మరో వాణిజ్య ప్రయోగానికి ఇస్రో రెడీ
ABN , First Publish Date - 2023-03-19T02:17:59+05:30 IST
భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. వన్‌వెబ్ సంస్థకు చెందిన 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలు నింగిలోకి
26న ఎల్‌వీఎం3-03 రాకెట్ ప్రయోగం
సూళ్లూరుపేట, మార్చి 18: భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ (ఇస్రో) మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైంది. వన్‌వెబ్ సంస్థకు చెందిన 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి ఈ నెల 26న మార్క్3-ఎం3 (ఎల్‌వీఎం3-ఎం3) రాకెట్‌ను ప్రయోగించనుంది. దీని ద్వారా 5,805 కిలోల బరువున్న 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రోదసీలోకి పంపనుంది. బ్రిటన్‌కు చెందిన నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్‌ప్రైజెస్ సంయుక్త భాగస్వాములుగా వన్‌వెబ్ ఇడియా-2 పేరుతో ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌ను ప్రయోగిస్తారు. రాకెట్‌కు సంబంఽధించిన అనుసంధాన పనులను ఇప్పటికే శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. వన్‌వెబ్ ఇండియా సిరీ్‌సలో ఇది రెండో ప్రయోగం కావడం విశేషం. ఇస్రోకు ఈ ఏడాది తొలి వాణిజ్య ప్రయోగం కూడా. గతేడాది అక్టోబరులో కూడా వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఇస్రో ఒకేసారి కక్ష్యలోకి పంపి రికార్డు సృష్టించింది.
జూన్‌లో చంద్రయాన్ -3
జూన్‌లో చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. చంద్రుడి దక్షిణ ప్రాంతాన్ని అన్వేషించడానికి చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా ఒక లూనార్ రోవర్‌ను, ఒక లూనార్ ల్యాండర్‌ను పంపనుంది. చంద్రుడిపై అన్వేషణకు చేపట్టిన వాటిలో ఇది మూడో ప్రయోగం. చంద్రయాన్-2 ప్రయోగంలో ధ్రువ ప్రాంతంలో ల్యాండర్ దిగే సమయంలో ఒరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రయోగాలు అనేకం చేపట్టారు. 4 రోజుల క్రితం బెంగళూరులోని యూఆర్ రావు ఉపగ్రహ కేంద్రంలో మూడు మాడ్యూల్స్‌తో కూడిన చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని రూపొందించి, అక్కడే దానికి సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. చంద్రుడిపై ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి ప్రయోగ సమయంలో ఎదురయ్యే కంపనం, ధ్వని తీవ్రతలను తట్టుకొనే విధంగా మాడ్యూల్స్‌ను సిద్ధం చేశారు. ఈ క్రమంలో చంద్రయాన్-3 వ్యోమనౌక కీలక పరీక్షలన్నీ పూర్తిచేసుకొని ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్-3 చంద్ర మండలంలోని ధ్రువ ప్రాంతాల్లో సుస్థిరంగా ఉండి, నిరంతరాయంగా పరిశోధనలు చేసేందుకూ, నమూనాలు సేకరించేందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు.