Shortage of engineers : మార్కెటింగ్‌శాఖలో ఇంజనీర్ల కొరత

ABN , First Publish Date - 2023-08-26T03:07:15+05:30 IST

మార్కెటింగ్‌శాఖలోని ఇంజనీరింగ్‌ విభాగం నామ్‌కే వాస్తేలా మారింది. మార్కెటింగ్‌ సెస్‌ ద్వారా ఏటా రూ.600 కోట్ల దాకా ఆదాయం పొందే ఈ శాఖలో ఇంజనీరింగ్‌ విభాగం పటిష్ఠతపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అనేక నిర్మాణ పనులను అప్పగించి, సకాలంలో పూర్తి చేయాలని లక్ష్యాలు విధిస్తోంది. రెండు దశాబ్దాలుగా అనేక పోస్టులు ఖాళీగా ..

Shortage of engineers : మార్కెటింగ్‌శాఖలో ఇంజనీర్ల కొరత

67 మంది ఏఈలకు 10 మందే ఉన్నారు

39 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లకు ఒక్కరూ లేరు

నిర్మాణ పనులకు కొరవడిన పర్యవేక్షణ

నత్తనడకన కొనసాగుతున్న పనులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మార్కెటింగ్‌శాఖలోని ఇంజనీరింగ్‌ విభాగం నామ్‌కే వాస్తేలా మారింది. మార్కెటింగ్‌ సెస్‌ ద్వారా ఏటా రూ.600 కోట్ల దాకా ఆదాయం పొందే ఈ శాఖలో ఇంజనీరింగ్‌ విభాగం పటిష్ఠతపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అనేక నిర్మాణ పనులను అప్పగించి, సకాలంలో పూర్తి చేయాలని లక్ష్యాలు విధిస్తోంది. రెండు దశాబ్దాలుగా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నా, ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా అరకొర సిబ్బందితో నెట్టుకొస్తోంది. ఇంజనీర్‌ ఉద్యోగ విమరణ చేస్తే.. తిరిగి ఆ పోస్టును భర్తీ చేయట్లేదు. దీంతో ఈ విభాగం ద్వారా వివిధశాఖల్లో చేపట్టే గోదాములు, భవనాలు, రోడ్లు, ఇతర నిర్మాణ పనులకు పర్యవేక్షణ కొరవడి సకాలంలో పనులు పూర్తి కావడం లేదు. మార్కెటింగ్‌శాఖ ఇంజనీరింగ్‌ విభాగానికి ఉమ్మడి రాష్ట్రంలో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ హెడ్‌గా వ్యవహరించేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఎస్‌ఈ పోస్టును ఏపీకి కేటాయించారు. అయితే, వైసీపీ ప్రభుత్వం ఎస్‌ఈకి గతేడాది చీఫ్‌ ఇంజనీర్‌గా పదోన్నతి కల్పించింది. అయితే, ప్రస్తుత ఎస్‌ఈకి మాత్రమే ఈ పదోన్నతి వర్తిస్తుందని, భవిష్యత్‌లో సీఈ పోస్టు ఉండదని పేర్కొంది. విభజన సమయంలో ఒక ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ను రాష్ట్రానికి కేటాయించారు. వాస్తవానికి రాష్ట్రంలో ఈఈ పోస్టు లేదు. దీంతో సదరు ఈఈ అనుబంధ విభాగంలో పని చేస్తున్నారు. ఇంజనీరింగ్‌ అధికారుల విజ్ఞాపన మేరకు వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఈఈ పోస్టును మంజూరు చేసింది. దీనికి ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ఈఈ పోస్టులో ఇంకా ఎవరినీ నియమించలేదు. ఈ పోస్టు కోసం ఇప్పటికే ఈఈ కేడర్‌లో ఉన్న అధికారితో పాటు, డీఈలుగా పని చేస్తూ, పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, డీఈలకు పదోన్నతులు రానందున తమకు అన్యాయం జరుగుతోందని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ విభాగంలో 22 మంది డీఈలు, 67 మంది ఏఈలు, 39 మంది వర్క్‌ ఇన్‌స్పెకర్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 18 మంది డీఈలు, 10 ఏఈలు మాత్రమే ఉన్నారు. వర్క్‌ ఇన్‌స్పెకర్లు ఒక్కరూ లేరు. దీంతో ఇంజనీరింగ్‌ విభాగం లక్ష్యాలు సాధించలేకపోతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్‌ అధికారులు ఉంటేనే పనులు సజావుగా సాగుతాయని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెటింగ్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌తో ఆర్బీకే స్థాయిలో గోదాముల నిర్మాణం, నాడు-నేడు పథకంలో మార్కెటింగ్‌ యార్డుల్లో గిడ్డంగులు, కార్యాలయాలు, రైతుబజార్లలో దుకాణ సముదాయాలు, పశువైద్యశాలలు, ఇతర నిర్మాణ పనులు అప్పగించారు. కానీ, తగిన సిబ్బంది లేక ఈ పనుల్లో జాప్యం జరుగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ సహాయకులను అగ్రిఇన్‌ఫ్రా ఫేజ్‌-2 పనుల్లో వినియోగించుకోవాలని ఉన్నతాధికారులు చెప్పినా, కాంట్రాక్టర్లు ముందుకు రాక ఫేజ్‌-2 పనులు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఇంజనీరింగ్‌ విభాగం చురుగ్గా పని చేయలేకపోతోంది.

Updated Date - 2023-08-26T03:07:15+05:30 IST