గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ

ABN , First Publish Date - 2023-08-11T02:41:32+05:30 IST

గవర్నర్‌ నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీలుగా వైసీపీకి చెందిన కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు నియమితులయ్యారు.

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ

ఈసీ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ.. ఫిబ్రవరిలోనే వీరి పేర్లు ప్రకటించిన సీఎం జగన్‌.. అప్పటికి ఖాళీలే లేవు

గత నెలలో రిటైరైన శివనాథరెడ్డి, ఫరూక్‌

వారి స్థానంలో నియామకం... ఫిబ్రవరి నుంచే ప్రొటోకాల్‌ అమలు

అమరావతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీలుగా వైసీపీకి చెందిన కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబు నియమితులయ్యారు. చదిపిరాళ్ల శివనాథరెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌ గతనెలలో పదవీవిరమణ చేయడంతో వీరిద్దరి పేర్లను జగన్‌ ప్రభుత్వం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు సిఫారసు చేసింది. ఆయన ఆమోదించడంతో పద్మశ్రీ, రవిబాబును ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వీరిద్దరూ అధికారికంగా గురువారం నియమితులు కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎమ్మెల్సీలుగా ప్రొటోకాల్‌ అందుకుంటుండడం విశేషం. వీరిద్దరినీ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ఫిబ్రవరి 20న సీఎం ప్రకటించారు. వారిద్దరూ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చి మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిశారు కూడా. కానీ అప్పటికి గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా లేవు. గవర్నర్‌కు సిఫారసులు వెళ్లలేదు. ఆమోదమూ తెలుపలేదు. గతనెల 20న శివనాథ్‌రెడ్డి, ఫరూక్‌ రిటైర్మెంట్‌తో ఖాళీ అయ్యాక.. రవిబాబు, పద్మశ్రీ పేర్లను రాజ్‌భవన్‌ ఆమోదానికి పంపారు. విజయనగరం జిల్లాకు చెందిన కుంభా రవిబాబు ప్రస్తుతం రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఆ హోదాలో ఆయనకు సహజంగానే ప్రొటోకాల్‌ వర్తిస్తుంది. అయితే జిల్లా యంత్రాంగం ఫిబ్రవరి నుంచే ఆయనకు ఎమ్మెల్సీ ప్రొటోకాల్‌ ఇస్తుండడం విశేషం. ఇక కాకినాడ జిల్లాకు చెందిన పద్మశ్రీకి కూడా అప్పటి నుంచే ప్రొటోకాల్‌ అమలవుతోంది. గవర్నర్‌ ఆమోదం, ఈసీ గెజిట్‌తో సంబంధం లేకుండా సీఎం ప్రకటననే జిల్లా యంత్రాంగం ప్రామాణికంగా తీసుకుంది. ఎమ్మెల్సీగా ఆమెను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానిస్తోంది. ముఖ్యమంత్రి ప్రకటననే అధికారిక ఉత్తర్వులుగా జిల్లా యంత్రాంగాలు పరిగణిస్తూ ప్రొటోకాల్‌ అమలు చేయడంపై ప్రభుత్వ, రాజకీయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2023-08-11T02:41:32+05:30 IST