ఎమ్మెల్యే అనుచరుడి చెంప చెళ్ల్ఙు

ABN , First Publish Date - 2023-09-13T04:29:13+05:30 IST

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలోనేవైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ప్రకాశం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల అనుకూల, వ్యతిరేక వర్గాలు ఢీ అంటే ఢీ అన్నాయి.

ఎమ్మెల్యే అనుచరుడి చెంప చెళ్ల్ఙు

విజయసాయి సమక్షంలోనే కొట్టిన మహిళా ఎంపీపీ

ఆరు నియోజకవర్గాల్లో భగ్గుమన్న విభేదాలు

వాగ్వాదాలతో దద్దరిల్లిన సమావేశాలు

ప్రకాశం జిల్లాలో ఇదీ పరిస్థితి

(ఆంధ్రజ్యోతి-ఒంగోలు)

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలోనేవైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ప్రకాశం జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిల అనుకూల, వ్యతిరేక వర్గాలు ఢీ అంటే ఢీ అన్నాయి. కొన్ని సమావేశాలు వాగ్వాదాలతో దద్దరిల్లాయి. విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరికలు చేసి వారిని శాంతింపజేసేందుకు కష్టపడాల్సి వచ్చింది. కొత్తగా పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌గా నియమితులైన విజయసాయిరెడ్డి సోమ, మంగళవారాల్లో ఒంగోలులో తిష్ఠవేసి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్ష చేశారు. ఆరుచోట్ల పార్టీ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. సోమవారం ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులతో విజయసాయి రెడ్డి విడివిడిగా భేటీ అయ్యారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డిలతోనూ విడివిడిగా సమావేశమయ్యారు. అన్ని నియోజకవర్గాల సమీక్షలను బాలినేని సమక్షంలోనే చేపట్టారు. కొండపి, ఎస్‌ఎన్‌పాడు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల సమీక్షల్లో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే సుధాకరబాబు పార్టీ నాయకులపైనే తప్పుడు కేసులు బనాయించారని, అవినీతిని అగ్రస్థానానికి తీసుకెళ్లారని ఆయన వ్యతిరేకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరుడు విజయ్‌కుమార్‌ ఎదురుదాడికి దిగి ఎన్‌జీపాడు ఎంపీపీపై విమర్శలు చేశారు. ఆగ్రహించిన ఎంపీపీ అంజమ్మ విజయ్‌కుమార్‌ చెంప చెల్లుమనిపించారు. సమావేశం అనంతరమూ ఇరువర్గాలు బయట పార్టీ ఇన్‌చార్జి అశోక్‌బాబు అనుకూల, వ్యతిరేక వర్గాలు తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి. అశోక్‌బాబుకు టికెట్‌ ఇస్తే సహకరించబోమని కొందరు బహిరంగంగానే తేల్చిచెప్పారు. మార్కాపురం నియోజకవర్గ సమావేశంలోను అదే తంతు సాగింది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా బహిరంగ ఆరోపణలు చేస్తున్న సూర్యప్రకాశ్‌రెడ్డిని విజయసాయిరెడ్డి హెచ్చరిస్తూ మాట్లాడేందుకు అవకాశం కూడా ఇవ్వలేదు. మరోసారి బహిరంగ విమర్శలు చేయవద్దని వార్నింగ్‌ ఇచ్చారు. ‘నీ చర్యలు పార్టీని, ఎమ్మెల్యే వ్యక్తిగత పలుకుబడిని దెబ్బతీస్తున్నాయి, కంట్రోల్‌ లో ఉండు’ అంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చారు.

వైవీపై బాలినేని విసుర్లు

ఒంగోలు నియోజకవర్గ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డిపై బాలినేని కొన్ని ఆరోపణలు చేసినట్లు తెలిసింది. వ్యక్తిగతంగా తన పలుకుబడిని దెబ్బతీసేందుకు అసత్య ప్రచారాలు చేస్తూ మీడియాలో వార్తలు రాయిస్తున్నారని వైవీపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. చివరిగా మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మంత్రి సురేశ్‌, జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి పేర్లను ప్రస్తావించకుండా జిల్లాలో పార్టీ బాధ్యతంతా బాలినేనే చూస్తారని చెప్పటం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2023-09-13T04:29:13+05:30 IST