జగన్ పోలవరం కట్టలేడు
ABN , First Publish Date - 2023-08-22T03:22:09+05:30 IST
పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్మోహన్‌రెడ్డి కట్టలేడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు.
2020లో పూర్తి చేస్తానని.. ఇప్పుడు 2025కు
గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: సీపీఐ రామకృష్ణ
రాజమహేంద్రవరం అర్బన్/పోర్టుసిటీ(కాకినాడ), ఆగస్టు 21: పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్మోహన్‌రెడ్డి కట్టలేడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. 2020జూన్ కల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తానని అసెంబ్లీలో చెప్పారని, మళ్లీ 2020 డిసెంబరు, 2021 జూన్ అంటూ గడువు మార్చారని విమర్శించారు. ఇప్పుడు 2025 అంటున్నారని, అసలు 2025లో అధికారంలో ఉంటావని గ్యారెంటీ ఏమైనా ఉందా అని జగన్‌ను ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గద్దె దింపి, ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బస్సుయాత్ర సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చేరింది. కోటిపల్లి బస్టాండు సెంటర్‌లో గోదావరి గర్జన పేరుతో నిర్వహించిన బహిరంగసభలోను, అంతకుముందు విలేకరులతోను రామకృష్ణ మాట్లాడారు. జగన్ అధికారంలో ఉండగా ఒక్క ప్రాజెక్టు పూర్తికాదని, ఒక్క కాలువ కూడా తవ్వలేడన్నారు. ఇది దొంగ ప్రభుత్వమని, ఒక దొంగ రాష్ట్రంలో దొంగ బిల్లులు సృష్టించి ఇసుకంతా అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కూడా 307 కేసు పెట్టారంటే పోలీసులకు ఏమైనా బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. సెప్టెంబరు 8న తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, పార్టీ జాతీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు. కాకినాడలోని గాంధీభవన్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా, కోస్టల్ కారిడార్, మత్స్యసంపద, ఎన్‌ఎ్‌ఫసీఎల్ పరిరక్షణ తదితర అంశాలపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారని రామకృష్ణ విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ చలసాని శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ చౌదరి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.