీ బ్రాండ్‌ను రిపేర్‌ చేయాలంటే

చంద్రబాబు తిరిగి సీఎం కావాలి

యువగళం పాదయాత్రలో టీడీపీ యువనేత పిలుపు

యువత, ఆక్వా రైతులతో ముఖాముఖి

ఏటా జాబ్‌ కేలెండర్‌ ప్రకటిస్తామని చెప్పి జగన్‌ నిరుద్యోగులను మోసం చేశారు. డీఎస్సీ నుంచి గ్రూప్‌-2, ఎస్‌ఐ పోస్టుల వరకు అన్నీ గోవిందా! కానీ మేమొచ్చాక ఏటా జాబ్‌ కేలెండర్‌ ప్రకటిస్తాం.

కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు గంజాయి వ్యాపారాలు చేస్తున్నారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రగ్స్‌పై యుద్ధం చేస్తాం. గంజాయి స్మగ్లర్లకు, దొంగలకు రాష్ట్రంలో చోటులేకుండా చేస్తాం.

- లోకేశ్‌

కాకినాడ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అరాచక పాలనతో ప్రతి ఒక్కరూ విసిగిపోయారని.. మరో మూడు నెలలు అందరూ ఓపిక పడితే టీడీపీ ప్రభుత్వం వస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ప్రకటించారు. మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో యువగళం 211వ రోజు పాదయాత్ర జరిగింది. అమలాపురం రూరల్‌ భట్నవిల్లిలో లోకేశ్‌ యువతతో ముఖాముఖి మాట్లాడారు. అమలాపురంలో జిల్లా ఆక్వా రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ.. కోల్పోయిన ఏపీ బ్రాండ్‌ను రిపేర్‌ చేయాలంటే చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగాలకు రాజధానిగా ఉంటే.. వైసీపీ వచ్చాక గంజాయికి రాజధానిగా మారిందని ధ్వజమెత్తారు. అప్పట్లో రాష్ట్రానికి రోజుకో ప్రతిష్ఠాత్మక కంపెనీ వస్తే.. ఇప్పుడేమో బూంబూం, ప్రెసిడెంట్‌ మెడల్‌, ఆంధ్రా గోల్డ్‌ వంటి మద్యం కంపెనీలు వస్తున్నాయని ఎద్దేవాచేశారు. పక్క రాష్ట్రాలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంటే ఇక్కడ గడచిన నాలుగున్నరేళ్లలో చెప్పుకోదగిన పరిశ్రమ ఒక్కటీ రాలేదని మండిపడ్డారు. చివరకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదని అడిగితే చెప్పలేని పరిస్థితిని సీఎం జగన్‌ తెచ్చారని విమర్శించారు. ఈ పరిస్థితి మారాలంటే రాష్ట్రంలో మార్పు రావాలని అన్నారు. ఇంకా ఏమన్నారంటే...

జాబ్‌లెస్‌ కేలెండర్‌ కాదు..

జగన్‌ ప్రభుత్వం తరహాలో జాబ్‌లెస్‌ కేలెండర్‌ కాదు. ఏటా జాబ్‌ కేలెండర్‌ ప్రకటిస్తాం. నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను ఐదేళ్ల వ్యవధిలో భర్తీ చేస్తాం. యూపీఎస్సీ తరహాలో ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. కేజీ టు పీజీ కరిక్యులంలో మార్పులు తెస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ఇప్పుడు సరిగా అమలు కావడం లేదు. మేం వచ్చాక పాత విధానాన్ని తొలి వంద రోజుల్లో అమలు చేస్తాం. కాలేజీకి, ప్రభుత్వానికి మధ్య నేరుగా చెల్లింపులు జరిగేలా చేస్తాం. పథకాల పేరుతో జగన్‌ రూ.12 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని గుల్లచేశారు. వీటికి వడ్డీలే రూ.లక్ష కోట్ల వరకు చెల్లించాలి. ఎకనామిక్‌ గ్రోత్‌ ఇంజన్‌ ఆగిపోయింది. వైసీపీ గుంతల పథకం తెచ్చింది. పాదయాత్రలో నడుస్తుంటే గుంతల్లో రోడ్లు ఎక్కడున్నాయో కూడా తెలియడం లేదు. జగన్‌ ప్రభుత్వం ప్రమాదకరమైన భూ చట్టం తెచ్చింది. మన భూములపై అప్పు తెచ్చి ఖర్చు చేసే ప్రమాదకరమైన చట్టాన్ని అమలు చేస్తోంది. టీడీపీ రాగానే ల్యాండ్‌ టైటలింగ్‌ చట్టం రద్దు చేస్తాం. రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలో నడవాలంటే టీడీపీ-జనసేనలకు ప్రతి ఒక్కరూ మద్దతిచ్చి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలి.

పైన పచ్చ బటన్‌.. కింద రెడ్‌ బటన్‌

టీడీపీ పాలనలో ఏనాడూ ప్రజలపై పన్నుల భారం మోపలేదు. జగన్‌ మాత్రం అడ్డగోలుగా పన్నులు పెంచుకుంటూ పోతున్నారు. 2019కి ముందు విద్యుత్‌ చార్జీలు ఎంత ఉన్నాయి.. ఇప్పుడు ఎంత ఉన్నాయి? ఇంటి పన్ను అప్పుడెంత.. ఇప్పుడెంత? పెట్రోలు, డీజీల్‌ ధరల్లో తేడాపైనా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీయాలి. కానీ వైసీపీ పాలనలో సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారు. పథకాల పేరుతో జగన్‌ నొక్కుతున్న బటన్‌.. జనాలను పిండడానికే. ఒకపక్క బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని పచ్చ బటన్‌ నొక్కుతూ.. అదే బల్ల కింద రెడ్‌ బటన్‌ నొక్కి పన్నుల పేరుతో ప్రజలను దోచేస్తున్నారు.

ఆత్మలతో మాట్లాడి పేరు మార్చేశారు...

జగన్‌ తండ్రి ఎన్టీఆర్‌ వర్సిటీ పేరు ముందు డాక్టర్‌ చేర్చితే ఈయనొచ్చి ఆత్మలతో మాట్లాడి పేరు మార్చేశారు. రాష్ట్రంలో వైద్య వసతులను మాత్రం మెరుగుపరచడం లేదు. అందుకే వైసీపీ మంత్రులు రోగాలు వస్తే పక్క రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంలో ఆక్వా, వరి సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర లేదు. కానీ గంజాయి సాగుచేస్తున్న వారికి మాత్రం గిట్టుబాటు ధర లభిస్తోంది. మేం రాగానే ఆక్వా రంగాన్ని ఆదుకుంటాం. జోన్లతో సంబంధం లేకుండా యూనిట్‌ కరెంటు రూ.1.50కే అందిస్తాం.

వివిధ వర్గాల వినతులు..

అమలాపురం గడియార స్తంభం సెంటర్లో చేనేత కార్మికులు లోకేశ్‌కు వినతులు అందించారు. ముమ్మిడివరం గేటు సెంటర్లో విభిన్న ప్రతిభావంతులు, హైస్కూలు సెంటర్లో కోనసీమ జిల్లా శెట్టిబలిజ సామాజికవర్గీయులు, రామాలయం వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గంగిరెద్దుల సంఘం ప్రతినిధులు, భట్నవిల్లిలో మాలమహానాడు ప్రతినిధులు ఆయన్ను కలిసి వినతిపత్రాలు అందజేశారు.

టీడీపీలో వైసీపీ ఎంపీపీలు..

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏలేశ్వరం, రౌతులపూడి ఎంపీపీలు గొల్లపల్లి నరసింహమూర్తి, రాజ్యలక్ష్మి, భద్రవరం ఎంపీటీసీ బాబ్జీ, తూర్పు లక్ష్మీపురం సర్పంచ్‌ భార్గవి తదితరులు లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరారు.

లక్షల్లో ఉపాధి కల్పిస్తాం

లోకేశ్‌-యువత నడుమ ఆసక్తికర సంభాషణ

కార్తీక్‌: శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఏటా జాబ్‌ కేలెండర్‌ విడుదల చేస్తామని ఎన్నికలప్పుడు జగన్‌ చెప్పారు. కానీ సాక్షి కేలెండర్‌ రిలీజ్‌ చేస్తున్నారు. టీడీపీ వచ్చాక ఉద్యోగాలు కల్పిస్తారా?

లోకేశ్‌: మా హయాంలో అనేక నోటిఫికేషన్లు ఇచ్చాం. మెగా డీఎస్సీలు విడుదల చేశాం. మూడు నెలలు ఓపిక పట్టండి. అన్ని రంగాల్లో కలిపి లక్షల్లో ఉద్యోగాలు ఇస్తాం.

మనోజ్‌ మాకిరెడ్డి: విశాఖ లా యూనివర్సిటీలో లా చదువుతున్నా. నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. కానీ మాకు ఉద్యోగాలు కావాలి. చంద్రబాబు వల్ల ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. అలాంటి ఉపాధి మాకూ కావాలి.

లోకేశ్‌:: చంద్రబాబు 2014లో పాలనా సౌలభ్యం కోసం అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టారు. అనంతపురం నుంచి విశాఖ వరకు ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రాధాన్యం ఇచ్చారు. ఆక్వా, ఫార్మా, డిఫెన్స్‌, ఆటెమోటివ్‌ రంగాలకు ప్రాధాన్యమిచ్చారు. కియా వల్ల 100 అనుబంధ పరిశ్రమలు వచ్చాయి.

ఓ విద్యార్థి: జగన్‌ ప్రభుత్వం కొత్తగా ఏపీ టైటలింగ్‌ యాక్ట్‌ తెచ్చింది. ఇందులో సెక్షన్‌ 38 కింద భూ వివాదాలు వస్తే సివిల్‌ కోర్టును కాదని అధికారులతో కూడిన స్పెషల్‌ అథారిటీ ఏర్పాటు చేశారు. జ్యుడీషియరీని తప్పించేశారు. ఇది దారుణం. దీనిపై టీడీపీ పోరాటం చేయాలి.

లోకేశ్‌: ఈ యాక్టు చాలా ప్రమాదకరం. భూమి పత్రాలు ప్రభుత్వం తన వద్ద ఉంచుకుంటుందట! దీనిపై అప్పు తెస్తే బుక్కయ్యేది మనమే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తాం.

పీజీ స్టూడెంట్‌: ఈ ప్రభుత్వం పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆపేసింది. టీడీపీ వస్తే మీరేం చేస్తారు?

లోకేశ్‌: మేమొచ్చిన వంద రోజుల్లో పాత రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమల్లోకి తెస్తాం.

భవ్య: అమలాపురంలో అన్ని వనరులూ ఉన్నాయి. కానీ రైల్వే సదుపాయం లేదు. ఎగుమతులకూ రైళ్లు లేవు. దీనిపై మీ వైఖరేంటి?

లోకేశ్‌: రైల్వే లైను కోసం గతంలో బాలయోగి పోరాడారు. ఆ తర్వాత ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. చంద్రబాబు సర్కారు ఫాలోఅప్‌ చేయడంతో మళ్లీ పనులకు మోక్షం కలిగింది. వైసీపీ వచ్చాక మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వక పనులు ఆగిపోయాయి. టీడీపీని గెలిపిస్తే ఆ పనులు జరిగేలా పోరాడతాం.

సమ్రిత్‌: ఆడపిల్లలు ఇంటి నుంచి కాలేజీకి వెళ్తే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. చివరకు మీ ఇంట్లో వారిపైనే కేసులు పెట్టారు. మీకే భద్రత లేదు. టీడీపీ వస్తే మాకు ఎలాంటి భద్రత కల్పిస్తారు?

లోకేశ్‌: త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. ప్రస్తుతం జగన్‌ ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేశాక మహిళా మంత్రులే నా తల్లి, భార్యపైనా కేసులు పెడతామని హెచ్చరించారు. ఒక్క మూడు నెలలు ఆగండి. టీడీపీ వచ్చాక మహిళలకు ఎలాంటి భద్రతకల్పిస్తామో చేసి చూపిస్తాం.

Updated Date - 2023-11-29T03:55:06+05:30 IST