Explosion : కాలిన బతుకులు

ABN , First Publish Date - 2023-06-01T05:40:45+05:30 IST

టపాసులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించడంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలు 20 అడుగుల దూరం ఎగిరి పడ్డాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం తిరుపతి జిల్లా

Explosion : కాలిన బతుకులు
తిరుపతి జిల్లా ఎల్లకట్టవ గ్రామ శివారులో పేలుడు సంభవించిన టపాసుల తయారీ కేంద్రం

టపాసుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు

ముగ్గురు దుర్మరణం.. తిరుపతి జిల్లాలో ఘటన

వరదయ్యపాలెం, మే 31: టపాసులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించడంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలు 20 అడుగుల దూరం ఎగిరి పడ్డాయి. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం శాతంబేడు పంచాయితీ ఎల్లకట్టవ గ్రామ శివారులోని టపాసుల తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. ఎల్లకట్టవ గ్రామ శివారులోని పంటపొలాల్లో అదే గ్రామానికి చెందిన వీరరాఘవ అలియాస్‌ వీరయ్య(38) టపాసుల తయారీ కేంద్రాన్ని ఐదేళ్లుగా నిర్వహిస్తున్నారు. గూడూరుకు చెందిన ఏడుకొండలు(42), ఎల్లకట్టవ గ్రామానికే చెందిన కల్యాణ్‌(28), నాగేంద్ర(26), శంకరయ్య(35) పని చేస్తున్నారు. బుధవారం గోదాములో ఒకరు, వెలుపల పందిరి లాంటి పూరిపాకలో ఇద్దరు టపాసులు తయారు చేస్తున్నారు. కల్యాణ్‌, యజమాని వీరయ్య కాస్త దూరంలో చెట్ల కింద సేదతీరుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పూరిపాకలో పేలుడు సంభవించింది. పక్కనే ఉన్న మూడు బైక్‌లకు మంటలు వ్యాపించాయి. నిప్పులు ఎగిసి గోదాములో పడడంతో అక్కడి టపాసులు కూడా పేలిపోయాయి. గోదాములో ఉన్న ఒకరు, పూరిపాక కింద ఉన్న మరో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మృతులను శంకరయ్య, నాగేంద్ర, ఏడుకొండలుగా గుర్తించారు. చెట్ల కింద సేదతీరుతున్న వీరయ్య, కల్యాణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.

భీతావహంగా...

పేలుడు ప్రదేశం భీతావహంగా మారింది. ఓ మృతుడి ముఖం ఛిద్రమై రెండుగా చీలిపోయింది. నడుము నుంచి కింది భాగం తెగిపోయి ఓ చోట ముద్దగా పడివుంది. మరో మృతుడి ముఖం గుర్తుపట్టలేని విధం గా మాంసపు ముద్దలా మా రింది. కుడిచేయి తెగి మరో చోట పడింది. ఇంకో మృతుడి కాలు సగం తెగింది.

Updated Date - 2023-06-01T05:40:45+05:30 IST