Bhaskar Reddy Arrested: వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్టు

ABN , First Publish Date - 2023-04-17T02:24:20+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి, జగన్‌ సతీమణి భారతీరెడ్డికి స్వయాన మేనమామ అయిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది.

 Bhaskar Reddy Arrested: వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్టు

తెల్లవారుజామునే రంగంలోకి సీబీఐ

పులివెందులలో అరెస్టు చేసి

హైదరాబాద్‌కు తరలింపు

14 రోజులు రిమాండ్‌ విధించిన కోర్టు

చంచల్‌గూడ జైలుకు తరలింపు

ఉదయం 5 నుంచి 7 గంటల వరకు

ఇంట్లోనే భాస్కర్‌రెడ్డి విచారణ, అరెస్టు

302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు

ఆయన సెల్‌ఫోన్‌ సైతం స్వాధీనం

హైదరాబాద్‌కు తరలిస్తుండగా కార్లు, బండ్లు

పెట్టి అడ్డుకునేందుకు అనుచరుల యత్నం

భాస్కర్‌రెడ్డి ఆదేశాలతోనే ఆధారాలు ధ్వంసం

బెడ్రూంలోకి ఎవరూ రాకుండా బోల్టుపెట్టారు

ఆయన సూచనల మేరకే కుట్లు, బ్యాండేజీలు

గుండెపోటు కథతో నమ్మించే యత్నం

కస్టడీ పిటిషన్‌లో సీబీఐ

కడప/అఫ్జల్‌గంజ్‌/సైదాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి, జగన్‌ సతీమణి భారతీరెడ్డికి స్వయాన మేనమామ అయిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో దర్యాప్తు సంస్థ ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించింది. సోమవారం తమ ముందు హాజరు కావాలని అవినాశ్‌రెడ్డికి కూడా నోటీసులు జారీచేసింది. వివరాల్లోకి వెళ్తే.. పులివెందులలోని భాకరాపురంలో జగన్‌ నివాసం సమీపంలోనే వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఇల్లు ఉంది. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకే సీబీఐ అదనపు ఎస్పీ ముఖేశ్‌ శర్మ, ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.శ్రీమతి, నవీన్‌, పునియాలతో పాటు మరికొందరు సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.

ఏడు గంటల వరకు భాస్కర్‌రెడ్డిని విచారించారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు మెమో జారీ చేశారు. 120బీ రెడ్‌విత్‌ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి భాస్కర్‌రెడ్డి సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసి, ఆయన భార్య లక్ష్మికి మెమో అందించారు. దానిపై ఆయనతో సంతకాలు చేయించారు. పాలిటెక్నిక్‌ కళాశాలలో పనిచేస్తున్న పి.జనార్దన్‌రెడ్డితో సాక్షి సంతకం పెట్టించారు. భాస్కర్‌రెడ్డి ఇంటికి సీబీఐ బృందం వచ్చిందని తెలియడంతో అవినాశ్‌రెడ్డి అనుచ రులు గుంపులు గుంపులుగా అక్కడకు చేరుకున్నారు. భాస్కర్‌రెడ్డి సోదరుడు, మున్సిపల్‌ వైస్‌చైౖర్మన్‌ వైఎస్‌ మనోహర్‌రెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు అనంతరం భాస్కర్‌రెడ్డిని వాహనంలో కూర్చోబెట్టాక అప్పుడు ఆయనతో మనోహర్‌రెడ్డి మాట్లాడారు. ఉదయం 8 గంటలకు భాస్కర్‌రెడ్డిని పులివెందుల నుంచి ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా అనుచరులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. సీబీఐ వాహనాలకు కార్లు, బండ్లు అడ్డు పెట్టేందుకు యత్నించారు. భాస్కర్‌రెడ్డిని తీసుకెళ్లే వాహనం అప్పటికే వేగమందుకున్నప్పటికీ దానినీ ఆపాలని చూశారు.

2.jpg

కాస్త దూరం ముందుకెళ్లి ఆపి.. అడ్డుకోవద్దని సీబీఐ అధికారులు వారిని కోరారు. అనంతరం భాస్కర్‌రెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు. మధ్యాహ్నం 3.27 గంటలకు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఓపీ భవనంలో ఉన్న అత్యవసర విభాగంలో ఆర్‌ఎంవో డాక్టర్‌ మునావర్‌ నేతృత్వంలోని వైద్య బృందం ఆయనకు ఈసీజీ, షుగర్‌, కొవిడ్‌ టెస్టులు నిర్వహించింది. అనంతరం బీపీ పరీక్షలు చేయగా.. 170 రావడంతో అక్కడి వైద్యులు కార్డియాలజీ విభాగానికి రిఫర్‌ చేశారు. సాయంత్రం 4 గంటలకు భాస్కర్‌రెడ్డికి ఆస్పత్రిలో కులీకుతుబ్‌షా భవనంలోని కార్డియాలజీ విభాగంలో వైద్యులు 2డీ ఇకో పరీక్ష నిర్వహించారు. రిపోర్టు నార్మల్‌గా రావడంతో.. అన్ని వైద్య పరీక్షల నివేదికలతో సీబీఐ అధికారులు ఆయన్ను సాయంత్రం 4.20 గంటలకు సీబీఐ కోర్టు న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బీపీ కొద్దిగా పెరిగినట్లు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించడంతో కోర్టు ఆదేశాల మేరకు భాస్కర్‌రెడ్డిని జైలు ఆస్పత్రిలోని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆయనకు పాలు, బ్రెడ్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఇతర ఖైదీలు ఆయన్ను కలవకుండా జైలు ఆస్పత్రి వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఈ జైలులో ఉన్న సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను కూడా ఒకే చోట కాకుండా వేర్వేరు బ్యారక్‌లలో ఉంచారు.

పులివెందులకు చేరుకున్న ఎంపీ

సీబీఐ బృందం ఆదివారం తెల్లవారుజామున అవినాశ్‌రెడ్డి ఇంటికి వెళ్లినప్పుడు.. భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసి తరలించే సమయంలో ఎంపీ అక్కడ లేరు. హైదరాబాద్‌లో ఉన్నారు. మధ్యాహ్నానికి పులివెందులలోని ఇంటికి చేరుకున్నారు. సీబీఐ ఇచ్చిన మెమోను తల్లి లక్ష్మి ఆయనకు అందించారు. ఇంకోవైపు.. అవినాశ్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని వాట్సాప్‌ ద్వారా సమాచారం అందించింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన్ను నాలుగు సార్లు.. ఈ ఏడాది జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10, మార్చి 14 తేదీల్లో విచారించింది. ఇప్పుడు ఐదోసారి పిలిచింది. దీంతో వైసీపీ నేతల్లో టెన్షన్‌ నెలకొంది. ఆయన్ను కూడా అరెస్టు చేస్తారేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.

గుండెపోటు ప్రచారంలో భాస్కర్‌రెడ్డిదే కీలక పాత్ర!

వివేకానందరెడ్డి 2019 మార్చి 15న తన ఇంటిలోనే హత్యకు గురయ్యారు. అయితే ఆయనది గుండెపోటు అని తొలుత ప్రచారం చేయడంలో భాస్కర్‌రెడ్డే కీలక పాత్ర పోషించాడని సీబీఐ తెలిపింది. అలాగే సాక్ష్యాధారాలు చెరిపేయడంలోనూ ఆయన పాత్ర ఉందని ఇప్పటికే వెల్లడించింది. హత్యకు ముందు రోజు 2019 మార్చి 14న సాయంత్రం 6.14 నుంచి 6.31 వరకు భాస్కర్‌రెడ్డి ఇంట్లోనే ఏ-2 సునీల్‌యాదవ్‌ ఉన్నాడని.. హత్య జరిగిన తర్వాత కూడా అతడు అక్కడే ఉన్నట్లు గూగుల్‌ టేకౌట్‌ ద్వారా గుర్తించింది. దస్తగిరి కదిరి వెళ్లి గొడ్డలి తెచ్చే వరకు భాస్కర్‌రెడ్డి ఇంట్లోనే సునీల్‌ ఉన్నాడు. సునీల్‌ అక్కడున్న సమయంలోనే భాస్కర్‌రెడ్డి తన రెండు ఫోన్లను స్విచాఫ్‌ చేసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమిలో భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని.. పరాజయం తర్వాత వివేకానందరెడ్డి వారి నివాసానికి వెళ్లి భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలపై మండిపడ్డారని సీబీఐ పేర్కొంది. వివేకా వల్ల తమకు రాజకీయంగా మనుగడ ఉండదని భాస్కర్‌రెడ్డి భావించి ఆయన్ను హత్య చేయించారని తెలిపింది.

అరెస్టు నేపథ్యం ఇదీ..

వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి అభ్యర్థనపై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసు విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేసింది. ఇందులో ఏ-1గా ఎర్రగంగిరెడ్డి, ఏ-2 సునీల్‌కుమార్‌యాదవ్‌, ఏ-3 ఉమాశంకర్‌రెడ్డి, ఏ-4 డ్రైవరు దస్తగిరి, ఏ-5 దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఏ-6 ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఏ-7గా వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఉన్నారు. 2021 ఆగస్టు 2న సునీల్‌ యాదవ్‌, దస్తగిరిలను సీబీఐ అరెస్టు చేసింది. అదే ఏడాది సెప్టెంబరు 9న ఉమాశంకర్‌రెడ్డిని, నవంబరు 17న శివశంకరరెడ్డిని అరెస్టు చేసింది. ఈ నెల 14న ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేయగా.. ఆదివారం వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన ఏ-4 దస్తగిరి బెయిలుపై ఉన్నారు. మొదట నలుగురు నిందితులను చేరుస్తూ 2021 అక్టోబరు 26న సీబీఐ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. 2022 ఫిబ్రవరి 3న రెండో అనుబంధ చార్జిషీట్‌లో శివశంకర్‌రెడ్డిని ఏ-5గా చేర్చింది. 2019 మార్చి 28న అప్పటి సిట్‌ బృందం ఏ-1 ఎర్రగంగిరెడ్డిని అరెస్టు చేసింది. 90 రోజుల్లో చార్జిషీట్‌ వేయకపోవడంతో కోర్టు ఆయనకు బెయిల్‌ ఇచ్చింది. అప్పటి నుంచి డీఫాల్ట్‌ బెయిలుపై ఎర్రగంగిరెడ్డి బయటే ఉన్నారు. ఆ బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసింది.

పులివెందులలో వైసీపీ నిరసనలు

వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అరెస్టుతో వైసీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. నిరసనగా పులివెందులలోని వైఎస్‌ విగ్రహం నుంచి పూల అంగళ్ల వరకు నేతలు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేశారు. దుకాణాలు మూసివేయాలని పిలుపిచ్చారు. అయితే ర్యాలీ చేసేటప్పుడు మాత్రమే దుకాణందారులు షాపులను మూసివేసి.. అనంతరం యథావిఽధిగా తెరిచారు. కడపలో మేయర్‌ సురేశ్‌బాబు ఆధ్వర్యంలో ఏడురోడ్ల కూడలి వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌రెడ్డి, జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, బద్వేలులో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, మైదుకూరులో రాష్ట్ర వ్యవసాయశాఖ సలహాదారు తిరుపాల్‌రెడ్డి, రాజంపేటలో జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆఽధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజంపేటలో సీబీఐ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో భాస్కర్‌రెడ్డికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలుసుకున్న స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.

cdp2.jpg

హైదరాబాద్‌లో అవినాశ్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత

బంజారాహిల్స్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో వైఎస్‌ అవినాశ్‌రెడ్డి నివాసం వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. సీబీఐ అధికారులు ఆయన్ను అరెస్టు చేసేందుకు వచ్చారంటూ సోషల్‌ మీడియాలో కథనాలు రావడంతో మీడియా ప్రతినిధులు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10సీలోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీకి పరుగులు తీశారు. ఇంటి ముందు మూడు వాహనాలు ఉన్నాయి. అవి మొదట సీబీఐ అధికారులవే అనుకున్నారు. కొన్ని చానళ్లు వాటిని చూపిస్తూ ఇంట్లో సోదాలు చేస్తున్నారని ప్రసారం చేశాయి. మరికొద్ది సేపట్లో అరెస్టు చేయబోతున్నారంటూ లైవ్‌ కూడా పెట్టారు. దాంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే సీబీఐ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మౌనంగానే ఉండిపోయారు. ఈలోగా సీబీఐ అధికారులు పులివెందులలో ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడంతో అవినాశ్‌ అరెస్టు కూడా ఉంటుందని ప్రచారం జరిగింది.

వాట్‌ నెక్ట్స్‌..?

నేడు విచారణకు రండి

ఎంపీ అవినాశ్‌రెడ్డికి సీబీఐ పిలుపు

ఏం జరుగుతుందో.. వైసీపీలో టెన్షన్‌

కొత్త జట్టు వచ్చినా పాతబాటే!

సీబీఐపై అవినాశ్‌ మండిపాటు

కడప, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదులోని కోఠిలో ఉన్న సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని పేర్కొంది. ఈ మేరకు వాట్సప్‌ ద్వారా సమాచారం అందించింది. ఈ కేసులో ఇప్పటికే అవినాశ్‌ను సీబీఐ నాలుగు సార్లు విచారించింది. ఇప్పుడు ఐదోసారి విచారణకు పిలిచింది. వివేకా హత్య కేసులో ఆదివారం అవినాశ్‌ తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని పులివెందులలో సీబీఐ అరెస్టు చేసి హైదరాబాదుకు తరలించి సీబీఐ న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించారు. ఇప్పుడు అవినాశ్‌రెడ్డిని మరోసారి విచారణకు పిలవడంతో వైసీపీలో టెన్షన్‌ నెలకొంది. కాగా.. ఇప్పటికే ఈ ఏడాది జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10, మార్చి 14న అవినాశ్‌రెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఐదోసారి సీబీఐ ముందు హాజరుకానున్నారు.

Updated Date - 2023-04-17T02:24:20+05:30 IST