లింగమనేని గెస్ట్‌హౌస్‌ జప్తుపై తీర్పు రేపు

ABN , First Publish Date - 2023-06-01T04:52:24+05:30 IST

ఉమ్మడి గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట వద్ద కృష్ణానదికి సమీపాన ఉన్న వ్యాపార వేత్త లింగమనేని రమేశ్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌, మాజీ మంత్రి పి. నారాయణ ఆస్తుల జప్తునకు సంబంధించిన వాదనలు విజయవాడలోని సీఐడీ కోర్టులో బుధవారం ముగిశాయి.

లింగమనేని గెస్ట్‌హౌస్‌ జప్తుపై తీర్పు రేపు

మాజీ మంత్రి నారాయణ కేసూ అదే రోజు

సీఐడీ కోర్టులో ముగిసిన వాదనలు

● మా వాదనలు వినలేదు: లింగమనేని

విజయవాడ, మే 31(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట వద్ద కృష్ణానదికి సమీపాన ఉన్న వ్యాపార వేత్త లింగమనేని రమేశ్‌కు చెందిన గెస్ట్‌హౌస్‌, మాజీ మంత్రి పి. నారాయణ ఆస్తుల జప్తునకు సంబంధించిన వాదనలు విజయవాడలోని సీఐడీ కోర్టులో బుధవారం ముగిశాయి. ఈ కేసులోపై తీర్పును న్యాయమూర్తి బిందుమాధవి శుక్రవారానికి వాయిదా వేశారు. ఈ గెస్ట్‌హౌస్‌లో ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్నారు. లింగమనేని రమేశ్‌ నిబంధనలను ఉల్లంఘించి ఈ గెస్ట్‌హౌస్‌ నిర్మించారని, మాజీ మంత్రి నారాయణ.. రాజధాని అమరావతిలో వస్తుందని ముందుగానే తెలుసుకుని భూములు కొనుగోలు చేసి వాటి ద్వారా రూ.1 కోటి 70 లక్షలను యాన్యుటీ పొందారని సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో గెస్ట్‌హౌస్‌తోపాటు నారాయణ, ఆయన బంధువుల ఆస్తులను జప్తు చేయాల్సి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఐడీ తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వివేకానంద వాదనలు వినిపించారు. 1944 ఆర్డినెన్స్‌ ప్రకారం ఆస్తుల జప్తునకు సంబంధించి నేరం జరిగిందా లేదా అన్నది కోర్టు నిర్ధారించాలన్నారు. ఆ తర్వాత మాత్రమే డిఫెన్స్‌ న్యాయవాది వాదనలను వినడానికి అవకాశం ఇవ్వాలన్నారు. నేరం జరిగినప్పుడు కచ్చితంగా జప్తునకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ప్రస్తుతం పిటిషన్‌లో డిఫెన్స్‌ న్యాయవాది వాదనలు వినాల్సి అవసరం లేదని తెలిపారు. సీఐడీ ఆర్టినెన్స్‌ ప్రకారమే పిటిషన్‌ దాఖలు చేసిందని, ఈ విషయంలో డిఫెన్స్‌ న్యాయవాదికి ఎలాంటి నోటీసులు, కాపీలను అందజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. లింగమనేని రమేశ్‌ తరపున న్యాయవాది సోము కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా తమకు వర్తిస్తుందన్నారు. జప్తునకు సంబంధించి న్యాయస్థానం ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చినా దానికి ముందు తమ వాదనలను వినాలని కోరారు. న్యాయస్థానం కొద్దిసేపు మాత్రమే కృష్ణమూర్తి వాదనలను వింది. ఈ పిటిషన్‌పై తీర్పు ఇవ్వడానికి ముందు తన వాదనలను వినాలని సోము కృష్ణమూర్తి పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. జప్తునకు సంబంధించిన కాపీలు, నోటీసులను తమకు అందజేయాలని, మే 17వ తేదీన పిటిషన్‌ దాఖలు చేశామని కోర్టుకు వివరించారు. ఆ కాపీలను ఇవ్వాలని కోర్టు ఆదేశించినా సీఐడీ అధికారులు ఇప్పటివరకు తమకు అందజేయలేదని చెప్పారు.

ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బిందుమాధవి సాయంత్రం ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. డిఫెన్స్‌ న్యాయవాది వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని చెప్పారు. అనంతరం బిందుమాధవి తన చాంబర్‌లోకి వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత బెంచ్‌ గుమస్తా వచ్చి తీర్పును శుక్రవారానికి(జూన్‌ 2) వాయిదా వేస్తున్నట్టు వెల్లడించి ‘ఫర్‌ కన్సిడరేషన్‌’ అని పేర్కొన్నారు. దీని ప్రకారం డిఫెన్స్‌ న్యాయవాది సోము కృష్ణమూర్తి వాదనలను వినే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-06-01T04:52:24+05:30 IST