వడ్డీ.. కాసులు.. శ్రీవారికి కనకవర్షం

ABN , First Publish Date - 2023-03-26T03:57:06+05:30 IST

శ్రీవారి హుండీ ఆదాయం, వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై వడ్డీలే టీటీడీకి ప్రధాన ఆదాయవనరులుగా మారాయి. ఇటీవల టీటీడీ ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెటే ఇందుకు నిదర్శనం.

వడ్డీ.. కాసులు.. శ్రీవారికి కనకవర్షం

ప్రధాన వనరుగా హుండీ, డిపాజిట్లు

4,411 కోట్ల వార్షిక బడ్జెట్‌లో

పై రెండు మార్గాల్లోనే 2,581 కోట్లు

కొవిడ్‌ అనంతరం రాబడి భారీగా పెరుగుదల

తిరుమల, మార్చి 25(ఆంధ్రజ్యోతి): శ్రీవారి హుండీ ఆదాయం, వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై వడ్డీలే టీటీడీకి ప్రధాన ఆదాయవనరులుగా మారాయి. ఇటీవల టీటీడీ ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెటే ఇందుకు నిదర్శనం. రూ.4,411.68 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన టీటీడీ రూ.2,581 కోట్లు... అంటే సగం ఆదాయం హుండీ, డిపాజిట్ల ద్వారానే వస్తుందని పేర్కొంది. కొవిడ్‌ ముందువరకూ టీటీడీకి హుండీ ద్వారా ఏడాదికి రూ.1,000 కోట్ల నుంచి రూ.1,200 కోట్లు వచ్చేవి. ఇందులో భాగంగానే 2022-23 వార్షిక బడ్జెట్‌లోనూ టీటీడీ రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని పేర్కొంది. అయితే ఊహించని విధంగా గడిచిన ఏడాదిలో రూ.1,613 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. హుండీ ఆదాయం కొవిడ్‌ అనంతరం రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పెరిగింది. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జనవరి 2న రూ.7.68 కోట్లు లభించాయి. ఈ క్రమంలోనే రానున్న ఏడాదికి రూ.1,591 కోట్ల హుండీ ఆదాయం సమకూరుతుందని టీటీడీ భావిస్తోంది. మరోవైపు వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ.668.51 కోట్లు ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. కొవిడ్‌ అనంతరం పెరిగిన వడ్డీ ధరలతో ఏకంగా రూ.813 కోట్లు లభించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.990 కోట్ల వడ్డీ వస్తుందని టీటీడీ అంచనా వేసింది. మరోవైపు ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.365 కోట్లు వస్తుందని గత బడ్జెట్‌లో అంచనా వేయగా, ఏకంగా రూ.500 కోట్లు లభించాయి.

ఏప్రిల్‌ నెల రూ.300 దర్శన కోటా రేపు విడుదల

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి ఏప్రిల్‌ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ సోమవారం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌ ద్వారా ఈ కోటా విడుదల కానుంది.

Updated Date - 2023-03-26T03:57:06+05:30 IST