ఐఏఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు జైలు

ABN , First Publish Date - 2023-07-11T05:43:22+05:30 IST

కోర్టుధిక్కరణ కేసులో పూర్వ విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌, ప్రస్తుత ఏపీఐఐసీ వీసీఎండీ, ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌కు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని

ఐఏఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు జైలు

కోర్టుధిక్కరణ కేసులో జరిమానా కూడా

తీర్పు అమలు నాలుగు వారాలు వాయిదా

అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): కోర్టుధిక్కరణ కేసులో పూర్వ విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌, ప్రస్తుత ఏపీఐఐసీ వీసీఎండీ, ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌కు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనకు రెండు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. తీర్పు అమలును నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు సోమవారం తీర్పు ఇచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లా, భీమునిపట్నం మండలం, కాపులుప్పాడ గ్రామం పరిధిలోని తమ ఏడు ఎకరాల భూమిని అధికారులు రిజిస్ట్రేషన్‌ నిషేధిత భూముల(22ఏ) జాబితాలో చేర్చారని, నిషేధిత జాబితా నుంచి వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంటూ ఎల్‌.శ్రీనివాసరావు, మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు... పిటిషనర్ల భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలని 2017 ఏప్రిల్‌లో ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలు అమలుకాకపోవడంతో పిటిషనర్లు 2017 సెప్టెంబరులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జి.సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు.

Updated Date - 2023-07-11T05:43:22+05:30 IST