సీఐడీ మాజీ చీఫ్ అక్రమ వసూళ్లపై విచారణ జరపండి
ABN , First Publish Date - 2023-01-25T04:17:31+05:30 IST
: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్ అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేకుంటే ప్రజాప్రభుత్వం వచ్చాక విచారణ జరిపిస్తాం
ఉద్యోగ సంఘాలు గవర్నర్‌ను కలవడం తప్పా?: రఘురామ
న్యూఢిల్లీ, జనవరి 24(ఆంధ్రజ్యోతి): సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్ అక్రమ వసూళ్లపై విచారణ జరిపించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ సీఐడీలో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించిన తులసి, డాక్టర్ ఆనంద్, నాగరాజు ఎవరని ఆయన ప్రశ్నించారు. వ్యాపార సంస్థలపై సీఐడీ కేసులు నమోదు చేయగానే తులసి, ఆనంద్, నాగరాజు.. ఆ సంస్థల యాజమాన్యాలను ఎందుకు కలిశారని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, ఇతర ఆర్థిక నేరాల కేసులతో ఈ ముగ్గురికి ఉన్న సంబంధాన్ని తేల్చాలన్నారు. మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సునీల్ కుమార్ తన సహచర అధికారులు, ముగ్గురు సభ్యుల బృందంతో కలిసి పాల్పడిన అక్రమ వసూళ్లపై జగన్ ప్రభుత్వం విచారణ జరిపిస్తే మంచిదని, లేకుంటే రాష్ట్రంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వమే విచారణ జరిపి దోషులను శిక్షిస్తుందని చెప్పారు. తనను చిత్రహింసలు పెట్టిన ఘటనపై రెండు రోజుల్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని తెలిపారు. సునీల్‌కుమార్‌ను పదవి నుంచి తప్పించి, జీఏడీలో రిపోర్టు చేయాలని సీఎం జగన్ ఆదేశించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. డీజీపీగా పదోన్నతి కల్పిస్తారని ఊహాగానాలు వస్తున్నాయని, మంత్రివర్గంలోకి ఎవరినైనా తీసుకునే అధికారం సీఎంకు ఉంటుంది కానీ డీజీపీ నియామకానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయని చెప్పారు. కాగా, ఉద్యోగ సంఘాల నాయకులు గవర్నర్‌ను కలిసి ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇప్పించమని అడిగితే తప్పా? అని రఘురామ ప్రశ్నించారు. ఈ విషయమై ఉద్యోగ సంఘాల నాయకులు కోర్టును ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవో 1ని కోర్టు కొట్టి వేయడం ఖాయమని రఘురామ అభిప్రాయపడ్డారు. ‘పోలీస్ చట్టం 1861 ప్రకారం ఇచ్చినట్లుగా చెబుతున్న జీవో1 నూటికి నూరుపాళ్లు చీకటి జీవో. ఇది అసంబద్థమైన, రా జ్యాంగ వ్యతిరేక జీవో. దీనిని కోర్టు కొట్టి వేయడం ఖాయం. ఒకవేళ కొట్టి వేయకపోతే, సుప్రీంకోర్టును ఆశ్రయించైనా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు.