పదిలో పెరిగిన ఉత్తీర్ణత
ABN , First Publish Date - 2023-05-07T02:00:21+05:30 IST
పదో తరగతి పరీక్షల్లో గతేడాది కంటే 5 శాతం ఉత్తీర్ణత పెరిగింది. మొత్తం 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌లో మాదిరిగా పదో తరగతి ఫలితాల్లోనూ అమ్మాయిలే ముందంజలో నిలిచారు. అబ్బాయిలు 69.27 శాతం మంది ఉత్తీర్ణులు ..
మొత్తం 72.26% విద్యార్థులు పాస్
● గతేడాది కంటే 5 శాతం పెరుగుదల
● టెన్త్ ఫలితాల్లోనూ అమ్మాయిలే టాప్
● బాలికలు 75.38%.. బాలురు 69.27%
● మన్యం జిల్లా ఫస్ట్.. నంద్యాల లాస్ట్
● ఫస్ట్ డివిజన్‌లో శ్రీకాకుళం టాప్
● 933 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత
● 38 పాఠశాలల్లో సున్నా ఫలితాలు
● రెసిడెన్షియల్ స్కూళ్లలో 95.25% పాస్
● జూన్ 2 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో గతేడాది కంటే 5 శాతం ఉత్తీర్ణత పెరిగింది. మొత్తం 72.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్‌లో మాదిరిగా పదో తరగతి ఫలితాల్లోనూ అమ్మాయిలే ముందంజలో నిలిచారు. అబ్బాయిలు 69.27 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, అమ్మాయిలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలతో పోలిస్తే ఉత్తీర్ణత 6.11 శాతం ఎక్కువ. శనివారం విజయవాడలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇంతకుముందు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఫలితాలు ప్రకటించగా, ఈసారి కొత్త జిల్లాల ప్రామాణికంగా ప్రకటించారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,09,081 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 6,05,052 మంది పరీక్షలకు హాజరయ్యారు. హాజరైన విద్యార్థుల్లో 4,37,196 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,09,245 మంది బాలురు పరీక్షలు రాయగా 2,14,220 మంది, 2,95,807 మంది బాలికలు పరీక్షలు రాయగా 2,22,976 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణులైన వారిలో 3,31,646 మందికి (75.80 శాతం) ఫస్ట్ డివిజన్ వచ్చింది. 73,559 మందికి రెండో డివిజన్, 31,991 మందికి మూడో డివిజన్ దక్కింది. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 19,364 మంది మొదటి డివిజన్ సాధించారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా 87.47 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో ఉండగా, నంద్యాల జిల్లా 60.39 శాతంతో అట్టడుగున నిలిచింది. రాష్ట్రంలో 933 పాఠశాలల్లో 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 38 పాఠశాలల్లో అందరూ ఫెయిలయ్యారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 95.25 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది కంటే 3.89 శాతం ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది మొత్తం 67.26 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
జూన్ 2 నుంచి సప్లిమెంటరీ
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2 నుంచి 10 వరకు జరుగుతాయని మంత్రి బొత్స ప్రకటించారు. పరీక్షల షెడ్యూల్‌ను రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. విద్యార్థులు ఆదివారం నుంచి ఈ నెల 17 వరకు పాఠశాల విద్యా శాఖ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అదనపు రుసుముతో 18 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉందన్నారు. ఫెయిలయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఆదివారం నుంచి నెల 13లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తును డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఇక ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల మెమోలను నాలుగు రోజుల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. గతేడాది 71 పాఠశాలల్లో సున్నా శాతం ఫలితాలు రాగా, ఈసారి 38కి తగ్గించామని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో వంద శాతం ఫలితాలు వచ్చేలా వచ్చే ఏడాదికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు ఏ కోర్సుల్లో చేరుతున్నారు, ఎంతమంది డ్రాపౌట్ అవుతున్నారనేది ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలు ఉత్తీర్ణత శాతాలు ప్రకటించుకోవచ్చని, మార్కులు ప్రచారం చేసుకోకూడదన్నారు.
అమ్మఒడి నుంచే ఫీజు కట్టుకోవాలి
విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లు పొందే విద్యార్థుల ఫీజులను అమ్మఒడి నుంచే కట్టుకోవాలని మంత్రి బొత్స స్పష్టం చేశారు. తామేమీ మొత్తం కట్టాలని చెప్పడం లేదని, ఫీజులు కట్టినా అమ్మఒడిలో సగం నగదు మిగులుతుందన్నారు. అయితే ఆర్టీఈ కింద చేరిన పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లు పుస్తకాలు సహా అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పించాలన్నారు. కాగా అన్ని ప్రైవేటు పాఠశాలల పట్ల తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ తెలిపారు. గరిష్ఠంగా 30 శాతం బడుల్లోనే సీట్లు కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ బడులు బాగున్నందునే ప్రైవేటు స్కూళ్లలో సీట్లు అడగడం లేదని బొత్స అన్నారు.
బడులకు ఆన్‌లైన్‌లో అనుమతులు
ప్రైవేటు పాఠశాలలకు ఇచ్చే అనుమతులను ఆన్‌లైన్ ద్వారా మంజూరు చేసే విధానాన్ని మంత్రి బొత్స ప్రారంభించారు. అనుమతి, గుర్తిం పు, రెన్యువల్ కోసం పాఠశాల విద్యా శాఖ వెబ్‌సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ సురేశ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం మున్సిపల్, ఫైర్, పోలీసు, రిజిస్ట్రేషన్, ఆర్ అండ్ బీ శాఖల నుంచి అనుమతులు వచ్చేవరకూ ఆగాల్సి వస్తోందని, అందువల్ల ఆన్‌లైన్ విధానం ప్రారంభించామని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో అనుమతి మంజూరు చేయడం లక్ష్యమన్నారు.
ప్రవీణ్ ప్రకాశ్ అత్యుత్సాహంతో ఆలస్యం
పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ అత్యుత్సాహంతో ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది. 6 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారనే విషయాన్ని పట్టించుకోకుండా ఫలితాల విడుదలను ఆలస్యం చేశారు. షెడ్యూలు ప్రకారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది. 11.04 గంటల సమయంలో మంత్రి బొత్స విలేకరుల సమావేశం నిర్వహించిన హాలులోకి వచ్చారు. సాధారణంగా వచ్చిన వెంటనే ఫలితాలు విడుదల చేసి, అనంతరం ప్రసంగిస్తారు. అయితే ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రారంభోపన్యాసం చేశారు. ఆయన చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో స్ఫూర్తిగా ఉన్న కవిత గురించి మాట్లాడారు. పైగా దాని తెలుగు అనువాదాన్ని స్క్రీన్‌పై ప్రదర్శించారు. తమకు దక్కిందే గొప్పదిగా భావించాలన్నారు. అప్పటికి సమయం 11.15 గంటలు అయ్యింది. అనంతరం మంత్రి కూడా ఫలితాలు విడుదల చేయకుండా, గణాంకాలు మీడియాకు వివరించారు. 11.30 గంటలకు ఫలితాలు విడుదల చేయగా, 11.45 వరకు పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించలేదు. ప్రకటించిన సమయం కంటే 45 నిమిషాలు ఆలస్యంగా విద్యార్థులు ఫలితాలు చూసుకున్నారు.