Share News

మనోళ్లను వెతకండి!

ABN , First Publish Date - 2023-11-29T03:57:51+05:30 IST

ఎన్నికల్లో విజయం సాధించడానికి జగన్‌ సర్కారు అడ్డదారులు తొక్కుతోంది. ఫాం-7ను అడ్డుపెట్టుకుని నిజమైన ఓటర్ల తొలగింపునకు ఇప్పటికే అరాచకాలకు పాల్పడింది.

మనోళ్లను వెతకండి!

సచివాలయాల ఉద్యోగులపై కన్ను

వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడమే లక్ష్యం

మరోసారి అడ్డదారి తొక్కిన పెద్దలు

సచివాలయాల్లో ‘మనవారెవరు?’

కొందరు ఉద్యోగ నేతలతో ఆరా

వారితో అక్రమాలకు తెర తీసేవ్యూహం

ఇతర శాఖల ఉద్యోగులపైనా దృష్టి

ఈసారి ఎన్నికల్లో అడ్డదారిలో గెలవడమే లక్ష్యం! దీనికోసం వలంటీర్లను తొలుత ప్రభుత్వ పెద్దలు ప్రయోగించారు. ఓటర్ల నమోదు పనిని వారికి అప్పగించడాన్ని ఈసీ తీవ్రంగా ఆక్షేపించింది. జగన్‌పై కన్నెర్ర చేస్తున్న టీచర్లను పోలింగ్‌ ప్రక్రియనుంచి తప్పించేందుకు వేసిన ఎత్తునూ ఈసీయే చిత్తు చేసింది. ఓటర్ల తొలగింపునకు ఉద్దేశించిన ఫాం-7లోఅనుకూల అధికారులను వాడుకుని పెద్దఎత్తున అరాచకాలకు పాల్పడ్డారు. ప్రతిపక్షాలు అప్రమత్తం కావడంతో అలాంటి అధికారులపై వేటు పడుతున్నాయి. ఇప్పుడిక సచివాలయాల ఉద్యోగులపై పెద్దలు కన్నేశారు. వారిలోని వైసీపీ అనుకూలుర కోసం వెతుకులాట ప్రారంభించారు.

(అమరావతి- ఆంధ్రజ్యోతి)

ఎన్నికల్లో విజయం సాధించడానికి జగన్‌ సర్కారు అడ్డదారులు తొక్కుతోంది. ఫాం-7ను అడ్డుపెట్టుకుని నిజమైన ఓటర్ల తొలగింపునకు ఇప్పటికే అరాచకాలకు పాల్పడింది. ఆ వ్యవహారం బట్టబయలవ్వడంతో ఇప్పుడు మరో ఎత్తుగడకు వైసీపీ పెద్దలు తెరతీశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ఇప్పుడు వారి కన్ను పడింది. ‘వెతకండి.. వెతకండి.. సచివాలయ ఉద్యోగుల్లో మనవాళ్లను పట్టండి..’ అంటూ తమకు అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘ నేతలను పురమాయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లో జగన్‌ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో వారికి ఈ వెతుకులాట తప్పడం లేదనే వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల్లోనే వినిపిస్తోంది. ప్రభుత్వంలో కీ రోల్‌ పోషిస్తున్న ఒక సలహాదారు సమక్షంలో తాడేపల్లి కార్యాలయంలో కొందరు సచివాలయ ఉద్యోగులతో సమావేశం జరిగినట్లు తెలిసింది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొందరు ఉద్యోగ నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టు సమాచారం. వీరంతా వైసీపీ అనుకూలురుగా ముద్రపడినవారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఉద్యోగులను గుర్తించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఒక్కో సచివాలయం నుంచి అలాంటి ఒక్కో ఉద్యోగి పేరు సూచించాలని కోరినట్లు తెలిసింది. అటువంటి వారికి రానున్న ఎన్నికల్లో పలు బాధ్యతలు అప్పజెప్పి ఓటర్లను తమకు అనుకూలంగా మార్చే ప్రక్రియను వారికి పురమాయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. వారికి ఉద్యోగ పరమైన తాయిలాలు ఇస్తామని ఆశచూపినట్లు చర్చ జరుగుతోంది. అదే విధంగా ఇతర శాఖల్లో కూడా ఇదే విధంగా గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిసింది.

జగన్‌ సర్కార్‌పై మంట ఉందనే...

గత ఎన్నికలకు ముందు ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో ఎక్కువ మంది జగన్‌ మాయ మాటలతో వైసీపీ వైపు మొగ్గు చూపారు. సీపీఎస్‌ రద్దు చేస్తామనే హామీతో సీపీఎస్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌...ఇలా ఉద్యోగ వర్గాలన్నీ మూడొంతులు జగన్‌కు జై కొట్టాయి. అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు గడిచిపోయినా ఎన్నికల ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల జగన్‌ సర్కార్‌ వ్యవహరించిన తీరుకు చాలా తేడా కనిపించింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఉద్యోగులను ఇబ్బందిపెట్టనంతగా జగన్‌ సర్కార్‌ నరకం చూపిస్తోంది. జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కల్పించింది. దీంతో ఉద్యోగులు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు. ఇది గమనించిన అధికార వైసీపీ ఉద్యోగుల్లో తమ వారెవరో గుర్తించే పనిలోపడింది.

అప్రమత్తమైన టీడీపీ...

ఇప్పటికే అధికార పార్టీ ఫాం-7 అరాచకాలను అడ్డుకుంటున్న టీడీపీ నేతలు, ఇప్పుడు వైసీపీ పన్నుతున్న ఇతర పన్నాగాలపైనా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎన్నికల విధులకు టీచర్లను దూరం చేయాలనే ఎత్తుగడలు, ఉద్యోగులను ఎన్నికల్లో పావులుగా వాడుకుని గెలవాలనే ఎత్తుగడలను టీడీపీ ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో గందరగోళానికి తమకు అనుకూలురున ప్రభుత్వ యంత్రాంగాన్ని నయానోభయానో వినియోగించుకున్న జగన్‌ సర్కార్‌, ఇప్పుడు తాజాగా ఉద్యోగులపై దృష్టిసారించడంపై టీడీపీ అప్రమత్తమైంది.

Updated Date - 2023-11-29T03:58:08+05:30 IST