పిట్ట కొంచెం.. జ్ఞాపకశక్తి ఘనం!
ABN , First Publish Date - 2023-06-14T03:30:56+05:30 IST
పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు... ఆ చిన్నారి ఆరు నెలల వయసులోనే వండర్ కిడ్‌గా గుర్తింపు పొందింది. అనకాపల్లికి చెందిన ఆరు నెలల చిన్నారి తన అపారమైన జ్ఞాపకశక్తితో వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.
అనకాపల్లి చిన్నారి అద్భుత ప్రతిభ
ఆరు నెలలకే కూరగాయలు, జంతువుల గుర్తింపు
వరల్డ్ వైడ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదు
బంగారు పతకంతోపాటు ప్రశంసాపత్రం కైవసం
అనకాపల్లి రూరల్, జూన్ 13: పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు... ఆ చిన్నారి ఆరు నెలల వయసులోనే వండర్ కిడ్‌గా గుర్తింపు పొందింది. అనకాపల్లికి చెందిన ఆరు నెలల చిన్నారి తన అపారమైన జ్ఞాపకశక్తితో వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. అనకాపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన మంత్రి వెంకటనారాయణమూర్తి, తేజస్విని దంపతుల కుమార్తె లాస్విక ఆర్యకు ప్రస్తుతం తొమ్మిది నెలల వయసు. ఈ చిన్నారికి ఆరు నెలల వయసున్నప్పుడు తల్లి తేజస్విని పలురకాల కూరగాయలు, జంతువులు బొమ్మలను చూపించి వాటిని గుర్తించడంలో శిక్షణ ఇచ్చారు.
మూడు నిమిషాల 36 సెకన్లలో 11 కూరగాయల బొమ్మలను గుర్తించిన వీడియోను చిత్రీకరించి గత మార్చిలో వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపించారు. జంతువుల బొమ్మలను గుర్తించిన మరో వీడియోను తీసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపించారు. పరిశీలించిన నిర్వాహకులు... చిన్నారి లాస్విక ప్రతిభను గుర్తించి సోమ, మంగళవారాల్లో బంగారు పతకం, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ మేరకు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల్లో వీడియోలను పోస్టు చేశారు.