ఉద్యోగులపై ఉక్కుపాదం
ABN , First Publish Date - 2023-11-20T04:07:51+05:30 IST
సీపీఎస్ అంతం... మన పంతం’ నినాదంతో ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆదివారం తలపెట్టిన రాష్ట్రస్థాయి

చిత్తూరులో సీపీఎస్ ‘ఆత్మగౌరవ సభ’ భగ్నం
ముందురోజు నుంచే సంఘాల నేతలకు నోటీసులు
కొందరి గృహనిర్బంధం, మరికొందరు స్టేషన్‌కు
అర్ధరాత్రి వేళ వేదికను తొలగించిన పోలీసులు
సభా ప్రాంగణం చుట్టూ భారీగా మోహరింపు
చిత్తూరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ‘సీపీఎస్ అంతం... మన పంతం’ నినాదంతో ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆదివారం తలపెట్టిన రాష్ట్రస్థాయి ‘ఆత్మగౌరవ సభ’ను పోలీసులు భగ్నం చేశారు. చిత్తూరులోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఎదుట ఓ ప్రైవేటు స్థలంలో సభ నిర్వహించాలని సీపీఎస్ ఉద్యోగులు భావించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఉద్యోగులు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే ఆత్మగౌరవ సభకు అనుమతి లేదని చిత్తూరు పోలీసులు శనివారమే ప్రకటించారు. ఈ సభలో పాల్గొనే సంఘాల నాయకులకు ముందునుంచే నోటీసులు ఇచ్చారు. కొందరిని గృహ నిర్బంధం చేయగా, మరికొందరిని పోలీసు స్టేషన్లకు తరలించారు. శనివారం అర్ధరాత్రి సభా ప్రాంగణానికి వెళ్లి వేదికను తొలగించారు. మధ్యాహ్నం వరకు సభా ప్రాంగణం చుట్టూ పోలీసులు పహారా కాశారు. ఉదయం 7 గంటల నుంచే సభా ప్రాంగణానికి రెండువైపులా పికెట్లు ఏర్పాటు చేసి ఉద్యోగులను ఆ మార్గంలో వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఆత్మగౌరవ సభను రద్దు చేస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. సభ రద్దు కావడంతో సీఎం జగన్‌పై ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర నాయకులు విరుచుకుపడ్డారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు చేస్తానని మాటిచ్చిన జగన్, ఇప్పుడు దాన్ని పట్టించుకోకుండా, జీపీఎ్‌సను తెచ్చి నయవంచన చేస్తున్నారన్నారు. ఏడు రాష్ట్రాలు ఓపీఎ్‌సను అమలు చేస్తుంటే, మీరెందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ‘గత టీడీపీ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ ఇచ్చింది. 60ఏళ్లకు వయోపరిమితి పెంచి ఉద్యోగులకు ఎంతో చేసింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మాపై కేసులు పెట్టి వేధిస్తోంది. దీంతో పోలిస్తే గత టీడీపీ ప్రభుత్వమే మేలు’ అని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరావు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సీఎం దాస్, గౌరవ సలహాదారు బాబీ పఠాన్, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటా మోహన్ పాల్గొన్నారు.