ఉద్యమం సంగతి తేల్చుదాం..
ABN , First Publish Date - 2023-05-23T04:05:29+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర సర్కారు వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ ఆందోళనలే శరణ్యమని, ఐక్య ఉద్యమాలు అవసరమని బలంగా భావిస్తున్న ఏపీజేఏసీ సభ్య సంఘాలు..
● ఏపీజేఏసీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయండి
● బండి శ్రీనివాసరావుకు జేఏసీ సభ్య సంఘాల లేఖాస్త్రం
విజయవాడ, మే 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర సర్కారు వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ ఆందోళనలే శరణ్యమని, ఐక్య ఉద్యమాలు అవసరమని బలంగా భావిస్తున్న ఏపీజేఏసీ సభ్య సంఘాలు.. ఏపీఎన్‌జీఓ సంఘ అగ్రనేతలపై ఒత్తిళ్లు ప్రారంభించాయి. తక్షణమే ఏపీజేఏసీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఏపీజేఏసీకి అధ్యక్షుడు బండి శ్రీనివాసరావుకు సభ్య సంఘాలు లేఖ రాశాయి. దీనిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుని తక్షణం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చే శాయి. సభ్య సంఘాల నుంచి లేఖ రావడంతో ఏపీఎన్‌జీఓ అగ్రనాయకత్వం తర్జన భర్జన పడుతోంది. వాస్తవానికి ఏపీఎన్‌జీఓ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించిన రెండు రోజులకే ఏపీజేఏసీ సర్వసభ్య సమావేశాన్ని కూడా నిర్వహించాలి. ఏపీఎన్‌జీఓ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో జిల్లా నేతల నుంచి ఉద్యమం చేయాలని మెజారిటీ అభిప్రాయం రాలేదన్న సాకుతో.. ఉద్యమం వైపు వెళ్లకూడదన్న ఆలోచనలను ఏపీఎన్‌జీఓ సం ఘ నేతలు చేయడం ఏపీజేఏసీ సభ్య సంఘాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ క్రమంలో ఉద్యమం చేయకుంటే.. బయటకుపోతామన్న సంకేతాలు కూడా పలు సంఘాలు పంపుతున్నాయి. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో ఏపీజేఏసీ సెక్రటరీ జనరల్ బీ హృదయరాజు స్పందించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ఐక్య ఉద్యమాల అవసరం ఎంతో ఉందని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి రాసిన లేఖ లో పేర్కొన్నారు. జేఏసీ వెలుపల ఉన్న సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని, ఈ దశలో మీడియా సంయమనం వహించాలని విజ్ఞప్తి చేశా రు. హృదయరాజు వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఏపీజేఏసీకి ఉద్యమం విషయంలో ఏకాభిప్రాయం ఉందని, జేఏసీకి వెలుపల ఉన్న సంఘాలలోనే లేదన్నది తెలుస్తోంది. కాగా, ఉద్యమానికి దూరంగా ఉండాలన్న ఏపీఎన్‌జీఓ ఆలోచనలను పసిగట్టిన ఏపీజేఏసీ సభ్య సంఘాలు మాత్రం తక్షణం సమావేశం నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. దీంతో సమావేశం నిర్వహించక తప్పని పరిస్థితి ఏపీఎన్‌జీఓ సంఘానికి ఏర్పడుతోంది.