Share News

Lokesh : జగన్‌ నటనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు!

ABN , First Publish Date - 2023-12-11T02:58:52+05:30 IST

: ‘‘ముఖ్యమంత్రి జగన్‌ది అద్భుత నటన. ఆయన నటనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రంలో మూడు నెలల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని, జగన్‌ను ప్రజలు బంగాళాఖాతంలో

Lokesh : జగన్‌ నటనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు!

70% ఉద్యోగాలు స్థానికులకే అన్నారు.. కానీ, ఇప్పుడా చట్టం ఏమైంది?

రాష్ట్రానికి కంపెనీలే రావడం లేదు.. ఉన్నవి కూడా బైబై అంటున్నాయి

3 నెలల్లో నిశ్శబ్ద విప్లవం.. ప్రజలు జగన్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తారు

కాకినాడ సెజ్‌ బాధిత రైతుల ముఖాముఖిలో లోకేశ్‌

కాకినాడ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి జగన్‌ది అద్భుత నటన. ఆయన నటనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్రంలో మూడు నెలల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని, జగన్‌ను ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా 218వ రోజైన ఆదివారం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని శృంగవృక్షంలో కాకినాడ సెజ్‌ బాధిత రైతులతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. పరిశ్రమల్లో 70శాతం ఉద్యోగాలు స్థానికులకే అని జగన్‌ ఉత్తర్వులిచ్చారని.. ఇప్పుడా చట్టం ఎక్కడుందని ప్రశ్నించారు. కంపెనీలు బై బై చెబుతుంటే ఇక చట్టం ఏముందని ఎద్దేవా చేశారు. ఇంకా ఏమన్నారంటే.. లోకేశ్‌ ఇంకా ఏమన్నారంటే..

జగన్‌ను తరిమికొట్టాలి...

సైకో జగన్‌ ఎన్నికల ముందు వీధికో హామీ ఇచ్చారు. కానీ అవేమీ గుర్తు లేనట్టు నటిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాకినాడ సెజ్‌లో బాధితులకు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. దివీస్‌ ఫార్మాను బంగాళాఖాతంలో కలపాలని చెప్పి తీరా మాటమార్చేశారు. అధికారంలోకొచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో 70శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని చట్టం తెచ్చారు. ఇప్పుడేమైంది ఆ చట్టం. అసలు కంపెనీలే లేవు. ఉన్నవి కూడా పోతున్నాయి. హేచరీలు, ఆక్వా పరిశ్రమలు సైతం పక్కనున్న ఒడిసాకు పారిపోతున్నాయి. అందరూ ఇలా వెళ్లిపోతే రాష్ట్రం ఏమవుతుందో ఆలోచించాలి. కాకినాడ సెజ్‌లో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.62వేల కోట్లతో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేశాం. ఇది ఏర్పాటైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి. కానీ జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఇదీ పారిపోయింది. టీడీపీ అధికారంలోకి రాగానే అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తాం. ఆక్వా, హేచరీ రంగాలకు మెరుగైన పాలసీ తీసుకువస్తాం. జోన్‌, నాన్‌జోన్‌తో సంబంధం లేకుండా యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే అందిస్తాం. గొర్రెల పెంపకం కోసం గతంలో ఇచ్చినట్లే సబ్సిడీలు ఇస్తాం.

సెజ్‌లో ఉద్యోగాలిస్తాం..

టీడీపీ వచ్చిన తర్వాత కాకినాడ సెజ్‌కు భారీ పరిశ్రమలు వచ్చేలా చర్యలు చేపడతాం. 2వేల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చేలా చర్యలు చేపడతాం. సెజ్‌కు భూములిచ్చినా పరిహారం దక్కని రైతులందరికీ పరిహారం వచ్చేలా చేస్తాం. సముద్రంలోకి లీటరు కాలుష్య జలం కూడా కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. సెజ్‌ భూములతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేయడం కుదరదు. కానీ మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ సెజ్‌లో 800 ఎకరాలను కొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. టీడీపీ రాగానే సెజ్‌ భూములు కొట్టేసిన మంత్రిపైనా, ఇతర వైసీపీ నేతలపైనా విచారణ చేయించి మొత్తం బయటకు లాగుతా. ఎన్నికల ముందు నియోజకవర్గంలో దివీస్‌ ఫార్మా రానివ్వనని దాడిశెట్టి హామీ ఇచ్చారు. భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ.75లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు. ఏమైంది ఆ హామీ.. ఆ డబ్బులేవి..? అందుకే దాడిశెట్టి రాజాకు మాయ రాజా అని పేరు పెడుతున్నాను. చంద్రబాబుపై అక్రమంగా స్కిల్‌ కేసు మోపి జైల్లో పెట్టారు. అసలు రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై నిశ్శబ్ధ విప్లవం రాబోతోంది. మూడు నెలల్లో ప్రజలు జగన్‌ను బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం.

దళితులకు రక్షణేదీ..

జగన్‌ అధికారంలోకి వచ్చాక దళితుల మాన ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. దళితులపై నేరాల్లో దక్షిణాదిలో ఏపీ నంబర్‌ వన్‌లో ఉంది. గతేడాదిలో దళితులపై 2,315 దాడులు, హత్యలు చోటుచేసుకున్నాయి. ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.28,147కోట్లు దారి మళ్లించి తీరని ద్రోహం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌ ప్రభుత్వం రద్దు చేసిన 27 సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం. కాగా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో తక్షణం బయటకు వచ్చి స్పందించాల్సిన సీఎం జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి బయటకు రావడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిసి జగన్‌ హడావుడిగా బయటకు వచ్చి తూతూమంత్రపు పరామర్శలు చేశారు. పంటల బీమా సొమ్మును తానే చెల్లిస్తానని చెప్పిన జగన్‌ ఈ ఏడాది 16 మంది రైతులకే బీమా చెల్లించారంంటే అన్నదాతల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం.

3 వేల మైలురాయికి యువగళం

లోకేశ్‌ పాదయాత్ర తేటగుంట ప్రాంతానికి సమీపంలో 3వేల కిలోమీటర్ల మైలురాయికి చేరురుకుంది. రాత్రి బస చేసిన తేటగుంట హైవేకి చేరేసరికి మొత్తం 3,006.7 కిలోమీటర్లు పూర్తయింది. 3వేల కి.మీ. మైలురాయికి గుర్తుగా సోమవారం లోకేశ్‌ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సాగిన యువగళం పాదయాత్రకు కనివినీ ఎరుగని రీతిలో జనం నీరాజనం పట్టారు. లోకేశ్‌ను చూసేందుకు వేలల్లో జనం ఎగబడ్డారు.

20న యువగళం ముగింపు సభ!

విశాఖపట్నం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభను ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలోని ఒక ప్రైవేటు లేఅవుట్‌లో నిర్వహించనున్నారు. సభా వేదిక నిర్మాణ పనులకు సోమవారం మధ్యాహ్నం 12.06 గంటలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భూమిపూజ చేయనున్నారు. సభకు పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, ఇతర అగ్రనేతలు హాజరుకానున్నారు. ఆదివారం విశాఖలో పార్టీ నాయకులు దామచర్ల సత్య, బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, గండి బాబ్జీ. కోరాడ రాజబాబు, భాష్యం ప్రవీణ్‌, పాశర్ల ప్రసాద్‌, ఆళ్ల శ్రీనివాసరావు సమావేశఽమై ముగింపు సభపై చర్చించారు. ఐదు లక్షల మందిని సమీకరించాలని నిర్ణయించారు. లోకేశ్‌ సోమవారం సాయంత్రం పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశిస్తారు. పాయకరావుపేట, ఎలమంచిలి, పెందుర్తి నియోజవర్గాల మీదుగా గాజువాకలోని అగనంపూడి టోల్‌గేట్‌కు 18న పాదయాత్ర చేరుకుంటుంది. ంద్రబాబు 2013లో మీకోసం పాదయాత్ర ముగింపు అగనంపూడి టోల్‌గేట్‌ సమీపంలోనే ముగించారు. ఇక్కడ పైలాన్‌ నిర్మించారు. ఇదే చోట లోకేశ్‌ యువగళం పాదయాత్రను ముగిస్తారు. అనతరం పైలాన్‌ను ఆవిష్కరిస్తారు.

యువగళానికి సంఘీభావంగా 3 వేల ఆటోలతో ర్యాలీ

గుంటూరు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): యువగళం పాదయాత్ర 3000 కి.మీ.కి చేరడంతో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ గుంటూరు నగరంలో 3 వేల ఆటోలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలో ఇన్నర్‌ రింగు రోడ్డులోని శిల్పారామం వద్ద ఆదివారం ఉదయం మన్నవ మోహనకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వేలాది మంది కార్యకర్తలు, లోకేశ్‌ అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు. యువగళానికి సంఘీభావంగా, లోకేశ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ.. యువనేత చేపట్టిన యువగళం ప్రజాగళంగా మారి, వైసీపీకి గొంతులో గరళంగా మారిందన్నారు.

Updated Date - 2023-12-11T02:58:54+05:30 IST