Lokesh Yuvagalam: చరిత్రాత్మక పాదయాత్రకు లోకేశ్‌ తొలి అడుగు

ABN , First Publish Date - 2023-01-28T02:58:51+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ‘యువగళం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

Lokesh Yuvagalam: చరిత్రాత్మక పాదయాత్రకు లోకేశ్‌ తొలి అడుగు

కుప్పంలో ఉ. 11.03 గంటలకు శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన తెలుగుతమ్ముళ్లు

తొలి రోజు 8.5 కి.మీ. నడక

చిత్తూరు, జనవరి 27(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ‘యువగళం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. భారీగా తరలి వచ్చిన టీడీపీ కార్యకర్తల ఆనందోత్సాహాల నడు మ.. ఇక్కడి లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. సరిగ్గా 11:03 గంటలకు ఆలయం నుంచి తొలి అడుగు వేసి చరిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించారు. లోకేశ్‌ తొలి అడుగు వేయగానే కార్యకర్తలు ఆయనపైౖ పూలవర్షం కురిపించారు. జైలోకేశ్‌, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మామ బాలకృష్ణ, పొలిట్‌బ్యూరో సభ్యులు, వేల మంది కార్యకర్తలు వెంట నడువగా పాదయాత్ర ప్రారంభమైంది. దారి పొడవునా మహిళలు హారతులిస్తూ ఘనస్వాగతం పలికారు. యువగళానికి సంఘీభావంగా రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో కుప్పం వీధులన్నీ కిటకిటలడాయి. పాదయాత్రకు అనుమతులు ఇచ్చినప్పుడే ప్రైవేటు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో టీడీపీ నాయకులు తొలి రోజు 500 మంది పార్టీ వలంటీర్లను, 200 మంది బౌన్సర్లను నియమించుకున్నారు. 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసినా.. ఎక్కడా వారి ప్రమేయం కనిపించలేదు. వారి అవసరం లేకుండానే పార్టీ వలంటీర్లు బందోబస్తు నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరించారు.

WhatsApp-Image-2023-01-27-a.jpg

చివరి వరకూ ఉన్న మహిళలు

షెడ్యూల్‌ మేరకు తొలిరోజు పాదయాత్ర సాఫీగా సాగింది. స్థానికులు, ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచీ టీడీపీ కార్యకర్తలు అధికంగా రావడంతో బహిరంగ సభ ప్రాంగణం మధ్యాహ్నం 2 గంటలకే నిండిపోయింది. లోకేశ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు వేదిక వద్దకు వచ్చారు. అరగంటకుపైగా సాగిన ఆయన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది.

3WhatsApp-Image-2023-01-27-.jpg

ఉత్తరాంధ్రలోని 12 నదీ జలాలు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేత అప్పలనాయుడు ఉత్తరాంధ్ర నదీ జలాలను తీసుకొచ్చి లోకేశ్‌ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్రలో ఉన్న 12 నదీజలాలను తీసుకొచ్చి లోకేశ్‌కు ఇస్తున్నాను. 40 మంది దేవతల దర్శనాలు చేసి, మసీదు, చర్చిల్లో ప్రార్థనలు చేసిన జలాలను తీసుకొచ్చాను. అలాగే ఉత్తరాంధ్రలోని మూడు ప్రాంతాల్లో మట్టిని కూడా తీసుకొచ్చి.. లోకేశ్‌కు విజయతిలకం దిద్దుతున్నా’ అని వెల్లడించారు.

ఇద్దరికీ అదే సెంటిమెంటు..

టీడీపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పాదయాత్ర ఇది. దీనిని లోకేశ్‌ తన తండ్రికి ఎంతో సెంటిమెంటు అయిన ప్రాంతం నుంచి ప్రారంభించారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలు, ర్యాలీలను లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజలు చేసే ప్రారంభించారు. ఆయన ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేసే సమయంలోనూ ఇదే గుడిలో పూజలు జరిపిస్తారు. లోకేశ్‌ కూడా పాదయాత్రను ఇదే గుడిలో పూజలు చేసి ప్రారంభించారు.

1.jpg

తొలిరోజు డైరీ..

శుక్రవారం ఉదయం 10 గంటలకు కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి లోకేశ్‌ వాహనంలో బయల్దేరి లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశాక 11.03 గంటలకు పాదయాత్ర ప్రారంభమైంది. లక్ష్మీపురంలోని మసీదు వరకు వచ్చి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇమామ్‌ల ఆశీస్సులు తీసుకుని.. 11.45 గంటలకు బయల్దేరి హెబ్రోన్‌ చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 12.20 గంటలకు చర్చిలో ప్రార్థనలు ముగించుకుని కుప్పం బస్టాండు ప్రాంతానికి చేరుకున్నారు. దారంతా గజమాలలతో, మంగళహారతులతో స్వాగతం పలికారు. ఒంటి గంటకు అక్కడ అంబేడ్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి 1.15 గంటలకు బయల్దేరి జూనియర్‌ కాలేజీ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేశారు. రైల్వే గేటు వద్ద స్థానికులు ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు.

1.40 గంటలకు టీడీపీ కార్యాలయ ఆవరణంలోని క్యారవాన్‌లో భోజనం చేశారు. 3.21 గంటలకు క్యారవాన్‌ నుంచి బయల్దేరి 3.46కు బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. 4.11 గంటలకు ప్రసంగం మొదలుపెట్టి.. 4.57కు ముగించారు. 5.19కు బహిరంగ సభ వద్ద నుంచి బయల్దేరి పాదయాత్రగా 6.20 గంటలకు చిన్నశెట్టిపల్లె, 6.57కి శెట్టిపల్లె, 7.10కి పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ ప్రాంతానికి చేరుకోవడంతో ఆయన తొలిరోజు పాదయాత్ర ముగిసింది. మొదటి రోజు 8.5 కిలోమీటర్లు నడిచారు. రెండో రోజు శనివారం శాంతిపురం మండలంలో 9.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది.

Updated Date - 2023-01-28T02:58:52+05:30 IST