Share News

కుటుంబ సభ్యుల్లా ముందుకు సాగుదాం

ABN , First Publish Date - 2023-10-30T02:45:24+05:30 IST

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు పొత్తుతో పోటీ చేసేందుకు, కుటుంబ సభ్యుల్లా ముందుకు సాగుదామని టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశాల్లో నేతలు శపథం చేశారు.

కుటుంబ సభ్యుల్లా ముందుకు సాగుదాం

టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో నేతల శపథం

ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో భేటీలు

విజయనగరం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు పొత్తుతో పోటీ చేసేందుకు, కుటుంబ సభ్యుల్లా ముందుకు సాగుదామని టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశాల్లో నేతలు శపథం చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు పార్టీల సమన్వయ సమావేశాన్ని ఆదివారం విజయనగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఇరు పార్టీల నుంచి కీలక నేతలు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కలిసికట్టుగా పనిచేద్దామని నిర్ణయించారు. కుటుంబ సభ్యుల్లా పొరపొచ్చాలు, గ్రూపులు, అభిప్రాయబేధాలకు తావులేకుండా ఎన్నికలను ఎదుర్కొందామని తీర్మానించారు. టీడీపీ నుంచి ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న, పొలిట్‌ బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మాజీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌, టీడీపీ ఇన్‌చార్జిలు కర్రోతు బంగార్రాజు, గుమ్మిడి సంధ్యారాణి, కేఏ నాయుడు, బేబీనాయన, కోళ్ల లలితకుమారి, కురుపాం నుంచి తోయిక జగదీశ్వరి, బోనెల రవిచంద్ర(పార్వతీపురం), మాజీ ఎమ్మెల్యేలు భంజ్‌దేవ్‌, బొబ్బిలి చిరంజీవులు, తెంటు లక్షుంనాయుడు తదితరులు, జనసేన నుంచి పడాల అరుణ, లోకం మాధవి తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం టీడీపీ నాయకుడు బుద్దా వెంకన్న, జనసేన ప్రతినిధి కోన తాతారావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పార్టీల ఆదేశాల మేరకు ఇరు పార్టీలు కలిసి కార్యాచరణను రూపొందిస్తున్నాయన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ అరెస్టులు, అణచివేతలు, అభివృద్ధిని గాలికి వదిలేయటం, యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేయటం తదితరాలను ప్రధాన అస్త్రాలుగా ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. ఇరుపార్టీ నాయకుల సమష్టి ఆలోచనలు, సలహాలు, సూచనలతో భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోనూ ఇరుపార్టీల సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించారు.

Updated Date - 2023-10-30T02:45:24+05:30 IST