Infosys : ఇన్ఫోసిస్ కథలో పిడకలవేట!
ABN , First Publish Date - 2023-06-01T04:51:13+05:30 IST
విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కంపెనీ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. గత ఏడాదికాలంగా తేదీలు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. స్వయంగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథే ఇప్పటికి నాలుగు ముహూర్తాలు
ఆ కంపెనీ తానే తెచ్చానన్న మంత్రి అమర్నాథ్
ఇలాంటివెన్నో రాష్ట్రానికి తెచ్చానంటూ వ్యాఖ్యలు
కానీ, ఇన్ఫోసిస్ రాకలో ప్రభుత్వం పాత్ర శూన్యం
విశాఖకు రావాలనేది కంపెనీ సొంత నిర్ణయం
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న ఉత్తరాంధ్ర
ఉద్యోగుల కోసం కరోనాలో ఈ నిర్ణయం
అది తెలిసి కంపెనీ ప్రతినిధులతో మంత్రి భేటీ
విశాఖపట్నం, తిరుమల, మే31 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కంపెనీ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. గత ఏడాదికాలంగా తేదీలు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. స్వయంగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథే ఇప్పటికి నాలుగు ముహూర్తాలు ప్రకటించారు. ఒకసారి జూన్ (2022) అని, మరోసారి అక్టోబరు అని, ఆ తరువాత 2023 జనవరి అని, ఆపై మే అని చెప్పుకుంటూ వచ్చారు. అది కూడా పూర్తయ్యింది. ఇన్ఫోసిస్ కార్యాలయం మాత్రం ప్రారంభం కాలేదు. అయితే, ఇన్ఫోసిస్ కంపెనీ ఎవరి వల్ల విశాఖపట్నం వచ్చిందో తెలియదా అంటూ మంత్రి గుడివాడ తిరుమలలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నించారు. నిజంగానే ఎవరి వల్ల అనేది తిరుమలలో భక్తులకు తెలియదు. కానీ, విశాఖపట్నం ప్రజలకు మాత్రం కచ్చితంగా తెలుసు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం, ఘనత వీసమెత్తు కూడా లేదు. కరోనా తరువాత వర్క్ ఫ్రమ్ హోమ్‌లో పనిచేస్తున్న ఉత్తరాంధ్ర ఉద్యోగుల కోసం ద్వితీయ శ్రేణి నగరాల విభాగంలో విశాఖలో కార్యాలయం ఏర్పాటుకు ఇన్ఫోసిస్ ముందుకువచ్చింది. దశలవారీగా దీనిని విస్తరిస్తామని ప్రకటించింది. ఆ కంపెనీ ప్రకటన చేసిన తరువాత మంత్రి అమర్నాథ్ వారిని పిలిపించుకొని విశాఖకు వస్తే..ఏ సాయం కావాలన్నా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ వారికి అనుకూలమైన స్థలం గానీ, భవనం గానీ చూపించలేకపోయారు. దాంతో ఆ సంస్థే రుషికొండ ఐటీ పార్కులో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని ఇంటీరియర్ పనులన్నీ పూర్తిచేసుకుంటోంది. వచ్చే నెలలో దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. ఇందులో ఇంకో ఏడాది వరకు కొత్త ఉద్యోగాలు ఏమీ రావు.