Share News

సుప్రీం తీర్పు దృష్టిలో ఉంచుకోండి

ABN , Publish Date - Dec 18 , 2023 | 02:59 AM

రాష్ట్రంలో ఓట్లు తొలగించాలంటూ వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే ముందు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకోవాలని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లకు, ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

సుప్రీం తీర్పు దృష్టిలో ఉంచుకోండి

ఓట్లను తొలగించే అధికారులకు సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ సూచన

ఇష్టమొచ్చినట్లు ఓట్లు తొలగిస్తే అధికారులే బాధ్యులు: నిమ్మగడ్డ రమేశ్‌

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓట్లు తొలగించాలంటూ వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే ముందు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకోవాలని సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లకు, ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు నిమ్మగడ్డ అన్నీ జిల్లాల కలెక్టర్లకు, ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులకు లేఖ రాశారు. అనూప్‌ బరన్‌ వాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ పేర్కొన్న విషయం గుర్తు చేశారు. ఓట్లను తొలగించే ముందు సంబంధిత అధికారులు తీర్పును అవగాహన చేసుకుని అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆ లేఖలో కోరారు. సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఓట్లు తొలగింపు కోసం వచ్చిన ఫారం-7 దరఖాస్తులను పరిశీలించేటప్పుడు ఓటరు ప్రాథమిక హక్కుకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లు, ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులపై ఉందని రమే్‌షకుమార్‌ గుర్తు చేశారు. సరైన ధృవీకరణ, పత్రాల పరిశీలన ద్వారా మాత్రమే ఓటర్ల తొలగింపు చేయాల్సి ఉంటుందని, అలా కాని పక్షంలో అందుకు ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులే బాధ్యులు అవుతారని, వారు న్యాయపరమైన వివాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. తాము రాసిన లేఖకు స్పందించి అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 18 , 2023 | 02:59 AM