ఢిల్లీ చేరిన జగన్
ABN , First Publish Date - 2023-05-27T03:44:50+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. మధ్యాహ్నం ..

కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ
తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు వెంటనే ఇప్పించాలని వినతి
నేడు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు
సాయంత్రం లేదంటే రేపు మోదీ, షాలతో భేటీ
న్యూఢిల్లీ/అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన ఆయన అక్కడి నుంచి విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. నిర్మలతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు. 2014-15కి సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016-19 మధ్య కాలంలో పరిమితికి మించి రుణాలు తీసుకోవడంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు, 2021-22లో రుణాల పరిమితిపై సడలింపుల గురించి ప్రస్తావించారు. రాష్ర్టాన్ని విభజించిన తర్వాత తెలంగాణ డిస్కమ్‌లకు ఏపీ జెన్‌కో సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి రావలసిన రూ.6,756.92 కోట్ల బకాయిల అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. జెన్‌కో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ డబ్బు చాలా అవసరమని, జాప్యం లేకుండా వీలైనంత త్వరగా ఇప్పించాలని కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే మూలధన పెట్టుబడిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం ఇచ్చేలా కేంద్ర బడ్జెట్‌లో పొందుపరిచారని.. తన ప్రభుత్వం ఇప్పటికే విద్య, వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని.. రాష్ట్ర భవిష్యత్‌నుఇవి తీర్చిదిద్దుతాయని, వీటికోసం చేసిన ఖర్చును మూలధన పెట్టుబడిగా భావించి ప్రత్యేక సాయం వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు ఉన్నారు. శనివారం ప్రగతి మైదాన్‌లో జరగనున్న నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. శనివారం సాయంత్రం లేదా ఆదివారం ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అవుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.