Share News

విద్యుత్‌ సంస్థల్లో ఇంజనీర్ల కొరత

ABN , First Publish Date - 2023-11-29T04:23:32+05:30 IST

రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ, ఉత్పత్తి సంస్థలను సిబ్బంది కొరత వేంటాడుతోంది.

విద్యుత్‌ సంస్థల్లో ఇంజనీర్ల కొరత

జగన్‌ హయాంలో నోటిఫికేషన్లు నిల్‌

1200 ఏఈఈ పోస్టులు ఖాళీలు

మిగిలిన వారిపైనే పనిభారం

ఖర్చులు తగ్గించుకోవాలనే ఎత్తుగడ

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ, ఉత్పత్తి సంస్థలను సిబ్బంది కొరత వేంటాడుతోంది. విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో 1200 ఏఈఈ పోస్టులు ఖాళీగా ఉండగా, ఉత్పత్తి సంస్థల్లోనూ భారీగానే ఖాళీలున్నాయి. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు జగన్‌ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క నోటిఫికేషన్‌ కూడా జారీ చేయలేదు. దీంతో ఉన్న సిబ్బందిపైనే భారం పడుతోంది. 2019 ఎన్నికల ప్రచారంలో మాత్రం తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏటా జనవరి 1న ఠంచనుగా జాబ్‌ క్యాలెండరు వేస్తానని.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తానని ప్రతిపక్షనేతగా జగన్‌ హామీ ఇచ్చారు. కానీ, నాలుగున్నరేళ్లుగా ఈ హామీని నిలబెట్టుకోలేదు. ఫలితంగా ఇతర ప్రభుత్వ శాఖల తరహాలోనే.. విద్యుత్‌ పంపిణీ సంస్థలలోనూ ఖాళీలు భర్తీకి నోచుకోలేదు. ప్రభుత్వం తీరు ఇలా ఉంటే, మరోవైపు వినియోగదారుల నుంచి ప్రతి పైసా వసూలు చేయడంలో విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ.. సంస్థల్లో మౌలిక వసతుల మెరుగుదల, ఉద్యోగాల భర్తీ వంటి వాటిపై చూపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్‌ సంస్థల్లో 1200కు పైగా అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల(ఏఈఈ)ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక, విద్యుదుత్పత్తి కేంద్రాల్లోనూ ఇంజనీర్ల కొరత భారీగా ఉంది. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా సేవలు అందించేందుకు మానవ వనరులను ఏర్పాటు చేసుకోవాల్సిన ఇంధన సంస్థలు.. ఆ దిశగా దృష్టి సారించడంలేదని నిపుణులు అంటున్నారు. ఇంధన రంగంలో వ్యయాలను తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే సిబ్బంది నియామకాలపై అప్రకటిత నిషేధాన్ని విధిస్తున్నారని నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పంపిణీ సంస్థలు అవసరానికి మించి ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేయడం, ట్రాన్స్‌మిషన్‌ సంస్థలు కూడా నెట్‌వర్క్‌ను విస్తరించే పనిలో ఉండడం, ఖర్చులు పెరగడంతో ఆర్థిక భారం పెరిగింది. పెరుగుతున్న ఈ ఆర్థిక భారాన్ని సాకుగా చూపి సంస్థలలో నియామకాలు చేపట్టడం లేదని అంటున్నారు. ఏపీ జెన్కోలో 400 ఏఈఈ, డిస్కమ్‌లలో 420, విద్యుదుత్పత్తి సంస్థలలో 380 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆర్‌టీపీపీలో ఏఈఈల ఆందోళన

రాయలసీమ ధర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం(ఆర్‌టీపీపీ)లో పనికి తగిన మానవ వనరులను కల్పించాలని గత 20 రోజులుగా అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు(ఏఈఈ) ఆందోళన చేస్తున్నారు. ఆర్‌టీపీపీలో విద్యుత్‌ విక్రయాల ద్వారా ఫిక్స్‌డ్‌ ఛార్జీల కింద ఏటా రూ.1459.54 కోట్ల ఆదాయం వస్తోంది. ప్లాంట్‌ లోడ్‌ రిలీఫ్‌ దాదాపు 90ు వరకు ఉంటోందని ఇంజనీరింగ్‌ సిబ్బంది చెబుతున్నారు. ఈ ఉత్పత్తికి తగ్గట్టుగా సిబ్బంది నియామకం జరగడం లేదని ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా.. ఖర్చులు తగ్గింపు పేరిట సిబ్బందిని కుదించేస్తున్నారని ఇంజనీరరింగ్‌ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌టీపీపీలో ఖాళీలను భర్తీ చేయడం ద్వారా పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ఉద్యోగుల డిమాండ్లను యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి.

Updated Date - 2023-11-29T04:23:33+05:30 IST