జగన్‌.. నీ పొగరే నీ నాశనం

ABN , First Publish Date - 2023-03-26T04:16:46+05:30 IST

‘జగన్‌.. నీ పొగరే నీ నాశనాన్ని నడిపిస్తోంది’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ విమర్శించారు.

జగన్‌.. నీ పొగరే నీ నాశనం

వైసీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి

వారంతా అవకాశం కోసం చూస్తున్నారు

టీడీపీ ఇద్దరు అభ్యర్థుల్ని నిలిపినా గెలిచేది

రాహుల్‌పై వేటు బీజేపీ ప్రీప్లాన్‌: హర్షకుమార్‌

రాజమహేంద్రవరం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌.. నీ పొగరే నీ నాశనాన్ని నడిపిస్తోంది’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రాజీవ్‌గాంధీ విద్యాసంస్థల కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జగన్‌.. నీవు చేస్తున్నది పరిపాలన కాదు. అభివృద్ధి లేకుండా నవరత్నాలంటూ డబ్బులు పంచిపెట్టడం పరిపాలన కాదు. అయినా నవరత్నాలు ఎవరికి ఇస్తున్నావు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపుల్లో ఒక్కరికైనా ఇచ్చావా? అంబేడ్కర్‌ విదేశీ విద్య లేదు. పీజీ స్కాలర్‌షి్‌పలు లేవు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు. ఓ పిల్లకో పిల్లాడికో అమ్మఒడి ఇస్తే సరిపోతుందా? నీ పనికిమాలిన మద్యంతో అనేక కుటుంబాలు నాశనమైపోతున్నాయి. నీ ఖజానా నింపుకోవడం కోసం ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నావు. అది నిన్ను కచ్చితంగా సర్వనాశనం చేస్తుంది. ప్రాంతాల వారీ చిచ్చుపెట్టాలనే నీ ఆలోచనను పట్టభద్రులు తిప్పకొట్టారు. విశాఖ రాజధాని అని చెప్పినా ఉత్తరాంధ్ర పట్టభద్రులు నిన్ను ఓడించారు. నీ సొంత జాగీరుగా చెప్పుకునే రాయలసీమలో కూడా నిన్ను ఓడించారు. నీ నాశనం మొదలైంది. నీకు నా శుభాకాంక్షలు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కరినే నిలబెట్టి టీడీపీ తప్పు చేసింది. మరో అభ్యర్థిని నిలబెట్టినా టీడీపీ గెలిచేది. ఎందుకంటే నీ ఎమ్మెల్యేలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అవకాశం కోసం చూస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ అసంతృప్తి ఉంది. నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కూడా నువ్వు గౌరవించవు. కూర్చోమనవ్‌. రెక్లెస్‌. ఇంటర్వ్యూలు కూడా ఇవ్వవ్‌. నీవు బయటకు వస్తే దుకాణాలు మూసేయాలి. డేరాలు కట్టాలి. చెట్లు కొట్టేయాలి. కర్ఫ్యూ వాతావరణం కలిపించాలి. ఎంత భయం నీకు? ముసలమ్మలకు కూడా ముద్దులు పెట్టిన నీవు ఇవాళ బయటకు రావడానికే భయపడిపోతున్నావు. నీ ఓటమికి నీవే కారణం. ప్రజాస్వామ్య విలువల కోసం అన్ని పార్టీలు పోరాడటం మంచి పరిణామం. నీ పార్టీ ఓ హింస పార్టీ. దళితులను ఎంతోమందిని చంపేశారు. రాష్ట్రపతి జోక్యం చేసుకున్నా నిందితులను అరెస్ట్‌ చేయలేదు. ఇవాళ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి, దళితులకు ఏదో చేసేశానని గొప్పగా ప్రకటించావు. ఇది కాంగ్రెస్‌ ఎప్పుడో చేసింది. రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ నివేదిక మేరకు ఎస్సీ హోదా కల్పించేందుకు చేసిన ప్రయత్నాన్ని నాడు బీజేపీ అడ్డుకుంది’ అని హర్షకుమార్‌ తెలిపారు. పార్లమెంటులోకి రాకుండా కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీపై వేటు వేయడం బీజేపీ ప్రీప్లాన్‌ అని హర్షకుమార్‌ తెలిపారు. అదానీ అవినీతి, అక్రమాలు ప్రజల్లో మరింతగా వెళతాయేమోననే భయంతోనే ఇలా చేశారని ఆరోపించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావలసిన జగన్‌కు ప్రత్యేక మినహాయింపు ఇచ్చారని, మోదీకి జగన్‌ దత్తపుత్రుడయ్యాడని విమర్శించారు. రాహుల్‌ మళ్లీ పార్లమెంట్‌కు వస్తారని, మరింత గట్టిగా మాట్లాడతారని హర్షకుమార్‌ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-26T04:17:12+05:30 IST