MLC Elections:ఎమ్మెల్సీ స్థానాలకు మోగిన నగారా!

ABN , First Publish Date - 2023-02-10T02:28:18+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. 8 స్థానిక సంస్థల్లోని 9 నియోజకవర్గాలు, మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది.

MLC Elections:ఎమ్మెల్సీ స్థానాలకు  మోగిన నగారా!

వీటిలో 9 స్థానిక సంస్థల సీట్లు

3 పట్టభద్రులు, 2 టీచర్‌ స్థానాలు

ఈ నెల 16న నోటిఫికేషన్‌ జారీ

మార్చి 13న పోలింగ్‌.. 16న కౌంటింగ్‌

షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ

న్యూఢిల్లీ/అమరావతి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. 8 స్థానిక సంస్థల్లోని 9 నియోజకవర్గాలు, మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గురువారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ స్థానాల్లో ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ 23. ఆ మర్నాడు నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 27 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఎన్నికలు అనివార్యమైతే మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే నెల 16న ఓట్ల లెక్కించి.. ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని ఈసీ స్పష్టం చేసింది. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఇదే షెడ్యూల్‌తో ఎన్నికలు జరగనున్నాయి.

పదవీ విరమణ చేసేది వీరే..

స్థానిక సంస్థల కోటాలో నెల్లూరు-అనంతపురం ఎమ్మెల్సీ గునపాటి దీపక్‌రెడ్డి (టీడీపీ), కడప-బీటెక్‌ రవి (టీడీపీ) మార్చి 29న.. నెల్లూరు-వాకాటి నారాయణరెడ్డి (ప్రస్తుతం బీజేపీ), పశ్చిమ గోదావరి-అంగర రామ్మోహన్‌, మంతెన వెంకట సత్యనారాయణరాజు, తూర్పు గోదావరి-చిక్కాల రామచంద్రరావు, శ్రీకాకుళం-శత్రుచర్ల విజయరామరాజు, చిత్తూరు-బీఎన్‌ రాజసింహులు, కర్నూలు-కేఈ ప్రభాకర్‌ (అంతా టీడీపీ) మే 1న పదవీ విరమణ చేయనున్నారు. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి (పీడీఎఫ్‌), కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి (వైసీపీ), శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ (బీజేపీ), ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం (పీడీఎఫ్‌), కడప-అనంతపురం-కర్నూలు టీచర్స్‌ ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి మార్చి 29న రిటైర్‌ కానున్నారు.

Updated Date - 2023-02-10T02:28:19+05:30 IST