Share News

Votes : అధికార పార్టీ ఓట్ల అక్రమాలు

ABN , First Publish Date - 2023-10-13T03:36:13+05:30 IST

‘వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అక్రమాలకు పాల్పడుతోంది. ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తూ.. వైసీపీకి అనుకూలంగా ఉన్న వారి పేర్లను

Votes : అధికార పార్టీ ఓట్ల అక్రమాలు

ప్రతిపక్షాల ఓట్లు తొలగింపు.. ఒక్కోవ్యక్తి వేల సంఖ్యలో ఫామ్‌-7 దాఖలు

వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో తప్పులు

ఓటర్ల జాబితాలు తారుమారు

ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ ఫిర్యాదు

అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ‘వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అక్రమాలకు పాల్పడుతోంది. ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తూ.. వైసీపీకి అనుకూలంగా ఉన్న వారి పేర్లను చేర్చి గెలవాలని చూస్తోంది. వలంటీర్‌, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల్ని ఉపయోగించి, ఓట్ల అక్రమాలకు పాల్పడుతోంది. వందలు, వేల సంఖ్యలో ఫామ్‌-6, 7లు దాఖలు చేసి, తమకు అనుకూలంగా దొంగ ఓట్లు చేర్చే ప్రయత్నం చేస్తూ, ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తోంది’ అని తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో పార్టీ నేతలు గురువారం అమరావతి సచివాలయంలో సీఈవో ముఖేష్‌కుమార్‌ మీనాను కలిశారు. వైసీపీ నేతల ఓట్ల అక్రమాలపై ఆధారాలతో సహా లేఖ సమర్పించారు. ఒకటి కంటే ఎక్కువ ఓట్లకు ఫామ్‌-7 దరఖాస్తులు అనుమతించినవిశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పలువురి బీఎల్‌వోల పేర్లుతో సహా వివరాలు అందజేశారు. ‘‘నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 5 దరఖాస్తులు కంటే ఎక్కువ పెట్టడానికి లేదు. కానీ, 57 మంది వ్యక్తులు వెయ్యేసి ఫామ్‌-7లు దాఖలు చేస్తున్నారు. సుమారు 2,500 మంది పది నుంచి వంద అప్లికేషన్లు పెట్టి, దొంగ ఓట్లు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత ఓటర్ల జాబితా కంటే 7,44,000 ఎక్కువ అభ్యంతరాలు దాఖలయ్యాయి. వాటిల్లో విశాఖ పశ్చిమలో నలుగురు బీఎల్‌వోలు 7,800 ఫామ్‌-7లను అనుమతించారు. ఒక పోలింగ్‌ బూత్‌లో గరిష్టంగా 1,200 ఓట్లు ఉండవచ్చు. కానీ దాఖలైన ఫామ్‌-7లలో సగటున ఒక్కో బీఎల్‌వోకు 1,950 దాకా వచ్చాయి. 2,360 మంది 10-100 మధ్య ఫామ్‌లు సమర్పించారు. ఈ కేసులు క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’’ అని ఆ లేఖలో కోరారు. సీఈవో తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించాలని, నిబంధనల ప్రకారం ఫామ్‌-7ల ప్రామాణీకతను ధృవీకరించడానికి అన్ని ఎలక్టోరల్‌ రిజిస్టేషన్‌ అధికారులు, డీఈవో్‌సలను ఆదేశించాలని, నిజమైన ఓట్ల తొలగింపునకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు: అచ్చెన్న

వైసీపీ నేతలు దొంగ ఓట్లను నమ్ముకుని వచ్చే ఎన్నికల్లో గెలవాలని కలలు కంటున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జగన్‌రెడ్డి అధికార మదంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన అనంతరం అచ్నెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని టీడీపీ భావిస్తోంది. కానీ జగన్‌రెడ్డి దేశంలో ఎక్కడా లేని వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రతిపక్షాల ఓట్లు తొలగిస్తున్నారు. వారికి అనుకూలంగా ఉన్న వారి పేర్లు చేర్చుతున్నారు. ఈ అక్రమాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. వైసీపీ ఆవిర్భవించాక ఒక్క ఎలక్షన్‌లో కూడా ప్రజామోదంతో గెలిచిన సందర్భాలు లేవు. ఎప్పుడూ వ్యవస్థల్ని తారుమారు చేసి గెలవడం జగన్‌కు అలవాటైంది. ఈ సారి కూడా వలంటీర్‌, సచివాలయ వ్యవస్థల్ని ఉపయోగించి, దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు’ అని ఆరోపించారు. వైసీపీ ఓట్ల అక్రమాలపై సీఈవోకి ఫిర్యాదు చేశామని, ఆయన దీన్ని సీరియ్‌సగా తీసుకుంటామని చెప్పారని అన్నారు.

అమిత్‌ షా సానుకూలంగా స్పందించారు

ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్‌ను రాజకీయంగా ఉరితీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వెంటిలేటర్‌పై ఉన్న వైసీపీ ఆరిపోయే దీపమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. టీడీపీని లేకుండా చేయాలని వైసీపీ సైకోలు పిచ్చి కలలు కంటున్నారు. అక్రమ అరె్‌స్టలు, ప్రభుత్వ అరాచక విధానాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తమపై ఉంది. అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి, వైసీపీ ప్రభుత్వం తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని లోకేశ్‌ వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. న్యాయానికి, ధర్మానికి తమ మద్దతు ఉంటుందని అమిత్‌ షా చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత బీజేపీ స్టేట్‌ చీఫ్‌గా పురందేశ్వరికి ఉంది కాబట్టే ఆమె కూడా వెళ్లారని, ఇందులో మరే రాజకీయం లేదని స్పష్టం చేశారు. టీడీపీ బృందంలో పార్టీ నేతలు వర్ల రామయ్య, బోండా ఉమా, పర్చూరి, అశోక్‌బాబు, తెనాలి శ్రావణ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-10-13T03:36:13+05:30 IST