అక్రమాస్తుల ‘పెద్దా’రెడ్డి
ABN , Publish Date - Dec 26 , 2023 | 02:56 AM
ఎన్నికల అఫిడవిట్‌లో తన కుటుంబ ఆస్తులు 53.42 ఎకరాలుగా పేర్కొన్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి..
నాలుగేళ్లలో 190 ఎకరాల సంపాదన
భూ వివరాలతో ఎమ్మెల్యేపై కరపత్రాలు
తాడిపత్రిలో పంపిణీ... కలకలం
తాడిపత్రి, డిసెంబరు 25: ఎన్నికల అఫిడవిట్‌లో తన కుటుంబ ఆస్తులు 53.42 ఎకరాలుగా పేర్కొన్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. ఈ నాలుగేళ్లలో 189.8 ఎకరాలు కొన్నారంటూ సర్వే నంబర్లతోసహా పేర్కొంటూ.. వేసిన కరపత్రాలు తాడిపత్రిలో కలకలం రేపుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ఈ కరపత్రాలను తాడిపత్రి పట్టణంలోని ప్రధాన కూడళ్లతోపాటు హోటళ్ల వద్ద పెద్దఎత్తున పంపిణీ చేశారు. టీడీపీ వారే ఈ కరపత్రాలు వేశారని వైసీపీ మద్దతుదారులు అనుమానిస్తున్నారు. ఈ కరపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘2019 ఎన్నికల అఫిడవిట్‌లో తన కుటుంబం పేరిట ఉన్న భూమిని 53.42 ఎకరాలుగా చూపించారు. ఎమ్మెల్యే అయ్యాక 189.8 ఎకరాలు కొనుగోలు చేశారు. పుట్లూరు, యల్లనూరు మండలాల్లో రైతులు సోలార్‌ప్లాంట్‌కు ఇచ్చిన భూములను ఎమ్మెల్యే తన పేర రాయించుకున్నారు. ఎమ్మెల్యే పెద్ద కోడలు సాయిఅర్పితా రెడ్డి పేరిట కోమటికుంట్లలో ఖాతా నంబరు 5561లో 43.29 ఎకరాలు, సాయిఅర్పిత తండ్రి నీలకంఠారెడ్డి పేరిట చిన్నమల్లేన్‌పల్లిలో ఖాతా నంబరు 10002లో 43.45 ఎకరాలు, చిన్న కుమారుడు సాయిప్రతా్‌పరెడ్డి పేరిట చిన్నమల్లేన్‌పల్లిలో ఖాతా నంబరు 10001లో 36.67 ఎకరాలు కొన్నారు. యల్లనూరు మండలం ఆరవీడులో 37.16 బుక్కాపురంలో 29.23 ఎకరాలను ఎమ్మెల్యే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూములు కొన్నచోట సమీపంలోని కొండలు, గుట్టలు, అటవీభూములను కూడా ఆక్రమించారు. కేవలం నాలుగేళ్లలో అధికారికంగా 189.8 ఎకరాలను కొనుగోలు చేశారని, అనధికారికంగా ఇంకా ఎన్ని వందల ఎకరాలను ఆక్రమించారో దేవుడికే తెలుసు’ అని పేర్కొన్నారు. తాడిపత్రి, యాడికి, గుత్తి, పెద్దవడుగూరు, గార్లదిన్నె, అనంతపురం మండలాల్లో పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. దందాలు చేస్తూ, భూములు కూడబెట్టుకున్న ఎమ్మెల్యే.. బీసీ కులానికి చెందిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్యపై ఆరోపణలు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాడిపత్రికి దోచుకొనేవాడు వద్దని అభివృద్ధి చేసేవాడే ముద్దని కరపత్రంలో పేర్కొన్నారు.