వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో ఆరితేరిన జగన్‌

ABN , First Publish Date - 2023-06-01T04:38:24+05:30 IST

‘వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో సీఎం జగన్‌ ఆరితేరిపోయారు. వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డిని కాపాడటానికి సీఎం చేసిన ఢిల్లీ పర్యటనలు విజయవంతం

వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో ఆరితేరిన జగన్‌

● అవినాశ్‌ని కాపాడటానికి సీఎం చేసిన ఢిల్లీ పర్యటనలు సక్సెస్‌: టీడీపీ

అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): ‘‘వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో సీఎం జగన్‌ ఆరితేరిపోయారు. వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డిని కాపాడటానికి సీఎం చేసిన ఢిల్లీ పర్యటనలు విజయవంతం అయ్యాయి. ఆయన విజయానికి అభినందిస్తున్నాం’’ అని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య బుధవారం ఇక్కడ తమ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్‌ అధికారం, వనరులు, పలుకుబడి, ప్రభావం ముందు సీబీఐ శ్రమ అంతా తుడిచిపెట్టుకుపోయిందన్న అనుమానం కలుగుతోంది. తనను తాను కాపాడుకోవడానికి అవినాశ్‌కు ముందస్తు బెయిల్‌ ఇప్పించుకోగలిగారు. సీబీఐ వద్ద అవినాశ్‌ పాత్రపై తిరుగులేని సాక్ష్యాలు ఉన్నా అవి వ్యర్ధమయ్యాయి. ఏపీ ప్రభుత్వం సీబీఐని బెదిరించినట్లు దేశంలో ఏ ప్రభుత్వం బెదిరించలేదు. తన అవినీతి కేసుల్లో 18 నెలలపాటు జైల్లో ఉండివచ్చిన జగన్‌ సీఎం అయిన తర్వాత నాలుగేళ్లలో ఒక్కసారి కూడా కోర్టు వాయిదాకు హాజరు కాలేదు. ఆయన పనితనం, వ్యవస్థలను ఆయన మేనేజ్‌ చేస్తున్న తీరు దీనిని బట్టే అర్థమవుతోంది’’ అని బొండా వ్యాఖ్యానించారు. కాగా, ముఖ్యమంత్రిగా జగన్‌ రాష్ట్రానికి పనికిరాకపోయినా అవినాశ్‌రెడ్డిని కాపాడుకోవడానికి పనికివచ్చాడని వర్ల రామయ్య అన్నారు. ‘‘అధికార బలం, అవినీతి సొమ్ము ఉన్నవారికి ఒక న్యాయం... సామాన్యుడికి మరో న్యాయమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ తీర్పును సుప్రీంకోర్టు సమీక్షించాలి. హత్య కేసులను బెయిల్‌ పొందగలిగే కేసులుగా పార్లమెంటు మార్చేస్తే ప్రజలందరికీ ఉపశమనం లభిస్తుంది. జగన్‌కు ఇంత కష్టపడాల్సిన అవసరం రాదు. దర్యాప్తు ఎలా చేయాలో నిందితులే సీబీఐకి ఆదేశాలిస్తున్నట్లుగా పరిస్ధితి తయారయింది. బెయిల్‌ రాగానే అవినాశ్‌రెడ్డి పులివెందులలో ప్రజా దర్బార్‌ నిర్వహించడం అధికార మదానికి నిదర్శనం’’ అని వర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-06-01T04:38:24+05:30 IST