Share News

నా జీవితం ప్రజా సేవకే అంకితం

ABN , First Publish Date - 2023-12-03T03:17:21+05:30 IST

‘రాష్ట్రానికి పూర్వవైభవం రావాలి. ధర్మసంస్థాపన, న్యాయపరిరక్షణ జరగాలి.

నా జీవితం  ప్రజా సేవకే అంకితం

ధర్మ సంస్థాపన, న్యాయ పరిరక్షణ జరగాలి

ప్రజల ఇబ్బందులు తొలగాలి... దుష్ట శిక్షణ చేయాలి

నేడు సింహాచలం, 5న శ్రీశైలం క్షేత్రాలను దర్శిస్తా

ఆ తరువాతే నా కార్యాచరణ ప్రకటిస్తా: టీడీపీ అధినేత

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

విజయవాడ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రానికి పూర్వవైభవం రావాలి. ధర్మసంస్థాపన, న్యాయపరిరక్షణ జరగాలి. రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజల ఇబ్బందులను తొలగించి, దుష్ట శిక్షణ చేయాలి’’ అని అమ్మవారికి కోరుకున్నా అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద ఆశీర్వచన మండపంలో చంద్రబాబు దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఆలయం బయట చిన్న రాజగోపురం వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘తెలుగు సమాజం అభివృద్థిపథంలో పయనించి, తెలుగు వారి కీర్తి ప్రపంచవ్యాప్తంగా వెలగాలని కోరుకున్నా. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలతోపాటు దేశవిదేశాల్లో స్థిరపడిన తెలుగువారు సంఘీభావం తెలిపారు. ఎవరి మనోభావాలకు అనుగుణంగా వారు దేవుడికి ప్రార్థనలు, పూజలు చేశారు. ఇదంతా తెలిసినప్పుడు నా జన్మ సార్థకమైంది. మహిళలు ఉపవాసాలు చేశారు. మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు మానవ సంకల్పంతోపాటు దైవసంకల్పం అవసరం. అందుకోసమే పుణ్యక్షేత్రాల యాత్రను చేపట్టా. ఇప్పటికే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడ్ని దర్శించుకున్నా.

తర్వాత కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నా. ఆదివారం సింహాచలం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ఐదో తేదీన శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుంటా. ఈ యాత్ర పూర్తయిన తర్వాత కార్యాచరణను తెలియజేస్తా. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని రక్షిస్తుంది. అధర్మంగా వ్యవహరిస్తే భవిష్యత్తు అంధకారమవుతుంది. ఇదే విషయాన్ని నేను అధికారులకు చెబుతున్నా. దీనిపై ప్రజలూ ఆలోచన చేయాలి. అంతా కలిసి సమష్ఠిగా మంచి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రానికి పూర్వవైభవం వస్తుంది. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 70-80 దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, భారతీయులు సంఘీభావం తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రోడ్ల మీదకు వచ్చారు. కొంతమంది కాశీలో కోటి దీపారాధన చేశారు. సైబర్‌ టవర్స్‌ నిర్మించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గచ్చిబౌలిలో గ్రాటిట్యూడ్‌ కన్సార్టియం నిర్వహించారు. దీనికి ఎవరూ నాయకత్వం వహించకపోయినా ఉద్యోగులంతా లక్షలాదిగా తరలి వచ్చారు. నా కోసం కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే నా జీవితాన్ని ప్రజల కోసం, ప్రజాసేవ కోసం అంకితం చేస్తా’’ అని ప్రకటించారు. చంద్రబాబు వెంట విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీ మంత్రి దేవినేని ఉమా, బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, కేశినేని చిన్ని, బూరగడ్డ వేదవ్యాస్‌, బోడె ప్రసాద్‌, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ఉన్నారు.

గుంటూరు ఉమెన్స్‌ కాలేజీ విద్యార్థినులకు పలకరింపు

తెలుగుదేశం పార్టీ అధినేత గుంటూరు ఉమెన్స్‌ కాలేజీ విద్యార్థినులను పలకరించారు. ఆయన శనివారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శనం చేసుకుని తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్తుండగా.. కొండవీటి వాగు లిఫ్ట్‌ దగ్గర ఆ విద్యార్థినులు కనిపించారు. దాంతో చంద్రబాబు కారు ఆపి వారిని పలకరించారు. ఎక్కడ నుంచి వచ్చారని అడిగారు. తాము బీఈడీ విద్యార్థినులమని, స్టడీ టూర్‌ కోసం గుంటూరు నుంచి వచ్చామని వారు చెప్పారు. వారితో చంద్రబాబు ఫోటోలు దిగారు.

Updated Date - 2023-12-03T03:17:22+05:30 IST