పదండి పోదాం!
ABN , Publish Date - Dec 26 , 2023 | 02:48 AM
అధికార వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తలుపులు తడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కవని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముఖంమీదే చెప్పేస్తుండడంతో..
టీడీపీ తలుపు తడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు
జగన్ మొండిచేయితో పక్కచూపులు
టీడీపీతో 20 మంది సంప్రదింపులు?
బాబును కలిసే రూట్ కోసం ఇంకొందరి
అన్వేషణ.. సీటు మారేందుకూ రెడీ!
ఆచితూచి వ్యవహరిస్తున్న ప్రతిపక్షం
ప్రజాబలం ఉన్నవారైతే ఓకే
పార్టీకి ఉపయోగపడేవారికే చాన్సు?
టికెట్ ఇవ్వలేకపోతే ఇతరత్రా అవకాశాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అధికార వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తలుపులు తడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టికెట్లు దక్కవని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ముఖంమీదే చెప్పేస్తుండడంతో.. కలవరపాటుకు గురవుతున్న పాలకపక్ష శాసనసభ్యుల్లో అభద్రతాభావం పెరిగి పక్క చూపులు చూస్తున్నారు.
ఈ అంశం ఈ రెండు పార్టీల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే టీడీపీ నాయకత్వం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రజా బలం ఉండి తమకు ఉపయోగపడతారనుకుంటేనే చేర్చుకోవడానికి సానుకూలత వ్యక్తం చేస్తోందని ప్రచారం జరుగుతోంది. వైసీపీలో దరిదాపుగా 92 మంది సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చబోతున్నారని గత కొద్దిరోజులుగా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వ్యాపించింది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు.. విడదల రజని, మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేశ్‌ను, మాజీ మంత్రి మేకతోటి సుచరితను వేరే నియోజకవర్గాలకు బదిలీ చేయగా.. ఇంకొంత మందిని వేరే సీట్లకు మారుస్తారని.. మరి కొంతమందికి పూర్తిగా మొండిచేయేనని అంటున్నారు. దీంతో పలువురు ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్‌పై తర్జనభర్జనల్లో మునిగి తేలుతున్నారు. కొందరు ముందుగానే మేలుకుని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో అవకాశాలు వెతుక్కునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈసారి ఎన్నికల్లో అధికారం చేతులు మారే అవకాశం కనిపించడం కూడా వారిలో ఈ ఆలోచనకు బీజం వేసినట్లు కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తమకు సానుకూల నిర్ణయం తీసుకునేలా చేసే వారి కోసం కొందరు అన్వేషిస్తుంటే.. మరికొందరు ఇప్పటికే తమకు తెలిసిన మార్గాల ద్వారా తలుపు తట్టారు. 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ప్రయత్నాల్లో ఉన్నట్లు వినిపిస్తోంది.
ఆ రెంటిలో ఏదైనా..!
దక్షిణ కోస్తాలో మరో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే సీటు మారడానికి కూడా సిద్ధమంటూ టీడీపీ నాయకత్వానికి సంకేతాలు పంపుతున్నారు. రెండు నియోజకవర్గాలను సూచించి.. అందులో ఎక్కడ బరిలో దిగేందుకైనా రెడీ అని చెబుతున్నారు. దీనిపై టీడీపీ నాయకత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఎన్టీఆర్, కోనసీమ జిల్లాలకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు మంచి మిత్రులు. వారిద్దరికీ టికెట్లు రావన్న అనుమానం ఏర్పడింది. ఈ ఇద్దరూ ఒక మధ్యవర్తిని కలిసి తమ గురించి చంద్రబాబుతో మాట్లాడాలని కోరారు. ఏ నియోజకవర్గం అన్నది ముఖ్యం కాదని.. టీడీపీలో ఎక్కడ అవకాశం ఇచ్చినా రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. తమతో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టచ్‌లో ఉన్నారని.. అవకాశం ఇస్తే వారినీ తీసుకొస్తామని చెప్పినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పేరుమోసిన ఒక సంస్థ అధినేత రాయలసీమలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు స్థానికంగా ప్రచారంలోకి వచ్చింది. దీంతో అక్కడ రెండు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులు కంగారు పడ్డారు. నిజానిజాలు తెలుసుకోవడానికి ఇటీవల రెండ్రోజులు హైదరాబాద్‌లో మకాం పెట్టారు. గత కొద్ది రోజులుగా చంద్రబాబును కలిసిన వారిలో ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. వారిద్దరికీ ఇబ్బందేమీ లేదని పార్టీ నాయకులు భరోసా ఇవ్వడంతో వెనుదిరిగారు.
దక్షిణ కోస్తాలో ఒక సీనియర్ ఎమ్మెల్యే ఇప్పటికే టీడీపీ నాయకత్వానికి తన ఆసక్తి తెలియజేశారు. అయితే ఇప్పుడున్న సీట్లో ఆయనకు ఇవ్వలేమని.. తమకు మంచి అభ్యర్థి లేని మరో నియోజకవర్గానికి పంపిస్తామని టీడీపీ నాయకత్వం ప్రత్యుత్తరం పంపింది. అక్కడైనా ఆయన గెలుస్తారని సూచించింది. కానీ ఆ ఎమ్మెల్యే ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ టికెట్ సాధించడంపైనే దృష్టి పెట్టారు. తన మాదిరిగానే అసంతృప్తిగా ఉన్న మరో ఇద్దరు సీనియర్లను కలుపుకొనే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఒక జట్టుగా ఏర్పడి బేరమాడితే టీడీపీలో అనుకున్న సీటు సాధించవచ్చనే ఆశలో ఆయన ఉన్నారని అంటున్నారు.
సొంత ఎమ్మెల్యేలపై నిఘా!
తమ పార్టీ ఎమ్మెల్యేల ప్రయత్నాలపై వైసీపీ నాయకత్వం కూడా అప్రమత్తమైంది. వారితోపాటు వారి అనుచరుల ఫోన్లపైనా నిఘా పెట్టిందని అంటున్నారు. కొందరు ఎమ్మెల్యేల పేర్లు నిఘా విభాగానికి పంపి వారి కదలికలపై కన్నేసి ఉంచాలని సూచించినట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముగ్గు రు అధికార పార్టీ ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట), పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ (ప్రత్తిపాడు), పెండెం దొరబాబు (పిఠాపురం).. టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నిఘా విభాగం అధికారులు పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల ప్రయత్నాలపై టీడీపీ అధినాయకత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. వస్తామంటున్న ప్రతి వారినీ కాకుండా తమకు రాజకీయంగా ఉపయోగపడతారని అనుకుంటున్న వారిని మాత్రమే తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. టికెట్లు ఇవ్వలేకపోయినా కొందరికి ఇతరత్రా అవకాశాలు ఇస్తామని, ఆ కోణంలో కూడా ఆలోచన చేస్తున్నామని ఆయన తెలిపారు.