Share News

ముగిసిన నంది నాటక సంబరం

ABN , Publish Date - Dec 30 , 2023 | 02:45 AM

నాటక రంగానికి పుట్టినిల్లయిన గుంటూరులో నంది నాటక సంబరాలు అంబరాన్నంటాయి.

ముగిసిన నంది నాటక సంబరం

‘మీగడ’కు ఎన్టీఆర్‌ రంగస్థల పురస్కారం ప్రదానం

గుంటూరు సిటీ, డిసెంబరు 29: నాటక రంగానికి పుట్టినిల్లయిన గుంటూరులో నంది నాటక సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నెల 23న ప్రారంభమైన నంది నాటకోత్సవాలు శుక్రవారం రాత్రి ముగిశాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రచలన చిత్ర, టివీ, నాటక రంగ అభివృద్థి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 22వ నంది నాటకోత్సవంలో 38 నాటికలను ప్రదర్శించారు. ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి 73 అవార్డులు అందజేశారు. ముగింపు కార్యక్రమానికి మంత్రి రాంబాబు ముఖ్య అతిథిగా హాజరు కాగా, సంస్థ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి, ఎండీ టి.విజయకుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్య నాటకంలో శ్రీ మాధవశర్మ (విజయవాడ) ప్రథమ బహుమతిని, శ్రీకాంతకృష్ణమాచార్య (విశాఖపట్నం) ద్వితీయ బహుమతిని, వసంతరాణీయం (హైదరాబాద్‌) తృతీయ బహుమతి గెలుచుకున్నాయి. సాంఘిక నాటకాల్లో ఇంద్రప్రస్థం (గుంటూరు) ప్రఽథమ బహుమతి, ది ఇంపోస్టర్‌ (హైదరాబాద్‌) ద్వితీయ బహుమతి, కలనేత (హైదరాబాద్‌) తృతీయ బహుమతి గెలుచుకున్నాయి. సాంఘిక నాటికల్లో అస్థికలు (పెదకాకాని, గుంటూరు) ప్రథమ బహుమతి, కమనీయం (గుంటూరు) ద్వితీయ బహుమతి, చీకటి పువ్వు (కరీంనగర్‌) తృతీయ బహుమతిని గెలుచుకున్నాయి. బాలల నాటికల్లో ప్రపంచ తంత్రం(విజయవాడ) ప్రథమ బహుమతి, బాధ్యత ద్వితీయ బహుమతి, మూడు ప్రశ్నలు (విజయవాడ) తృతీయ బహుమతిని దక్కించుకున్నాయి. కళాశాల, విశ్వవిద్యాలయాల నుంచి ఇంకానా ప్రథమ బహుమతి, కపిరాజు ద్వితీయ బహుమతి, ఉద్థంసింగ్‌ తృతీయ బహుమతి గెలుచుకున్నాయి. కాగా.. 2022 సంవత్సరానికి గాను ఎన్టీఆర్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని విశాఖపట్నానికి చెందిన కళా రత్న డాక్టర్‌ మీగడ రామలింగస్వామి (పద్య నాటక విభాగంలో)కి అందజేశారు. వైయస్సార్‌ అవార్డు పురస్కారం యంగ్‌ మాన్‌ హ్యాపీ క్లబ్‌, కాకినాడ (నాటక నిర్వహణ విభాగంలో) వారికి అందజేశారు.

నంది అవార్డుల్లో వివక్ష: కర్నూలు కళాకారుని నిరసన

నంది నాటకోత్సవంలో న్యాయ నిర్ణేతలు కుల వివక్ష చూపించారని కర్నూలుకు చెందిన పత్తి ఓబులయ్య ఆరోపించారు. రెండు కులాలకు చెందిన వారినే ఎంపిక చేశారని బహుమతి ప్రదానోత్సవంలో ఓబులయ్య నిరసన వ్యక్తం చేశారు. కులం ప్రాతిపదికన ఎంపికలు జరిగాయని ఆరోపించారు. తమకు ఇప్పటికి 37సార్లు నంది అవార్డులు వచ్చాయని, తమ నాటికను పక్కన పెట్టడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రకటించిన నంది (కన్సోలేషన్‌) బహుమతి తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. న్యాయనిర్ణేతలు పలుమార్లు పిలిచినప్పటికి ఓబులయ్య తమకు నంది అవసరం లేదని స్టేజ్‌పైనే అవార్డును వదిలిపెట్టి కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Dec 30 , 2023 | 02:45 AM