Share News

Nara Lokesh : బీసీల రక్షణకు చట్టం

ABN , Publish Date - Dec 14 , 2023 | 02:36 AM

తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు.

Nara Lokesh : బీసీల రక్షణకు చట్టం

వైసీపీ నేతల చేతిలో 64 మంది బీసీల హత్య

26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు

అధికారంలోకి రాగానే వాటిని ఎత్తివేస్తాం

బడుగులకు స్థానిక సంస్థల్లో కోటా ఇచ్చాం

అందులో జగన్‌ పది శాతం కోత వేశారు

బీసీ సబ్‌ప్లాన్‌ నిధుల్ని దారిమళ్లించారు

బీసీలకు శాశ్వత ధ్రువీకరణ పత్రాలిస్తాం

జాలర్లకు నష్టం చేసే జీవో 217 రద్దు

గొర్రెల కొనుగోలుకు రాయితీపై రుణాలు

లిక్కర్‌ దుకాణాల్లో కల్లుగీతలకు వాటా

బీసీ ప్రతినిధులతో ముఖాముఖిలో లోకేశ్‌

అనకాపల్లి/ఎస్‌.రాయవరం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర బుధవారం ఉదయం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి కృష్ణ గోకులం లేఅవుట్‌ నుంచి మొదలైంది. దారిపొడవునా లోకేశ్‌ను మహిళలు, యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఎస్‌.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామంలో బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ, బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించడంతోపాటు వారి ఆర్థిక అభ్యున్న తికి కృషిచేసింది ఎన్టీఆర్‌ అని గుర్తుచేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ ఇచ్చి కీలక పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. బీసీల కోసం టీడీపీ ప్రభుత్వం ఆదరణ పథకాన్ని అమలు చేస్తే...దానిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. బీసీ కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. బీసీలకు తమ హయాంలో కల్పించిన రిజర్వేషన్లలో పది శాతం మేర జగన్‌ తగ్గించారని మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వం తగ్గించిన 10 శాతం రిజర్వేషన్‌ను టీడీపీ అధికారంలోకి రాగానే పెంచుతామని హామీ ఇచ్చారు. బీసీ సబ్‌ప్లాన్‌ నిధులను జగన్‌ పక్కదారి పట్టించారని ఆరోపించారు. బీసీలకు ఎవరి హయాంలో న్యాయం జరిగిందో చర్చించేందుకు రావాలని బీసీ మంత్రికి ఎన్నిసార్లు సవాల్‌ విసిరినా అటు నుంచి స్పందన లేదన్నారు. కనీసం బీసీ మంత్రి పేషీలో జీతాలిచ్చే దిక్కులేదని ఆరోపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

అక్రమ కేసులు ఎత్తివేస్తాం..

‘‘బీసీ బిడ్డ అమర్‌నాథ్‌గౌడ్‌ను వైసీపీ నాయకులు దారుణంగా హతమార్చారు. అమర్‌నాథ్‌గౌడ్‌ అక్కను మా అమ్మ చదివిస్తున్నారు. బీసీ నేత నందం సుబ్బయ్యను వైసీపీ నేతలు ఘోరంగా హత్య చేశారు. వైసీపీ పాలనలో 64 మంది బీసీలను ఆ పార్టీ నాయకులు హతమార్చారు. 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేస్తాం’’

ఫోన్‌లో ఒక్క బటన్‌ నొక్కితే...

‘‘బీసీలకు ధ్రువీకరణ పత్రాల జారీలో ఎదురవుతున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతాం. ఫోన్‌లో ఒక్క బటన్‌ నొక్కగానే ధ్రువీకరణ పత్రాలు అందేలా చూస్తాం. బీసీలకు దామాషా ప్రకారం కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేస్తాం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. దామాషా పద్ధతి ప్రకారం నిధులు కేటాయిస్తాం. అమ్మఒడి, పెన్షన్‌లకు అయ్యే ఖర్చు కూడా బీసీల పేరుతోనే రాస్తుండడం దుర్మార్గం’’

మత్స్యకారులకు తీరని అన్యాయం

‘‘మత్య్సకారులను అన్నివిధాలా ఆదుకున్నది టీడీపీ ప్రభుత్వమే. టీడీపీ పాలనలో మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788.38 కోట్లు ఖర్చు చేశాం. వైసీపీ అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు తీరని అన్యాయం చేసింది. వేట నిషేధ కాలంలో ఇవ్వాల్సిన పరిహారం కూడా పూర్తిస్థాయిలో అందడం లేదు. మత్స్యకారులకు పనిముట్లు, బోట్లను సబ్సిడీపై టీడీపీ అందిస్తే...వైసీపీ అధికారంలోకి వచ్చాక రద్దు చేసింది. సముద్రంలో ప్రమాదవశాత్తూ చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వంలో రూ.5 లక్షలు ఇచ్చాం. వైసీపీ పాలనలో కనీసం చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించే దిక్కు లేదు. మత్స్యకారుల జీవితాలపై జగన్‌ చావుదెబ్బ కొట్టారు. వారి చేతిలో ఉన్న చెరువులను జీవో నంబరు 217ను తీసుకొచ్చి వైసీపీ నేతలు కొట్టేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే మత్స్యకారులకు నష్టం కలిగించే ఆ జీవోను రద్దు చేస్తాం.’’

ఆదుకుంటాం

‘‘టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు అందిస్తాం. చంద్రన్న బీమాను రూ.5 లక్షలతో ప్రారంభించి రూ.10 లక్షలకు పెంచుతాం. కల్లు గీత కార్మికులను టీడీపీ ఆదుకుంటే...జగన్‌ పాలనలో వారి పొట్ట కొట్టారు. టీడీపీ అధికారంలోకి రాగానే లిక్కర్‌ దుకాణాల్లో కల్లు గీత కార్మికులకు వాటాలు ఇస్తాం.’’

పారిశ్రామిక రంగం కుదేలు

‘‘టీడీపీ పాలనలో కొత్త పరిశ్రమలు వస్తే, జగన్‌ ఆ పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు తరిమేస్తున్నారు. ప్రభుత్వ తీరుతో పరిశ్రమలు కుదేలవుతున్నాయి. కొబ్బరిపీచు పరిశ్రమలను కుటీర పరిశ్రమగా గుర్తించి కరెంట్‌ చార్జీలు తగ్గించేందుకు చర్యలు చేపడతాం. దేశ రక్షణ అవసరాలకు భూములిచ్చిన రైతులు, మత్స్యకారులను ఇబ్బందుల పాల్జేయడం సరికాదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నేవీ అధికారులతో చర్చించి మత్స్యకారుల వృత్తికి ఆటంకం కలగకుండా చర్యలు చేపడతాం. సీఎం అయితే షుగర్‌ ఫ్యాక్టరీలను ఆదుకుంటానన్న ఎన్నికల హామీని జగన్మోహన్‌రెడ్డి గాలికి వదిలేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీకి పూర్వవైభవం తెస్తాం. కాగా, పాదయాత్ర లోకేశ్‌ నక్కపల్లి మండలం కృష్ణ గోకులం లేఅవుట్‌నుంచి ప్రారంభించి, యలమంచిలి నియోజకవర్గం లైన్‌ కొత్తూరు వద్ద ముగించారు. లోకేశ్‌ మొత్తం 18.03 కిలోమీటర్లు నడిచారు.

Updated Date - Dec 14 , 2023 | 02:36 AM