18వ నిందితుడిగా మాగుంట రాఘవ్‌ రెడ్డి

ABN , First Publish Date - 2023-05-02T02:16:29+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్‌ రెడ్డిది కీలక పాత్ర అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తెలిపింది.

18వ నిందితుడిగా మాగుంట రాఘవ్‌ రెడ్డి

న్యూఢిల్లీ, మే 1(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్‌ రెడ్డిది కీలక పాత్ర అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తెలిపింది. ఆయనను 18వ నిందితుడిగా, ఆయనకు చెందిన మాగుంట ఆగ్రో ఫామ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, పిక్సి ఎంటర్‌ప్రైజె్‌సలను కూడా నిందితులుగా చేరుస్తూ ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటును సోమవారం రౌజ్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో రాఘవ్‌ రెడ్డిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం వ్యాపారంలో వివిధ సంస్థలు కుమ్మక్కై లైసెన్సులు పొందడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చార్జిషీటులో పేర్కొంది. చెన్నైలోని ఎన్రికా ఎంటర్‌ప్రైజె్‌సకు ఆయన యజమాని అని, రిటైల్‌, హోల్‌సేల్‌ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని మద్యం విధానంలో స్పష్టంగా ఉన్నా.. మాగుంట ఆగ్రో ఫామ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట రెండు రిటైల్‌ జోన్లు పొందారని తెలిపింది. రాఘవ్‌ తరఫున ఆయన బినామీ ప్రేమ్‌ రాహుల్‌ మండూరి ఇండో స్పిరిట్స్‌ సంస్థలో 32.5 శాతం వాటాలు పొందారని పేర్కొంది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు చెల్లించిన సౌత్‌ గ్రూపులో ఉన్నారని తెలిపింది. రాఘవ్‌ మాగుంట ఐదు ఖాతాల ద్వారా ఇండో స్పిరిట్స్‌ సంస్థకు డబ్బులు బదిలీ చేశారని ఆరోపించింది. రాఘవ్‌, ఆయన తండ్రి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జీఎంఆర్‌ సంస్థకు చెందిన బీవీ నాగేశ్వర రావును కలుసుకొని ఢిల్లీలో ఎయిర్‌పోర్టులో ఎన్‌వోసీ పొందే విషయంపై చర్చించారని తెలిపింది. తన వ్యాపారంలో జీఎంఆర్‌ను భాగస్వామిని చేసుకునేందుకు ఆయనను కలుసుకున్నట్లు శ్రీనివాసులు రెడ్డి - జీఎంఆర్‌ మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌ను బట్టి తెలుస్తోందని ఈడీ వెల్లడించింది. ఎయిర్‌పోర్టు జోన్‌లో పిక్సి ఎంటర్‌ప్రైజె్‌సకు ఎన్‌వోసీ పొందేందుకు శ్రీనివాసులు రెడ్డి చేసిన ప్రయత్నాలు నెరవేరలేదని పేర్కొంది.

దాంతో ఎక్సైజ్‌ శాఖ నుంచి ప్రతిపాదనలు లేకుండానే మనీశ్‌ సిసోడియా ఏకపక్షంగా ఈఎండీ మొత్తాన్ని పిక్సి ఎంటర్‌ప్రైజ్‌సకు తిరిగి చెల్లించాలని నిర్ణయించారని వివరించింది. కాగా, ‘‘2021 సెప్టెంబరు 29న బుచ్చిబాబుకు రాఘవ్‌ మాగుంటకు మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌ ప్రకారం.. అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిల్లర్స్‌ (ఏబీడీ)కి ఎల్‌1 వ్యాపారం గురించి, అందులో హైదరాబాద్‌పై ఆసక్తి గురించి ప్రస్తావన వచ్చింది. రాఘవ్‌ గ్రూపునకు ఎల్‌1 వ్యాపారం ఇచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వ స్థాయి నుంచి ఒక వ్యక్తి ఏబీడీతో మాట్లాడతారని బుచ్చిబాబు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అంటే కల్వకుంట్ల కవిత అని బుచ్చిబాబు రాఘవ్‌కు చెప్పారు. ఆ తర్వాత కవితకు సన్నిహిత సహచరుడైన సృజన్‌ రెడ్డితో కలిసి ఆమె, బుచ్చిబాబుతో వ్యాపారాన్ని ఏర్పాటు చేశారు’’ అని ఈడీ పేర్కొంది.

Updated Date - 2023-05-02T02:16:29+05:30 IST