Share News

తేడా కొడుతోంది..తప్పుకొంటే మేలు!

ABN , First Publish Date - 2023-11-21T03:47:20+05:30 IST

‘ప్రతిపక్ష పార్టీల్లో చురుగ్గా ఉండే వారిపై గురి పెట్టండి. సీఎం అంటే చాలు రోడ్డుపైనే తన్నండి. పసుపు జెండాతో కనిపిస్తే ఏదో ఒక కేసు పెట్టండి.

తేడా కొడుతోంది..తప్పుకొంటే మేలు!

లూప్‌ లైన్లోకి జారుకుంటున్న ఖాకీలు

అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకోలేకే..

లా అండ్‌ ఆర్డర్‌ వద్దు బాబోయ్‌ అంటున్న వైనం

సీఐల నుంచి కానిస్టేబుళ్ల వరకూ అదే తీరు

ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత.. బాబుపై సానుభూతి

ఈ మార్పును పసిగట్టి అప్రమత్తమవుతున్న రక్షక భటులు

ఏసీబీ, విజిలెన్స్‌ కోసం పైరవీలు.. ఇతర మార్గాల అన్వేషణ

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ‘ప్రతిపక్ష పార్టీల్లో చురుగ్గా ఉండే వారిపై గురి పెట్టండి. సీఎం అంటే చాలు రోడ్డుపైనే తన్నండి. పసుపు జెండాతో కనిపిస్తే ఏదో ఒక కేసు పెట్టండి. నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు నమోదు చేయండి’ అంటూ అధికార పార్టీ నాయకులు తెస్తున్న ఒత్తిళ్లకు పోలీసులు బెంబేలెత్తి పోతున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ముఖ్యమంత్రి జగన్‌.. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కేసులు పెట్టించి అరెస్టు చేయించిన విధానాన్నే మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎంచుకున్నారు. ప్రతి చిన్న విషయంలోనూ టీడీపీ శ్రేణులను వేధించడమే పనిగా పెట్టుకోవాలంటూ ఎస్‌హెచ్‌వో(స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌)ల వెంటపడుతున్నారు. అయితే, ‘ఇదేమి అరాచకం? నోరెత్తితే వెంటపడి కొడతారా! జై జగన్‌ అనకుంటే పథకాలు తీసేస్తారా? జగన్‌ మళ్లీ వస్తే ప్రాణాలు కూడా మిగలవు! ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబు అవినీతి చేశారా? రేషన్‌ బియ్యం కన్నా ఎక్కువ ధర పలుకుతున్న జగనన్న ఇసుకలో నిజాయితీ ఉందా? ఈ సారి టీడీపీ కచ్చితంగా వస్తుంది. జగన్‌ గెలవడని వైసీపీ వాళ్లే చెబుతున్నారు..’ ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో ఇటీవల ఎక్కువయ్యాయి. దీంతో పోలీసుల్లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే వన్‌ సైడ్‌ చేశాం.. వైసీపీ ప్రభుత్వం మళ్లీ వచ్చేలా లేదు. లూప్‌లైనుకు ఇప్పుడే వెళ్లిపోతే మంచిది. లేదంటే రాబోయే ప్రభుత్వంలో సస్పెన్షన్లే కాదు.. రిమాండ్‌కు పోయినా ఆశ్చర్యంలేదు..’ అంటూ ఖాకీల నోట వినిపిప్తోంది.

అంతర్గత భద్రత, రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీసులు మన రాష్ట్రంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ఐపీసీ చట్టాలు, పోలీసు మాన్యువల్‌ సూత్రాలు విస్మరించారు. వైసీపీ చట్టాలు, జగన్‌ సూత్రాలను పాటిస్తూ ప్రతిపక్ష శ్రేణులపై కేసులు పెడుతున్నారు. చితకబాది జైళ్లకు పంపుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో కిందిస్థాయి పోలీసుల్లో కొంత మార్పు కనిపిస్తోంది. ప్రజల్లో జగన్‌ పాలనపై వ్యతిరేకత పెరుగుతుండటం, చంద్రబాబుకు అంతకు మించి సానుభూతి వస్తుండటంతో కళ్ల ముందు భవిష్యత్తు కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం రాదని తెలిసిపోవడంతో అహంకార పూరిత అధికారులు లూప్‌ లైను బాట పడుతున్నారు. నిన్న, మొన్నటి దాకా జగనే మళ్లీ వస్తాడని విర్రవీగి అడ్డమైన పనులు చేశారు. ఇప్పుడు అదే పోస్టులో ఉంటే పుట్టగతులు ఉండవని అప్రమత్తమయ్యారు.

దిక్కుతోచని సీఐలు..

చంద్రబాబుపై సానుభూతి వస్తుండటంతో తమకు ఎన్నికల్లో ప్రమాదం తప్పదని గ్రహించిన జిల్లాల్లోని వైసీపీ ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ సీఐలపై ఒత్తిడి చేసి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై ఉక్కుపాదం మోపేందుకు యత్నిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే కావల్సినన్ని వేధింపుల కేసులు పెట్టిన పోలీసులు ఇంకా అక్కడక్కడా మిగిలిన వారిపై గురి పెట్టారు. అలా చేయని వారిని పోలీసు ఉన్నతాధికారులు సైతం ‘మీ ఎమ్మెల్యే చెప్పిందేదో చేయండయ్యా..!’ అంటున్నారు. కొన్ని జిల్లాల్లో ఎస్పీలు వైసీపీ కండువా వేసుకున్న నాయకుల్లా వ్యవహరిస్తుండటంతో సీఐలు దిక్కుతోచక టెన్షన్‌ పడుతున్నారు. పోస్టింగ్‌ కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలతో సిఫారసులు పొందిన ఎస్‌ఐలు, సీఐలు, డీఎస్పీలు ఐపీసీ చట్టం కన్నా వైసీపీ చట్టమే ముఖ్యమని అమలు చేశారు. అయితే వారి స్టేషన్ల పరిధిలో కింది స్థాయి కానిస్టేబుళ్లలో వచ్చిన మార్పు మరో సమస్యగా తయారైంది. మాకిచ్చే రూ.300 సైకిల్‌ అలవెన్సు కూడా తీసేసిన వ్యక్తి.. ఇప్పుడు అరాచకాలు చేస్తుంటే మేమెందుకు భరించాలి?’ అని వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్‌ ప్రభుత్వంలో పని ఒత్తిడి, అవమానాలు, వారంతపు సెలవులిస్తామంటూ చేసిన మోసం, సిబ్బంది నియామకాల్లేక పోవడం, అలవెన్సులు తీసేయడం, తాము దాచుకున్న డబ్బులు సైతం ప్రభుత్వం బటన్‌ నొక్కుడుకు వాడేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అధికార పార్టీ అరాచకాలకు అనుగుణంగా పని చేయబోమని, తమ డ్యూటీ తాము న్యాయంగా చేస్తామని సీఐలకు తేల్చిచెబుతున్నారు. రేపు ప్రభుత్వం మారితే చిన్న ఉద్యోగులైన తమను ఎవరు రక్షిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో తమ పరిస్థితి కూడా అదేనని ఎస్‌హెచ్‌వోలూ వాపోతున్నారు. స్థానిక ఎన్నికల్లో పోలీసుల్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు, అక్రమాలు, దొంగ ఓట్లతో గెలిచిన జగన్‌కు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో దిమ్మ తిరిగే తీర్పు వచ్చింది. వైసీపీ అరాచకాలతో ప్రజల్లో ఇదే మార్పు వస్తోందని, రాబోయే ఎన్నికల్లో పట్టభద్రుల ఫలితాలే వస్తే పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు, లోకేశ్‌లాంటి వారిపై జగన్‌ కక్ష సాధిస్తుంటే.. జిల్లాల్లో వైసీపీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు తట్టుకోలేని సీఐలు, ఎస్‌ఐలు లూప్‌లైన్‌ సాధ్యం కాకపోతే వీఆర్‌కు వెళ్లడమో లేదా చార్జిమెమో తీసుకోవడానికైనా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

పెరిగిన అధికార పార్టీ దౌర్జన్యాలు..

అధికార పార్టీ కార్యకర్తలు దౌర్జన్యం చేస్తే వారిలో ఎవరిని పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చినా వెంటనే వైసీపీ నేతల నుంచి ఎస్‌హెచ్‌వోలకు ఫోన్లు వస్తున్నాయి. వెంటనే వదలకుంటే క్రిమినల్స్‌పై తాము వాడే బూతుల కన్నా ఎక్కువ వినాల్సి వస్తోందని గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్‌ఐలు వాపోతున్నారు. అనంతపురంలో నేరుగా సెబ్‌ స్టేషన్లోకి వెళ్లి ఎస్‌ఐపై దౌర్జన్యం చేసి, మహిళా కానిస్టేబుల్‌ను లాగేసి అక్రమ మద్యం కేసులో వైసీపీ కార్యకర్తను విడిపించి తీసుకెళ్లిన తీరు కింది స్థాయి పోలీసుల్లో చర్చకు దారి తీసింది. రాష్ట్రంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో పోలీసులపై వైసీపీ శ్రేణులు తిరగబడుతోన్న ఘటనలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రమంతా ఇదే పరిస్థితి...

రాష్ట్రంలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నిజాయితీపరుడిగా పేరున్న ఒక సీఐ చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ చెప్పినట్లు తలాడించలేక కొన్ని నెలల క్రితం ఏసీబీలోకి వెళ్లిపోయారు. అదే బాటలో రాయలసీమ జిల్లాల్లో పలువురు సీఐలు లూప్‌లైన్‌ బాటపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శాంతి భద్రతల విభాగం సీఐ ఒకరు విజిలెన్స్‌కు వెళ్లేందుకు అన్ని అర్హతలు సాధించారు. ఆయనతో పాటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎనిమిది మందికి సమ్మతి వచ్చినా ఇప్పటికే విజిలెన్స్‌లో ఉంటోన్న సీఐలు ‘అమ్మో లా అండ్‌ ఆర్డర్‌కు మేం వెళ్లం సార్‌’ అంటూ గగ్గోలు పెడుతున్నారు. అధికార పార్టీ అరాచకాలతో అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో పలువురు ఎస్‌హెచ్‌వోలు సీక్‌ లీవులు పెడుతున్నారు.

Updated Date - 2023-11-21T03:47:21+05:30 IST