అర్ధరాత్రి హైడ్రామా!
ABN , First Publish Date - 2023-03-19T03:13:56+05:30 IST
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించినా.. ఎన్నికల అధికారులు డిక్లరేషన్ ఇవ్వలేదు. భూమిరెడ్డి గెలిచారని స్వయంగా ప్రకటించిన అధికారులు..

‘పశ్చిమ సీమ’లో టీడీపీ అభ్యర్థి
గెలిచినా డిక్లరేషన్ ఇవ్వని అధికారులు
గంటల తరబడి భూమిరెడ్డి నిరీక్షణ
రీ కౌంటింగ్ కోరుతూ వైసీపీ నిరసన
దీంతో పూర్తిగా మారిపోయిన సీన్
అధికారుల వ్యవహార శైలిపై సందేహం
వ్యక్తం చేస్తూ.. టీడీపీ నేతల ఆందోళన
అర్ధరాత్రి వేళ రాంగోపాల్ రెడ్డి అరెస్టు
బలవంతంగా ఈడ్చుకెళ్లిన పోలీసులు
కాలవ, సునీత తదితర నేతలూ అరెస్టు
అనంతపురం టౌన్, మార్చి 18: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించినా.. ఎన్నికల అధికారులు డిక్లరేషన్ ఇవ్వలేదు. భూమిరెడ్డి గెలిచారని స్వయంగా ప్రకటించిన అధికారులు.. అనంతరం వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి నుంచి నిరసన వ్యక్తం కావడంతో యూటర్న్ తీసుకున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. వాస్తవానికి వైసీపీ అభ్యర్థి సహా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి నిరసన వ్యక్తంచేసినా.. రీకౌంటింగ్ జరపాలని కోరినా.. రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి తొలుత పట్టించుకోలేదు. కానీ, సమయం గడిచేకొద్దీ.. ఆమె మౌనం వహించారు. భూమిరెడ్డికి ఎంతకీ డిక్లరేషన్ ఇవ్వకపోవడంతో టీడీపీ నేతలు ఆందోళకు దిగారు. భారీ మెజార్టీతో గెలిచిన తమ పార్టీ అభ్యర్థిని అభినందించేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత తదితరులు జేఎన్‌టీయూ కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లారు.
దాదాపు 3గంటల పాటు డిక్లరేషన్ ఫారం కోసం వేచిచూశారు. రీ కౌంటింగ్ కోరుతూ వైసీపీ వర్గీయులు ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో ఎన్నికల అధికారులు ఏదో చేస్తున్నారని టీడీపీ వర్గీయుల్లో ఆందోళన మొదలైంది. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు జేఎన్‌టీయూ ప్రధాన ద్వారం వద్ద రాత్రి 11.20 సమయంలో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డితో కలిసి బైఠాయించారు. టీడీపీ అభ్యర్థికి వెంటనే డిక్లరేషన్ ఫారం ఇవ్వాలని కాలవ, పరిటాల సునీత డిమాండ్ చేశారు. ఈ సమయంలో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయేందుకు కారులో వచ్చారు. టీడీపీ శ్రేణులు అడ్డుగా వెళ్లడంతో ఆమె తిరిగి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారు. ఆ తర్వాత జేసీ కేతన్ గార్గ్ వాహనాన్ని కూడా టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రికత ఏర్పడింది. అర్ధరాత్రి సమయంలో కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత సహా టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల్లో గెలిచారని అధికారులు స్వయంగా ప్రకటించిన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని బలవంతంగా ఈడ్చుకువెళ్లి పోలీసులు వ్యానులో పడేశారు. అనంతరం వీరిని అనంతపురం త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.