Share News

ఐఆర్‌ఆర్‌ కేసులో దర్యాప్తు అధికారులను లోకేశ్‌ బెదిరించారు!

ABN , Publish Date - Dec 23 , 2023 | 04:15 AM

రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ (ఐఆర్‌ఆర్‌) ఎలైన్‌మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని సీఐడీ పెట్టిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన, దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించారు.

ఐఆర్‌ఆర్‌ కేసులో దర్యాప్తు అధికారులను లోకేశ్‌ బెదిరించారు!

చంద్రబాబు కూడా కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారు

హైకోర్టులో సీఐడీ మెమో.. బాబు తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం

కేసుకు సంబంధం లేని విషయాలను కోర్టు ముందు ఉంచారని వెల్లడి

అభ్యంతరాలను రాతపూర్వకంగా సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశం

విచారణ నేటికి వాయిదా

లోకేశ్‌ అరెస్టుకు అనుమతివ్వాలంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌

అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ (ఐఆర్‌ఆర్‌) ఎలైన్‌మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని సీఐడీ పెట్టిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన, దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించారు. వీటితో పాటు సీఐడీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ (ఏ-14)పై ఆరోపణలు చేసింది. ఆయన దర్యాప్తు అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారని, సంబంధిత పత్రికా కథనాలను జత చేస్తూ వేర్వేరుగా రెండు మెమోలు దాఖలు చేశామని సీఐడీ తరఫు ప్రత్యేక పీపీ దుష్యంత్‌రెడ్డి కోర్టుకు వివరించారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది ఎస్‌.ప్రణతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్‌ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు ముగిశాయని.. కేవలం రాతపూర్వక వాదనలు సమర్పించేందుకు శుక్రవారానికి వాయిదా వేశామని కోర్టు ప్రకటించిందని, వాటిని దాఖలు చేసిన అనంతరం తీర్పును రిజర్వ్‌ చేస్తామని తెలిపిందని గుర్తుచేశారు. కేసుకు సంబంధం లేని వివరాలను సీఐడీ కోర్టు ముందు ఉంచిందని.. దాని ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆ మెమోపై తమకు అభ్యంతరం ఉందన్నారు. అభ్యంతరాలను శనివారం లిఖితపూర్వకంగా సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఆదేశించారు. అవి సమర్పించాక ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలిచ్చారు.

రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ డిజైనింగ్‌, ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత సోమవారం వాదనలు ముగియడంతో రాతపూర్వక వాదనలు సమర్పించేందుకు విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. వాదనలు సమర్పించిన అనంతరం తీర్పును రిజర్వ్‌ చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఐడీ ఓ మెమో దాఖలు చేసింది. ‘ఐఆర్‌ఆర్‌ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు కుమారుడు లోకేశ్‌(ఏ-14) ఈ నెల 19న టీవీ చానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేసులో సీఆర్‌పీసీ సెక్షన్‌ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను అందులో బెదిరించారు. దర్యాప్తుతో సంబంధం ఉన్న అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో నమోదు చేశామని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగం నుంచి తొలగిస్తామని, లేదా జైలుకు పంపిస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలు.. కేసులో కీలక సాక్షులను, దర్యాప్తు అధికారులను బెదిరించడంతో పాటు వారిని ప్రభావితం చేసేలా ఉన్నాయి. ఇందుకు సంబంధించి పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాలను జత చేశాం. చంద్రబాబు కూడా మరో కేసులో హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించి కేసు గురించి మాట్లాడారు’ అని అందులో పేర్కొంది.

లోకేశ్‌ అరెస్టుకు అనుమతివ్వండి: సీఐడీ

విజయవాడ, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఐఆర్‌ఆర్‌ కేసులో నిందితుడి(ఏ-14)గా ఉన్న టీడీపీ నేత లోకేశ్‌.. నిబంధనలను ఉల్లఘించి వ్యవహరిస్తున్నారని ఆయన అరెస్టుకు అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు శుక్రవారమిక్కడి ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో గతంలో ఆయనకు సీఐడీ 41ఏ నోటీసులు ఇచ్చింది. షరతులకు లోబడి వ్యవహరించాలని హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. వీటికి విరుద్ధంగా యువగళం పాదయాత్ర ముగింపు సభలో ఆయన వ్యాఖ్యలు చేశారని.. దీనిని పరిగణనలోకి తీసుకుని ఆయన అరెస్టుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును కోరారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారుల పేర్లు రెడ్‌ బుక్‌లో రాసుకున్నానని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి తేలుస్తామని పదే పదే లోకేశ్‌ వ్యాఖ్యలు చేస్తూ అధికారులను బెదిరిస్తున్నారని తెలిపారు. ఆ వ్యాఖ్యలపై వివిధ పత్రికల్లో వచ్చిన క్లిప్పింగులను అందజేశారు. తదుపరి విచారణను కోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది.

Updated Date - Dec 23 , 2023 | 04:15 AM