ఈడీ విచారణకు మాగుంట గైర్హాజరు

ABN , First Publish Date - 2023-03-19T03:28:01+05:30 IST

: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గైర్హాజరయ్యారు.

ఈడీ విచారణకు మాగుంట గైర్హాజరు

తన సోదరుని కుమారుడికి అనారోగ్యంగా ఉందని...

చెన్నైలో ఉన్నందున విచారణకు రాలేకపోతున్నానని లేఖ

మరో తేదీన రావాలంటూ నోటీసులు జారీ చేసే చాన్స్‌

28 వరకూ రాఘవ్‌ రిమాండ్‌ పొడిగింపు

న్యూఢిల్లీ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గైర్హాజరయ్యారు. సౌత్‌ గ్రూపులో కీలకంగా ఉన్న శ్రీనివాసులు రెడ్డిని శనివారం విచారణకు హాజరు కావాలని ఇటీవల ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, తన సోదరుని కుమారుడు అనారోగ్యంగా ఉన్న కారణంగా తాను చెన్నైలో ఉండిపోయానని, కాబట్టి విచారణకు రాలేకపోతున్నానని ఈడీకి ఆయన లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ లేఖను పరిశీలించి మరో తేదీన విచారణకు హాజరవ్వాలంటూ ఈడీ ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసే అవకాశముంది. కాగా, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఈడీ అరెస్టు చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్‌ మాగుంట జ్యుడీషియల్‌ రిమాండ్‌ను రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 28 వరకు పొడిగించింది. రిమాండ్‌ గడువు ముగియడంతో తిహాడ్‌ జైలులో ఉన్న ఆయనను శనివారం సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట ప్రవేశపెట్టారు. దర్యాప్తులో పురోగతి సాధించామని, మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని, కాబట్టి రాఘవ్‌ రిమాండ్‌ను పొడిగించాలని ఈడీ తరఫున న్యాయవాదులు అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి ఈ నెల 28 వరకు రిమాండ్‌ గడువును పొడిగించారు.

Updated Date - 2023-03-19T03:28:01+05:30 IST