KOḍi pandelu : కో అంటే కోట్లు!

ABN , First Publish Date - 2023-01-15T03:31:17+05:30 IST

తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి.

KOḍi pandelu : కో అంటే కోట్లు!

కత్తులు దూసిన కోళ్లు!

కట్టలు తెగిన కోట్లు..

రాష్ట్ర వ్యాప్తంగా బరులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. శనివారం భోగి పండుగ నుంచి మూడు రోజుల పాటు కోడి పందేలు, జూదాలు, పేకాట నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసీపీ నేతలు, వారి వారసుల కనుసన్నల్లో జోరుగా బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కృష్ణాలో కోడి పందేలతో పాటు పేకాట, కేసినో శిబిరాలు కూడా వెలిశాయి. తొలిరోజు శనివారం రూ.కోట్ల సొమ్ము పందేల్లో చేతులు మారినట్టు తెలిసింది. బాపులపాడు మండ లం అంపాపురంలో సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో వేసిన శిబిరాల్లో తొలిరోజు రూ.లక్షల్లో కోడి పందేలు సాగాయి. వాస్తవానికి ఇక్కడ కేసినో తరహా ఏర్పాట్లు చేశారు.

ఈ విషయం మీడియాలో రావడంతో నిర్వాహకులు హడావుడి తగ్గించి తొలి రోజు పేకాట, అందర్‌-బాహర్‌ ఆటలకే పరిమితమయ్యారు. గత ఏడాది గుడివాడ కేసినో అనుభవం దృష్ట్యా ఈసారి సుమారు 200 మంది బౌన్సర్లను రంగంలోకి దింపారు. మాజీ మంత్రి కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలోని కే కన్వెన్షన్‌లో భారీ ఎత్తున కోడి పందేలు, పేకాట నడుస్తున్నాయి. గంపలగూడెం మండలం వినగడప తండాలో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుల ఆధ్వర్యంలో కోడి పందేల బరులు ఏర్పాటు చేశారు. తిరువూరు నియోజకవర్గంలో కోడి పందేల బరి నుంచి రూ.20 లక్షలు డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. జగ్గయ్యపేటలో పార్టీలకతీతంగా కోడి పందేలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా సుమారు రూ.40 కోట్ల నుంచి 50 కోట్ల లావాదేవీలు నడిచాయని అంచనా.

హోంమంత్రి ఇలాకాలో

రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత ఇలాకాలో కోడి పందేలు జోరుగా సాగాయి. జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సీహెచ్‌.సుధీర్‌కుమార్‌రెడ్డి హెచ్చరించినా గుండాట, పేకాటలు యథేచ్ఛగా సాగాయి. శనివారం మధ్యాహ్నం వరకు వైసీపీ నేతలు, కార్యకర్తలు గుండాట ఆడుకోవడానికి అనుమతులు ఇవ్వవలసిందేనని పట్టుబట్టారు. నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు రోజులు చూసీ చూడనట్టు వదిలేయమని చెప్పడంతో మధ్యాహ్నం నుంచి గుండాట, పేకాట ప్రారంభమయ్యాయి. భీమవరం పట్టణ శివారులో హైటెక్‌ బరి ఏర్పాటు చేశారు. కోడిపందేల నిర్వహణపై ఉక్కుపాదం మోపుతామంటూ నెల రోజులుగా పోలీ్‌సశాఖ చేసిన హెచ్చరికలు.. వందల సంఖ్యలో కోడి కత్తుల స్వాధీనం.. వంటివన్నీ శనివారం ఉదయం 10 గంటలతో తేలిపోయాయి.

11 గంటలకు జిల్లాలో పెద్ద ఎత్తున పందేలు ప్రారంభమయ్యాయి. జిల్లా మొత్తం మీద 100కు పైగా బరుల్లో పందేలు సాగాయి. కైకలూరు, ఉండి నియోజకవర్గాల్లో కార్లు బహుమతిగా ప్రకటించారు. ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లోని బరులలో బుల్లెట్‌లు బహుమతులుగా ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్లలో అధికారపార్టీ నేత ల కనుసన్నల్లో పందేలు ముమ్మరంగా సాగాయి. రేప ల్లె, నిజాంపట్నం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో కోళ్లు కత్తులు దూశాయి. కృష్ణ, ప్రకాశం, గుంటూరులతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి కూడా పందెం రాయుళ్లు జిల్లాలో ఏర్పాటు చేసిన బరులకు వచ్చారు. శనివారం ఒక్కరోజే దాదాపు రూ.5 కోట్ల వర కు చేతులు మారిందని అంచనా. జిల్లాలో భారీఎత్తున బరులు ఏర్పాటు చేయడంలో వైసీపీ నేతలే కీలకంగా వ్యవహరించారు.

ఎస్సైపై ఎమ్మెల్యే ఫైర్‌

కోనసీమ జిల్లాలో ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి కోడి పందేలకు మాత్రమే అనుమతించి, గుండాట, రికార్డింగు డాన్సులు, పేకాటలపై ఉక్కుపాదం మోపారు. రావులపాలెంలో కోడి పందేల బరులను ఎస్‌ఐ సురేంద్ర అడ్డుకునేందుకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు స్థలంలో నీకు పనేంటి అంటూ బయటికి పంపారు.

స్విఫ్ట్‌ కారు ఆఫర్‌

ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఆలపాడులో వరుసగా ఐదు కోడి పందేల్లో పాల్గొని 3 పందేల్లో నెగ్గిన వారికి స్విఫ్ట్‌ కారును బహుమతిగా ప్రకటించారు. మొదటి 2 పందేలు లక్ష చొప్పున, చివరి 3 పందేలు 2 లక్షలు చొప్పున మొత్తం మీద 10 లక్షలతో ప్యాకేజీ ఏర్పాటు చేశారు. విఐపీలకు ప్రత్యేకంగా గ్యాల రీ ఏర్పాటు చేశారు. తొలిరోజే ఆలపాడు బరిలో దాదా పు రూ.60 లక్షల మేర కోడి పందేలు సాగాయి. కాకినాడ జిల్లాలో తొలిరోజే కోడికూత రూ.కోట్లు దాటింది. తాళ్లరేవు, కాకినాడ రూరల్‌, జగ్గంపేట, గండేపల్లి ప్రాంతాల్లో రాష్ట్రస్థాయి బరులు నిర్వహించారు.

అనకాపల్లి జిల్లాలో ఉక్కుపాదం

పలువురు అరెస్టు.. నగదు స్వాధీనం

అనకాపల్లి మండలం సుందరయ్యపేట గ్రామ శివారులోని యూకలిప్టస్‌ తోటల్లో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కోడి పందేలు నిర్వహించారు. ఒక్కో రౌండుకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు పందేలు కాశారు. అయితే.. విషయం తెలిసిన పోలీసులు పందేలపై ఉక్కుపాదం మోపారు. జిల్లాలోని చోడవరం మండలం జన్నవరం శివారు కొత్తూరులో కోడిపందేలు ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,860 నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఇదే మండలం లక్కవరం, దామునాపల్లి గ్రామాల్లో పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేసి రూ.8,070 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌.రాయవరం మండలం పెదఉప్పలంలో కోడి పందేల శిబిరంపై పోలీసులు దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. 4 పందెం కోళ్లను, రూ.7,580 నగదు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2023-01-15T03:32:48+05:30 IST