ఇరుకు రోడ్లపై సభలు పెట్టడం సరికాదు
ABN , First Publish Date - 2023-03-02T03:23:27+05:30 IST
రాజకీయ పార్టీలు ప్రజలకు అసౌకర్యం కలుగకుండా సభలు, సమావేశాలు పెట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
ప్రజలకు అసౌకర్యం కలగకుండాపెట్టుకుంటే అభ్యంతరం లేదు: డీజీపీ
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 1: రాజకీయ పార్టీలు ప్రజలకు అసౌకర్యం కలుగకుండా సభలు, సమావేశాలు పెట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఇరుకు సందుల్లో, మెయిన్ రోడ్లలో సభలు పెడతామనడం సరియైున విధానం కాదన్నారు. బుధవారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన స్థానిక జాంపేట పోలీస్ క్వార్టర్స్‌లో రూ.కోటి 80లక్షలతో నిర్మించిన పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. సచివాలయ మహిళా పోలీసులతో సమావేశమయ్యారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ మహిళలపై దాడులు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రాంతాల వారీగా ముందుగానే మహిళా కానిస్టేబుళ్లతో సర్వే చేస్తున్నామన్నారు. వాటిని గుర్తించి తొలిదశలో కౌన్సెలింగ్ ఇస్తామని, అప్పటికీ మార్పురాకపోతే దాడులు, వేధింపులు చేసేవారిపై హత్య, 304-బి కేసులు పెడతారని తెలిపారు. సచివాలయ మహిళా పోలీసుల ద్వారా చిన్నచిన్న గొడవలు పరిష్కారమవుతున్నాయని, గతేడాదిలో 77వేల కేసులు తగ్గాయని, ఇది ఏపీ పోలీస్ శాఖలోనే చాలా పెద్ద ఘనతగా చెప్పారు. అనంతరం .జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో నిర్మించిన స్పోర్ట్సు కాంప్లెక్స్‌ను డీజీపీ ప్రారంభించారు. ఆయన వెంట ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సీహెచ్ సుధీర్ కుమార్‌రెడ్డి, పశ్చిమగోదావరి ఎస్పీ రవిప్రకాశ్ తదితరులు ఉన్నారు.