ఆ ఇద్దరి వల్లే ఏపీ బొక్కబోర్లా
ABN , First Publish Date - 2023-06-11T03:25:59+05:30 IST
తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ను, ఆ రాష్ట్ర నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఇద్దరు నేతలు వ్యవహరించిన తీరు వల్లే ఆంధ్రప్రదేశ్ బొక్కబోర్లా పడిందన్నారు.
వాళ్లది ప్రచారం ఎక్కువ.. మనది పని ఎక్కువ
దేశంలో ఎక్కువ వేతనాలు మన ఉద్యోగులకే
ధరణిని తీసేస్తే కాంగ్రెస్ కార్యకర్తలకే రైతుబంధు
సుపరిపాలన కార్యక్రమంలో మంత్రి హరీశ్ వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి దివ్యాంగుల పాలాభిషేకం
సంగారెడ్డి, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ను, ఆ రాష్ట్ర నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక ఇద్దరు నేతలు వ్యవహరించిన తీరు వల్లే ఆంధ్రప్రదేశ్ బొక్కబోర్లా పడిందన్నారు. గతంలో ఒకరు హైటెక్ పాలన అంటూ హడావిడి చేశారని, ఇప్పుడేమైందని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సంగారెడ్డిలో జరిగిన సుపరిపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ‘‘ఏపీ పాలకులది ప్రచారం ఎక్కువ.. మనది పని ఎక్కువ. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి చూస్తే తెలంగాణ గొప్పదనమేంటో తెలుస్తుంది. ఆ రాష్ట్రల్లో రోడ్లు సరిగా లేవు. తాగునీరు కూడా సక్రమంగా అందడం లేదు’’ అని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తలెత్తుకునేలా పాలన సాగిస్తున్నారని కొనియాడారు.
కేంద్రంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలలో కన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువ వేతనాలు పొందుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ చేస్తున్న మంచి పనులను చూసి కేంద్రం తట్టుకోలేకపోతోందని, అందుకే రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.లక్షా 30 వేల కోట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటున్నారని, ధరణి తీస్తే కాంగ్రెస్ కార్యకర్తలకే రైతుబంధు వస్తుందని, ఆ పార్టీ దళారుల రాజ్యం వస్తుందని హరీశ్‌రావు అన్నారు. కాగా, దివ్యాంగుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచినందుకుగాను సంగారెడ్డిలో దివ్యాంగులతో కలిసి మంత్రి హరీశ్‌రావు కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.