పులికాట్ మత్స్యకారులకు జగన్ వల!
ABN , First Publish Date - 2023-11-21T03:42:58+05:30 IST
ఆలూలేదు చూ లూలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో....

టెండర్లు మొదలవకుండానే నేడు శంకుస్థాపనలు
నాలుగున్నరేళ్లుగా ఆ పనుల ఊసే పట్టని సీఎం
ఎన్నికల ముందు హడావుడేనంటున్న జనం
తడ, నవంబరు 20: ఆలూలేదు చూ లూలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో చేయనున్న శంకుస్థాపనల తీరు. పులికాట్ సరస్సులో పూడికతీత, కాళంగి గ్రాయిన్ నిర్మాణం, సూళ్లూరుపేటలో కాళంగినదిపై కొత్త వంతెన నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కనీసం కాంట్రాక్టులు కేటాయించకుండానే ఎన్నికల ముందు చేస్తున్న ఈ హడావుడిని చూసి జనం విస్తుపోతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా పులికాట్‌లో పూడికతీత పనులు చేయిస్తానని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆ ఊసే పట్టని జగన్, పులికాట్ మత్స్యకారుల్లో వైసీపీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత ను గమనించి ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు. నిజానికి 2018 జనవరిలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం పులికాట్ పూడికతీతకు రూ.48 కోట్లు కేటాయిస్తూ ప్రకటన చేసింది. రూ.35 లక్షలు వెచ్చించి కోయంబత్తూరుకు చెందిన సఖాన్ సంస్థతో సర్వే కూడా చేయించింది.
ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అన్ని అభివృద్ధి పనుల కోవలోనే పులికాట్ పనులూ అటకెక్కాయి. తాజాగా జగన్ శంకుస్థాపన చేస్తున్న పను లు సాగరమాల పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టేవి. వీటికి రూ.122 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ పనులకు ఇంకా పూర్తిస్థాయిలో అనుమతులు మంజూరు చేయలేదు. నిధు లూ విడుదల చేయలేదు. టెండర్ల ప్రక్రియ కూడా మొదలు కాలేదు. ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్. సుమారు 620 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆంధ్రా, తమిళనాడు పరిధిలో విస్తరించి ఉంది. సూళ్లూరుపేటలోని 10 వేల మత్స్యకార కుటుంబాలకు సరస్సులో దొరికే మత్స్యసంపదే జీవనాధారం. ముఖద్వారాలు పూడిపోతూ సరస్సు ఎడారి లా మారింది. వానా కాలంలో మూడు నెలలు తప్ప మిగిలిన ఏడాదంతా సరస్సు ఎండిపోతుంది. తమిళనాడు లోని ముఖద్వారం పూడికతీత ప్రతి ఏడాదీ చేపడతారు. దీనివల్ల మత్స్య సంపద అటువైపే ఉండడంతో ఆంధ్ర జాలర్లు ఆ ప్రాంతానికి చేపల వేటకు వెళ్తుంటారు. దీంతో వీరిపై తమిళ జాలర్లు దాడులు చేస్తుంటారు. కేసులు పెడుతుంటారు.
నాలుగుసార్లు టెండర్లు పిలిచినా..
నాలుగు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాని కాళంగి గ్రాయిన్ నిర్మాణానికి ఇప్పు డు జగన్ శంకుస్థాపన చేస్తున్నారు. 2020లో వైసీపీ ప్రభుత్వం ఈ గ్రాయిన్ నిర్మాణం కోసం రూ.8.40 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో ఇప్పుడు అంచనా విలువను రూ.9.98 కోట్లకు పెంచి టెండర్లు ఆహ్వానించా రు. అయినా ఇప్పటి వరకు కాంట్రాక్టర్లు ఆ పనులవైపు కన్నెత్తి చూడలేదు. ఇలా కాంట్రాక్టర్లు ముందుకురాని పనికి ఇప్పుడు శంకుస్థాపన జరుగుతోంది. పులికాట్ బ్యాక్ వాటర్స్ కాళంగి నదిలో 15 కిలోమీటర్ల దాకా వెనక్కి వస్తున్నాయి. దీంతో నదీతీరప్రాంత గ్రామాల భూగర్భజలాలన్నీ ఉప్పగా మారాయి.